శివనామస్మరణలతో మరోమ్రోగిన శివాలయాలు
విశాలాంధ్ర – సీతానగరం: కార్తీక మాసం పరమ పవిత్రం హరి హరులకెంతో ప్రీతికరం అని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఈ మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారాల్లో శైవాలయాలు భక్తులతో పోటెత్తాయి. శివనామస్మరణంతో మారుమ్రోగాయి. సంవత్సరములో వచ్చే అన్ని నెలల్లోకి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. అందున సోమవారం ఎంతో ప్రాసత్యం సంతరించుకుంది. వేకువ జామున బ్రహ్మ ముహూర్తాన పుణ్యస్నానాలు చేసి శివ ధ్యానంతో పరమశివుడి అనుగ్రహం కోసం పంచామృతాలు, గంగాజలం, తేనె, విభూది, పలు ఫల రసాలు, రుద్రాభిషేకం చేయించి శివ వ్రత నియమాలు పాటించారు. అలా చేయటం వల్ల సిరి సంపదలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శివాలయాలు వేకువ జాము నుంచి దీప కాంతులతో శోభలు వెదజల్లాయి. కార్తీక మొదటి సోమవారం కావడంతో వేకువ జామునే మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో బారులు తీరారు. తెల్లవారుజామున దీపపు ప్రమిదల్లో జ్యోతులు వెలిగించి మహాదేవునికి మంగళ నీరాజనాలు అందించారు. మండలంలో రఘుదేవపురం, సీతానగరం, మిర్తిపాడు, మునికూడలి ప్రసిద్ధ శివాలయాల్లో భక్తులు తెల్లవారు జాము నుంచి బారులు తీరి పూజలు నిర్వహించారు. తుపాన్ హెచ్చరికలు సైతం లెక్కచేయకుండా భక్తులు 108 ప్రదిక్షణలు చేసి తమ మొక్కులను చెల్లించుకున్నారు.


