Homeవిశ్లేషణపెట్టుబడికి సానుకూల వాతావరణం వైపు ముందడుగు!

పెట్టుబడికి సానుకూల వాతావరణం వైపు ముందడుగు!

- Advertisement -

టి. లక్ష్మీనారాయణ

పారిశ్రామిక – ఆర్థిక – ఆధునిక నగరం, రాప్ట్రానికి తలమానికమైన విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2025 ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడికి సానుకూల వాతావరణం సృష్టించింది. సదస్సుకు ‘‘హై-వోల్టేజ్‌’’ ప్రచారం లభించింది. తద్వారా, గత ప్రభుత్వ కాలంలో, పారిశ్రామిక రంగంలో నెలకొన్న ప్రతికూల వాతావరణం నుంచి రాష్ట్రం బయటపడిరదన్న భావన కలుగుతున్నది. ఇది అతి ముఖ్యమైన సానుకూల అంశం. రు.13,25,716 కోట్ల విలువైన 613 అవగాహన ఒప్పందాలు జరిగాయని, వాటి ద్వారా 16,31,188 ఉపాధి అవకాశాలు కలుగుతాయని అధికారికంగా వెల్లడిరచారు. నాలుకపై తేనె రాసినప్పుడు కలిగే తియ్యటి అనుభూతి లాంటి ఊరట కలిగించింది. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తుకి పారిశ్రామికాభివృద్ధి అవశ్యం. దేశంలో మూడవ అతి పొడవైన తీరప్రాంతం, నౌకాశ్రయాలు, సమృద్ధిగా ఖనిజ వనరులతో పాటు బలమైన పునాదులపై నిర్మించిన వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ ఉన్నది. అత్యంత కీలకమైన వ్యవసాయ రంగం అభివృద్ధికి దోహదపడే ‘‘పుడ్‌ ప్రాసెసింగ్‌’’ విభాగంలో కేవలం రు.13,008 కోట్లు విలువైన 38 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు, వాటి ద్వారా 47,390 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని ప్రభుత్వాధినేతలు వెల్లడిరచారు. రాష్ట్ర విభజన తర్వాత వ్యవసాయ రంగమే ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం రంగం 60% జనాభాకు జీవనోపాధి కల్పిస్తోంది. రైతులు, వ్యవసాయ కార్మికులకు జీవనాధారమైన వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడం, పారిశ్రామికాభివృద్ధిలో అంతర్భాగం కావాలి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా రైతుల ఆదాయాలను పెంచడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. నేడు వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉన్నది. ఈపూర్వరంగంలో పారిశ్రామికాభివృద్ధితో పాటు వ్యవసాయరంగాన్ని పరిరక్షించుకోవాలి. 2024-25 అంచనాల మేరకు ప్రస్తుత ధరల ప్రకారం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి రు.16,06,109 కోట్లు. అందులో, వ్యవసాయ రంగం వాటా 32.34%. జీవీఏ (స్థూల విలువకు చేర్చిన) గణాంకాల ప్రకారం వ్యవసాయ రంగం ద్వారా 35.29%, పారిశ్రామిక రంగం ద్వారా 23.18%, సేవా రంగం ద్వారా 41.53% వార్షిక సంపద సృష్టిస్తారు. అనుభవాలను పరిగణలోకి తీసుకోవాలి! 2014 తర్వాత విశాఖపట్నంలో సీిఐఐ భాగస్వామ్య సదస్సులు నాలుగైదు జరిగాయి. 2016 లో రు.4.67 లక్షల కోట్లు, 2017 లో రు.10.50 లక్షల కోట్లు, 2018 లో రు.4.39 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల పరిమాణంతో 328, 665, 734 అవగాహనా ఒప్పందాలు జరిగాయి. 2017 లో చేసుకున్న 665 అవగాహన ఒప్పందాలు అమలులోకి వస్తే 22 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తాయన్నారు. 2014-19 మధ్య కాలంలో చేసుకున్న ఎంఓయూల్లో ఎన్ని అమల్లోకి వచ్చాయో అధికారిక సమాచారం ఎక్కడా లభించలేదు. 2019 లో ప్రభుత్వం మారింది. 2023 లో రు.11,87,756 కోట్ల విలువైన పెట్టుబడుల పరిమాణంతో 92 ఎంఓయూలను ప్రభుత్వం కుదుర్చు కున్నది. వాటి ద్వారా 3.92 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని చెప్పారు. వాటిలో ఎన్ని ఆచరణకు నోచుకున్నాయో తెలియదు. ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారితనంతో, 2014 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు / సంస్థలతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాలు – వాటి అమలు వనగూడిన ప్రయోజనాలపై శ్వేతపత్రం ప్రకటిస్తే ప్రజలు హర్షిస్తారు. తాజాగా విశాఖ సదస్సులో పునరుత్పాదక శక్తి, గ్రీన్‌ హైడ్రోజన్‌, సాంకేతిక రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, ఐటి, డేటా సెంటర్లు, కృత్రిమ మేధ(ఏఐ), వస్తూత్పత్తి రంగం, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి, పర్యాటకం, ఆతిథ్యం, అంతరిక్షం, డ్రోన్లు, హైటెక్‌, గ్రీన్‌ అల్యూమినియం/బయో ఇంధనాలు, పుడ్‌ ప్రాసెసింగ్‌, తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి వీలుగా అవగాహనా ఒప్పందాలను ప్రభుత్వం చేసుకున్నది. అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం ఒక ఎత్తు, వాటిని వాస్తవ రూపంలో ప్రాజెక్టులుగా మార్చడం మరొక ఎత్తు. నేను ఆశావాదిని, కానీ, ప్రతి అంశాన్నీ విమర్శనా దృష్టితో పరిశీలించే నైజం నాది. గత అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే కొన్ని ఒప్పం దాలు కార్యరూపమే దాల్చకపోవచ్చు. పెద్ద ప్రాజెక్టులు, ముఖ్యంగా ఇంధన ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున భూమి అవసరం ఉంటుంది. ఎంఓయూల్లో గణనీయమైన భాగం, రు.5,33,351 కోట్ల విలువైనవి పునరుత్పాదక శక్తి రంగానికి సంబంధించినవే ఉన్నాయి. వాటి ద్వారా 2,66,722 ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అడుగులు వేస్తున్నట్లుంది. వ్యూహాత్మకంగా సమర్థనీయమే. పర్యా వరణ మార్పులు ప్రపంచ మానవాళికి తీవ్ర సవాలుగా పరిణమించిన నేపథ్యంలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తిపై ఆధారపడడాన్ని గణనీయంగా తగ్గించుకోవాలి. అంతర్జాతీయ సమాజం కూడా అటువైపుగానే ప్రయాణిస్తున్నది. సౌర, పవన విద్యుత్‌ ఉత్పత్తికి మన రాష్ట్రంలో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధిలో పునరుత్పాదక శక్తి కీలక పాత్ర పోషిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అదే సందర్భంలో, సమతుల్యమైన, సమగ్రాభివృద్ధిలో అంతర్భాగంగానే ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాలి. వ్యవసాయం, గ్రామీణ జీవనోపాధి, ఆహార భద్రత, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకు సంబంధించి తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్న అనుభవాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి. సామాజిక సమస్యలు - సమానత్వం - సంపద పంపిణీ అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పరిశ్రమలను, ప్రాజెక్టులను నెలకొల్పే ప్రక్రియలో భాగంగా జీవనాధారమైన భూములను, ఉపాధిని కోల్పోయే నిర్వాసితులు మొదటి లబ్ధిదారులుగా ఉండాలి. భూసేకరణ చట్టం - 2013 మేరకు నష్టపరిహారం, పునరావాస పథకాన్ని విధిగా అమలు చేయాలి. ప్రభుత్వం తప్పటడుగులు వేస్తే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగాన్ని మరింత తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉంది. గ్రామీణ, వెనుకబడ్డ గిరిజన సమాజాలకు సాధికారత కల్పించి, అందరికీ స్థిరమైన, సమ్మిళిత భవిష్యత్తును నిర్మించే వైపుగా పారిశ్రామికాభివృద్ధి జరగాలి. భూ వినియోగ విధానాన్ని విచక్షణతో అమలు చేయాలి. సామాజిక, జీవనోపాధిపై పడే ప్రభావాలను లోతుగా అధ్యయనం చేయాలి, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. సౌర, పవన, పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులు, ఇతర పరిశ్రమల కోసం వ్యవసాయ భూమిని విచక్షణారహితంగా వ్యవసాయేతర భూమిగా మార్చడం ద్వారా రైతు అస్తిత్వాన్ని, ఆహార భద్రతను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది. వ్యవసాయ భూమిని ఇంధన ప్రాజెక్టులకు వినియోగిస్తే భవిష్యత్‌ తరాలు ఆ భూమిని ఆహార ఉత్పత్తి కోసం ఉపయోగించుకునే అవకాశాన్ని కోల్పోతాయి. వ్యవసాయానికి పనికిరాని బంజరు భూములను పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు ఉపయోగించుకోవాలి. ‘‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’’ తాత్విక చింతనపై భిన్నాభిప్రాయాలు ఉన్నా, రాష్ట్రం పారిశ్రామికంగా త్వరితగతిన అభివృద్ధి చెందాలన్న అభిలాష ఉన్నది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖపట్నం, శ్రీసిటీ, కియా కార్ల పరిశ్రమ ప్రాంతంతో పాటు శ్రీకాళహస్తి - ఏర్పేడు, కొప్పర్తి, ఓర్వకల్‌, కృష్ణపట్నం తదితర ప్రాంతాల్లో పారిశ్రామికవాడలను అభివృద్ధిచేసి, పారిశ్రామికాభివృద్ధిని వికేంద్రీకరించే ఆలోచనలకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 లో హామీ ఇచ్చిన కడప ఉక్కు కర్మాగారం, రామాయపట్నం ఓడరేవును ‘‘మేజర్‌ పోర్ట్‌’’ గా కేంద్ర ప్రభుత్వ రంగంలో నిర్మించాలి. రేణిగుంట సమీపంలో మన్నవరం వద్ద నెలకొల్పాలని తలపెట్టి విరమించుకున్న బీహెచ్సీఎల్‌ - ఎన్టీపీసీ భూముల్లో సోలార్‌ ప్యానెల్స్‌ ఉత్పత్తి పరిశ్రమను నెలకొల్పాలి. ఆంధ్రప్రదేశ్‌ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు