–జిల్లా పశుసంవర్తక శాఖ సంయుక్త అధికారి డాక్టర్ టీవీ సుధాకర్
విశాలాంధ్ర-రాప్తాడు : పశువులకు గాలికుంటు వ్యాధి సోకకుండా నివారణకు టీకా కార్యక్రమం చేపట్టామని
జిల్లా పశుసంవర్తక శాఖ సంయుక్త అధికారి డాక్టర్ టీవీ సుధాకర్ తెలిపారు. జాతీయ పశువ్యాధి నివారణ పథకం కింద అక్టోబర్ 15 వరకు ఏడవ రౌండ్, గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం రాప్తాడు, బండమీదపల్లి, ఎం చెర్లోపల్లి గ్రామాల్లో ప్రారంభించగా, రాప్తాడు గ్రామంలో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి డివిజనల్ అధికారి డాక్టర్ రమేష్ రెడ్డి, ఆడిషనల్ ఏడీ రవిబాబు హాజరయ్యారు.
వారు మాట్లాడుతూ వ్యాధి సోకిన పశువుల్లో తీవ్ర జ్వరం , నీరసం, నోటి నుండి తీగలాగ చొంగ కారడం, నోరు, కాలిగిట్టల మధ్యలో పుండ్లు రావడం, చూడి పశువులు ఇసుకపోవటం లాంటి లక్షణాలు ఉంటాయన్నారు. వ్యాధి సోకిన పశువుల్లో పాల ఉత్పత్తి బాగా తగ్గిపోవడం, పనిచేసే సామర్ధ్యం తగ్గడం, చిన్న దూడల్లో ఆకస్మిక మరణాలు సంభవించడం లాంటి అనేక నష్టాలు జరుగుతాయన్నారు. వ్యాధిబారిన పడిన పశువులు నుండి ఆరోగ్యమైన పశువులకు త్వరగా వ్యాధి సోకే ప్రమాదం ఉండడం వల్ల గ్రామాల్లో చాలా ఆర్థిక నష్టాలు సంభవిస్తాయన్నారు. వీటిని నివారించడానికి రైతులు తప్పనిసరిగా తమ దగ్గర ఉన్న నాలుగు నెలల పైబడిన అన్ని పశువులకు గాలికుంటు టీకాలు వేయించుకోవాలన్నారు. ఏడీ డాక్టర్ ఆర్ ప్రకాష్, డాక్టర్ యు.సోమేశ్వరి, సర్పంచ్ సాకే తిరుపాల్, మండల కన్వీనర్ పంపు కొండప్ప, ఏహెచ్ఏలు విజయ్, నరేష్, గ్రేసమ్మ రైతులు పాల్గొన్నారు.


