– క్రికెట్లో జాతీయ స్థాయికి ఎంపిక
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : స్థానిక జి.సి.ఎస్.ఆర్. కాలేజీకి చెందిన విద్యార్థులు ఈ నెలలో నిర్వహించిన 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాలీబాల్, క్రికెట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ 2025–26 అండర్–19 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు.
క్రికెట్ విభాగంలో టి. జగదీష్, వాలీబాల్ విభాగంలో ఎం. చరణ్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించడానికి వారు విశేష కృషి చేశారు. ప్రత్యేకంగా క్రికెట్ విభాగంలో టి. జగదీష్ రాష్ట్రస్థాయిలో ఆల్రౌండ్ ప్రతిభ చూపి, 84 పరుగులు సాధించడంతో పాటు 18 వికెట్లు తీసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ జాతీయ స్థాయి పోటీలు డిసెంబర్ 3న హర్యానా రాష్ట్రంలోని రోహ్తక్లో జరగనున్నట్లు కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ చీకటి కేశవ నారాయణరావు తెలిపారు.
ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. పురుషోత్తం రావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సి.హెచ్. రవీంద్రకుమార్, అలాగే అధ్యాపక బృందం అభినందించారు.


