జిల్లా అభివృద్ధికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు
విశాలాంధ్ర బ్యూరో శ్రీ సత్యసాయి – జిల్లా ప్రజల ప్రేమ, అభిమానాలు మరువలేనివని, జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని జిల్లా కలెక్టర్ శ్రీ టీఎస్ చేతన్ అన్నారు.శుక్రవారం పుట్టపర్తి కలెక్టరేట్ పిజిఆర్ఎస్ సమావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్‌కు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తన పదవీకాలంలో ప్రజల సహకారం, ప్రజాప్రతినిధులు మరియు అధికారుల మద్దతుతో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్లగలిగానని పేర్కొన్నారు.కార్యక్రమంలో మాట్లాడిన రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలెక్టర్ ఆధ్వర్యంలో పని చేయడం తమకు అదృష్టమని, విధి నిర్వహణలో సహకారం, ప్రోత్సాహం అందించారని తెలిపారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధురా రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ టీఎస్ చేతన్ వద్ద పనిచేయడం ద్వారా చాలా నేర్చుకున్నానని, ఆయన మరికొంత కాలం జిల్లాలో కొనసాగి ఉంటే బాగుండేదని అన్నారు. అభివృద్ధి పనులలో కలెక్టర్ అందించిన సహకారం మరువలేనిదని అభిప్రాయపడ్డారు.
మాజీ మంత్రి శ్రీ పల్లె రఘునాథ రెడ్డి మాట్లాడుతు జిల్లాకు ఎంతో మేలు చేసిన కలెక్టర్ టీఎస్ చేతన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల వరకు పనిచేసి ఉంటే బాగుండేదని, అయితే ఉద్యోగుల బదిలీలు సహజమని పేర్కొన్నారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఆర్డీవోలు సువర్ణ, వివిఎస్ శర్మ, ఆనంద్ కుమార్, మహేష్, ఇన్‌ఛార్జి డిఆర్వో సూర్యనారాయణ రెడ్డి, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మైనుద్దీన్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


