చేతి వృత్తి దారుల సమాఖ్య ఏపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు సి లింగమయ్య పిలుపు
విశాలాంధ్ర -అనంతపురం : రాష్ట్రంలో జనగణన లో కులగణను చేపట్టాలని,స్థానిక సంస్థల్లో బిసీలకు రిజర్వేషన్లను పెంచాలని, తెలంగాణ మాదిరిగా స్థానిక సంస్థలలో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ )ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈనెల 14న విజయవాడలో గాంధీనగర్, హోటల్ ఐలాపురం ప్రక్కన,శ్రీ రామ ఫంక్షన్ హాల్ నందు జరిగే రాష్ట్రస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని చేతి వృత్తి దారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య పిలుపునిచ్చారు. స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మన రాష్ట్రంలో దాదాపు 143 వెనుకబడిన కులాలు ఉన్నాయన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికలలో బిసీలకు కేటాయించిన స్థానాలు తగ్గించడం వలన వేల సంఖ్యలో స్థానిక సంస్థలకు చెందిన పదవులు బిసీలు కోల్పోయారన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జనాభా లెక్కల సందర్భంగా కులగణన చేపట్టడం వల్ల ఏ ఏ కులాలు ఎంతమంది ఉన్నది లెక్క తేల్చిందన్నారు. అందుకనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు స్థానిక సంస్థలు ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తూ అసెంబ్లీలో రెండు బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగిందని తదుపరి గవర్నర్ ను కలిసి ఆమోదించాల్సిందిగా కోరడం జరిగిందన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా జనగణనలో కుల గణాలను చేపడతామని ప్రకటించిందన్నారు. తమది డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వం తమ పార్టీ బీసీ ప్రభుత్వమని జపం చేస్తూనే మరోవైపు కులగణన ను చేపట్టడానికి ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి వెనుకబడిన కులాల హక్కులను సాధించుకోవడానికి సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈనెల 14వ తేదీన విజయవాడలో శ్రీరామ ఫంక్షన్ హాల్ లో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతం గా బిసి కులాల నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశానికి చేతివృత్తిదారులు పెద్ద సంఖ్య లో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సమావేశాన్ని జయప్రదం చేయాలన్నారు. ఈ సమావేశంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ, రజక వృత్తిదారుల సమాఖ్య జిల్లా అధ్యక్షులుసి నాగప్ప, గీత పనివాళ్ల సంఘం జిల్లా కార్యదర్శి ఈడిగ రఘు, ఐలమ్మ కాలనీ కార్యదర్శి యూసి నాగరాజు, నగర అధ్యక్షులు టిసి భూషణ, ఆటో ఆది, వడ్డే రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.


