పతకమూరు దామోదర్‌ప్రసాద్
బీహార్ 18 వ శాసనసభ 243 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, ప్రధాని మోదీ సారధ్యంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే) అంచనాలకు మించి విజయం సాధించింది. ప్రతిపక్ష మహాఘట్బంధన్ నేతగా బరిలో నిలిచి హోరాహోరీగా తలపడి ఈసారైనా ముఖ్యమంత్రి కావాలని ఉధృతంగా ప్రచారం సాగించిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడి) యువనేత తేజస్వి యాదవ్ ఆశలు ఆడియాసలయ్యాయి. ఎన్డీయేను దీటుగా ఢీ కొట్టడానికి కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం, ప్రతి మహిళ ఖాతాలో నెలనెలా 2500 నగదు జమ చేస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గట్టి ప్రయత్నాలు చేస్తామని పరిశ్రమల స్థాపనకు ప్రాధాన్యమిచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి యువత జీవితాలలో వెలుగులు నింపుతామని ఆశలు రేపినా అధికార కూటమి ముందు వెలవెల పోవలసి వచ్చింది. ఇందుకు భాగస్వామ్య పక్షాల పనితీరు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ప్రాచీన జాతీయ పార్టీగా ఎన్నోయేళ్లు ఈ దేశాన్ని, వివిధ రాష్ట్రాల్లో ఏకఛత్రాధిపత్యం నెరపిన కాంగ్రెస్ గంగా మైదాన రాష్ట్రాలు యూపీి, బీహార్, పశ్చిమ బెంగాల్‌లో మండల్ రాజకీయాల కారణంగా ప్రాభవం కోల్పోయి సంస్థాగతంగా కోలుకోలే నంత శిధిలస్థాయికి చేరింది. చేవలేకపోయినా అత్యధిక స్థానాలు తీసుకుని మహాపరాజయం చెందడం ఈ ఎన్నికలలో మరింత స్పష్టమైనది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్ధానాలలో పోటీచేసి 19 స్ధానాలు గెలిచిన కాంగ్రెస్ ఈసారి సర్దుబాటులో 51, స్నేహ పూర్వక పేరుతో మరో 10 మొత్తం 61 స్థానాలలో పోటీ చేసి కేవలం 6 సీట్లే గెలవడం మహాఘట్బంధన్‌్‌కు శరాఘాత మైనది. గత ఎన్నికల్లో వామపక్షాలు 16 స్ధానాలు గెలిచి కాంగ్రెస్ కంటే మెరుగ్గా ఫలితాలు సాధించినా ఈసారి కేవలం మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించడం ఆందోళన కలిగిస్తోంది. యాదవ, ముస్లిం బంధంతో 32 శాతం ఓట్లకు తోడు అత్యంత వెనుకబడిన (ఈబీసీి) కులాల ఓట్లు రా బట్టే వ్యూహంలో భాగంగా నిషదులలో 2.6 శాతం ఉన్న మల్లా ఉపకులం ఓట్ల కోసం ముకేశ్ సహానికి ఉప ముఖ్యమంత్రి హామీతో వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) తో జట్టు కట్టినా ఆ పార్టీ ఒక్క సీటూ గెలవలేక పోయింది. ముంబయిలో సినిమా సెట్ డిజైనర్‌గా పనిచేసే ముఖేష్ ఆరేడేళ్ల క్రితం బీహార్‌కు తిరిగి వచ్చి గత ఎన్నికల్లో ఎన్డీయేతో చేరారు. ప్రస్తుత ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పదవి హామీతో మహాఘట్బంధన్‌్‌తో జట్టుకట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. గంగా తదితర నదీ పరీవాహక ప్రాంతాలలో పడవలు నడపటం, చేపలు పట్టడం వంటి వృత్తుల్లో ఉన్న కేవట్, మల్లావ తదితర మత్స్యకారులు బీహార్ జనాభాలో 8 శాతం, ఈబీసీలలో గణనీయంగా ఉన్నా వారు ప్రధానంగా జేడీయూ, ఎన్డీయే మద్దతుదారులు. ఇలా ప్రధాన భాగస్వామ్య పక్షాలు నీరస ప్రభావం చూపడంతో 50 మంది యాదవులకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చినా ఇచ్చినా మహాఘట్బంధన్‌కు మహా పరాజయాన్ని చవిచూడక తప్పలేదు.
తేజస్వి నేతృత్వంలోని ఆర్జేడీ గత ఎన్నికలలో 75 సీట్లు గెలిచి పెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి 143 స్థానాలకు పోటీ చేసి కేవలం 25 సీట్లే గెలిచి, 50 సీట్లు కోల్పోయినా తన 23 శాతం ఓటు బ్యాంకును నిలబెట్టుకోగలగడం అ పార్టీకి కొంత ఊరట. బీహార్ వ్యవసాయ ప్రధాన నిరుపేద రాష్ట్రం. పట్టణ జనాభా కేవలం 11 శాతం. జీవాలు, పాడి పశువులు, మత్స్య పరిశ్రమపై ఆధారపడి మూడోవంతు రాష్ట్ర ప్రజలు మనుగడ సాగిస్తున్నారు. మహాఘట్బంధన్‌్ గెలిస్తే 1990 నుంచి 1995 వరకు సాగిన లాలూ, రబ్రీదేవి ఆటవిక పాలన మళ్లీ వస్తుందని ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజనాధ్ సింగ్, ఆరోగ్య మంత్రి నడ్డా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభృత ఎన్డీయే నాయకులు చేసిన భారీ ప్రచారం ఈబీసీి కులాలు, మహా దళితులను భీతావహులను చేసింది. అదీగాక గత పదేళ్ల కాలంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు మహిళలు, నిరుపేదలకు అందాయి. సోషలిస్టు అయిన నితీశ్ 1973 లో మంజుకుమారిని వివాహమాడినపుడు వరకట్నం వద్దని విలువలు పాటించారు. గత ఎన్నికలలో ఒంటరిగా బరిలోకి దిగి జేడీయూపై పోటీ పెట్టి ఆ పార్టీ విజయావకాశాలు దెబ్బతీసిన చిరాగ్ పాశ్వాన్ లోక్‌జనశక్తి పార్టీ ఈసారి ఎన్డీయే భాగస్వామిగా 29 స్థానాలకు పోటీ చేసి,19 చోట్ల గెలిచి బీహార్‌లో నాల్గవ పెద్ద పార్టీగా నిలిచింది. ఎల్జేపీ, మహాదళిత నేత జితన్ రామ్ మాంజి భాగస్వాములుగా ఉన్నందున గత ఎన్నికల్లో 37 శాతం ఉన్న ఎన్డీయే ఓట్లు 10 శాతం అంటే 47 శాతానికి పెరిగాయి. 2010 ఎన్నికలలో ఆర్జెేడీకి 22 స్ధానాలు,ఎన్డీయేకు 206 స్ధానాలు వచ్చాయి. 2020 ఎన్నికలలో 43 స్థానాలకే పరిమితమైన నితీశ్ జేడీయూ ఈసారి రెట్టింపు (85) స్థానాలు గెలవడమేగాక, తన సుపరిపాలనతో మహిళలు, మహా దళితులు, అత్యంత వెనుకబడిన కులాలను బాగా ఆకట్టుకుని వాళ్లు అధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని ఎన్డీయే 67 శాతం పైగా ఓట్లు సాధించడంలో ప్రశంసనీయ పాత్ర పోషించారు. అందుకే జేడీయూకు ఈసారి 5 శాతం ఓట్లు పెరిగి, 23 శాతానికి చేరాయి. నితీశ్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి బీజేపీ కుతంత్రాలు పన్ని చిరాగ్‌ను ఎగదోసినా, పెద్ద పార్టీగా బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని అప్పుడప్పుడు కొందరు కమల నేతలు సన్నాయి నొక్కులు నొక్కినా అందుకు సాహసించలేకపోయారు. నితీశ్ హిందూత్వ ఎజెండాను దూరం పెట్టారు. ప్రధాని మోదీ, తదితర కమల నేతలు వాస్తవాన్ని గుర్తించి ప్రాప్తకాలజ్ఞతతో నితీశ్‌నే పదోసారి సీఎంగా అంగీకరించారు.
బీజేపీకి 2020 లో 19.46 శాతం ఓట్లు రాగా ఈసారి స్వల్పంగా 20.08 శాతానికి పెరిగాయి. 89 స్ధానాలు గెలిచి పెద్ద పార్టీగా ఉన్నా పెరిగిన ఓట్లు కొంచమే. అసెంబ్లీలోని 38 ఎస్సీి రిజర్వుడు స్థానాలలో బీజేపీకి11, జేడీయూకి 14, దళిత పార్టీలు హిందూస్తాన్ ఆవామీ మోర్చా, లోక్‌జనశక్తి రెండిరటికీ కలిపి 9 స్థానాలు ఎన్డీయే కూటమికి మొత్తంగా 34 స్థానాలు రావడం బాగా కలిసి వచ్చింది. ప్రతిపక్ష ఆర్జెేడీకి కేవలం నాలుగు ఎస్సీ స్థానాలు మాత్రమే లభించాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఒవైసీ మజ్లిస్ పార్టీ ఈసారి 23 స్థానాలకు పోటీ చేసి సీమాంచల్ ప్రాంతంలో ఐదు స్ధానాలు గెలిచి ఆ మేరకు మహాఘట్బంధన్‌కు గండికొట్టింది. బీజేపీని అడ్డుకోవడం మజ్లిస్ పార్టీ వల్లకాదని ఒవైసి చెప్పడం గమనార్హం. పురుషుల కంటే మహిళా ఓటర్లు 9 శాతం అధికంగా ఓటింగ్‌లో పాల్గొనడం ఎన్డీఏకు లాభించింది. 31 స్థానాలలో విజేతలు పరాజితుల మధ్య ఓట్ల తేడా 5 వేలే. 11 స్థానాలలో విజేతల మెజారిటీ వెయ్యికంటే తక్కువ. సందేశ్ స్థానంలో జేడీయూ అభ్యర్థి రాధాచరన్ ఆర్జేడి అభ్యర్థి దీపూసింగ్‌ను కేవలం 27 ఓట్ల తేడాతో ఓడిరచారు. 2020 లో 19 గా ఉన్న ముస్లిం శాసన సభ్యుల సంఖ్య ఈసారి 11కు, యాదవ శాసనసభ్యుల సంఖ్య 55 నుంచి 28 కి తగ్గింది. వారిలో ఎన్డీయే నుంచి గెలిచినవారు 15 మంది కాగా మహాఘట్బంధన్ తరపున గెలిచినవారు 12 మంది మాత్రమే. ఈసారి 29 మంది మహిళలు చట్టసభకు ఎన్నికయ్యారు. బీహార్ 10 వ ముఖ్యమంత్రిగా నితీశ్ ఈ నెల 20 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జేడీయూకు14, బీజేపీికి 16, ఎల్జేపికి 3, 5 స్థానాలు గెలిచిన హెచ్‌ఏఎంకు1, 4 స్థానాలు గెల్చుకున్న ఆర్‌ఎల్‌ఎంకు ఒక్కో మంత్రి పదవి లభిస్తాయి.
ఇప్పటికీ బీహార్ జనాభాలో మూడోవంతు దుర్భర దారిద్య్రంలో ఉండటం, ఏటా ఉపాధి కోసం 25 లక్షల మంది వలసలు వెళుతూ ఉండటం, పల్లెలు జనాలతో కిక్కిరిసి ఉండటం, వారికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి అదాయాలు పెంచడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాలే. 13.4 కోట్ల బీహార్ జనాభాలో కోటిమంది వలస వెళ్లారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బీహార్ వంటి వెనుకబడిన రాష్ట్రాలు అభివృద్ధి చెందడం ఎంతో అవసరం. డబుల్ ఇంజిన్ సర్కార్ అందుకు ఎంతో శ్రమించవలసి ఉంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లక్షిత వర్గాలకు చేరేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కేంద్ర పథకాల నుంచి గరిష్ట ప్రయోజనం పొందడానికి ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారిని దిల్లీలో నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించడం అభినందనీయం. జూబిలీ హిల్స్ ఉపఎన్నికలో హస్తం పార్టీ సకల శక్తులు ఒడ్డి ఘన విజయం సాధించింది. బీజేపీ డిపాజిట్లు కోల్పోయి చతికిలబడిరది.
సీనియర్ జర్నలిస్ట్.9440990381


