జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం రూరల్ మండలంలోని చియ్యేడు గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడుతూ పలు వివరాలను ఆరా తీశారు. సచివాలయ ఉద్యోగులు ప్రతినెలా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లను పంపిణీ చేస్తున్నారా, ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ డబ్బు సరిపోతుందా, మీకు ఉపయోగపడుతోందా, ఎందుకు ఉపయోగించుకుంటున్నారు, ఇందులో పొదుపు ఏమైనా చేస్తున్నారా అంటూ పలు వివరాలు జిల్లా కలెక్టర్ అడిగారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా, ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం చేయగలుగుతామా అంటూ జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ సుజావుగా పూర్తి చేయాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఇంటివద్దకే వెళ్లి పెన్షన్ ఇవ్వాలన్నారు. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మొత్తం 2,80,471 పెన్షన్లు ఉన్నాయని, పెన్షన్ల కోసం 123 కోట్ల 86 లక్షల రూపాయలను పంపిణీ చేయడం జరుగుతోందన్నారు. పెన్షన్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం అందించిన పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టి.గంగాధర్ రెడ్డి, డిఆర్డీఏ పిడి శైలజ, డిపిఓ నాగరాజు నాయుడు, జెడ్పి సీఈవో శివశంకర్, డ్వామా పీడీ సలీం బాషా, ఎంపిడిఓ దివాకర్, సచివాలయ ఉద్యోగులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ సుజావుగా పూర్తి చేయాలి
- Advertisement -


