వివిధ శాఖల పనితీరు మెరుగుదలకు కలెక్టర్ సమగ్ర సమీక్ష
గ్రామీణ సానిటేషన్ – ఆరోగ్య సేవలు – వ్యవసాయ మార్కెట్లు – శాఖల గ్రేడింగ్‌పై దృష్టి
— జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి
విశాలాంధ్ర – తూర్పుగోదావరి : ప్రతి శాఖ పనితీరును రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతోందని, శాఖల వారీగా గ్రేడింగ్‌లో ర్యాంకు పెంచుకోవడం పై దృష్టి సారించాలని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం ప్రభుత్వ శాఖల పనితీరు, సేవల నాణ్యత, లక్ష్యాల సాధన, ప్రజా సౌకర్యాల అభివృద్ధి వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గ్రామీణ నీటి సరఫరా, వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడిఎస్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, పంచాయతీరాజ్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి శాఖల ప్రాధాన్యత అంశాలను పరిశీలిస్తూ, అన్ని శాఖలు మెరుగైన గ్రేడ్ సాధించే విధంగా కృషి చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రజలతో నేరుగా సంబంధం ఉన్న అన్ని సేవల్లో పారదర్శకత, వేగం, నాణ్యత పెరగాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. *కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి చర్యలు* *యూనిట్ ఖర్చు రూ.3 లక్షలు* గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ప్రతి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ను రూ.3 లక్షల యూనిట్ కాస్ట్‌తో నిర్మిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు.స్వచ్ఛ భారత్ మిషన్ గ్రాంట్ ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్లేసుల్లో ప్రజల సౌకర్యార్థం ఈ కాంప్లెక్స్‌లు మంజూరు అవుతాయని స్పష్టం చేశారు. ఈ కాంప్లెక్స్‌లలో 2 టాయిలెట్లు, 2 యూరినల్స్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. *ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం కోఆర్డినేషన్ మీటింగ్స్ తప్పనిసరి* వైద్య ఆరోగ్య శాఖ, ఐ సి డి ఎస్ , మెడికల్ ఆఫీసర్లు కలిసి ప్రతి వారం మంగళవారం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మెడికల్ ఆఫీసర్లు అంగన్వాడీ కేంద్రాలను పర్యటించి, పిల్లలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి ఎంతమంది శ్యాం , మ్యామ్ లోపాలు గల పిల్లలు ఉన్నారో గుర్తించి, సంబంధిత ఆరోగ్య పరిస్థితి కు చెందిన నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో డెలివరీలు అధికంగా జరిగే ప్రైవేట్ హాస్పిటల్స్ వివరాలు, మాతృ మరణాలు చోటు చేసుకున్న ఆసుపత్రుల వివరాలు తప్పనిసరిగా సమర్పించాలని అధికారు లకు సూచించారు. *వ్యవసాయ మార్కెట్ కమిటీ ల ద్వారా వసూళ్లు పెంచాలని ఆదేశం* జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీకి రూ.34.31 కోట్ల వార్షిక లక్ష్యం ఉండగా, అక్టోబర్ నాటికి కేవలం రూ.13.13 కోట్లు మాత్రమే వసూలైనట్టు కలెక్టర్ పేర్కొన్నారు. వసూళ్లను వేగవంతం చేయాలని, మార్కెట్ కమిటీ గోపాలపురం మార్కెట్లో e-NAM పథకం అమలు చేయాలని ఏడి మార్కెటింగ్‌ను ఆదేశించారు. నిత్యవసర సరుకులు, వినియోగదారులు వినియోగించే ఉత్పత్తులు మార్కెట్లకు తీసుకు రావడంలో సిబ్బంది చొరవ చూపాలని, ఆమేరకు రైతులకు తగిన విధంగా ప్రోత్సాహం అందించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్, డి ఆర్వో టి. సీతారామమూర్తి, ఆర్డీవో ఆర్. కృష్ణనాయక్, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి ఎస్ . భాస్కర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, సిపివో ఎల్. అప్పలకొండ, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి వి. శాంతామణి, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి కె.ఎన్. జ్యోతి, ఐ సి డి ఎస్ పిడి టి . శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.


