Homeజిల్లాలుతూర్పు గోదావరికేంద్ర బడ్జెట్ తో రాష్టానికి ప్రయోజనం గుండు సున్నా

కేంద్ర బడ్జెట్ తో రాష్టానికి ప్రయోజనం గుండు సున్నా

- Advertisement -

రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు

మండపేట : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకరరావు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా కామన మాట్లాడుతూ ఎన్ డి ఏ లో చంద్రబాబు కీలకంగా ఉన్నారన్నారు. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రయోజనం గుండు సున్న గా ఎద్దేవా చేశారు. బాబు అండతో ప్రధానిగా నిలబడ్డ మోడీ ప్రతిసారి బడ్జెట్ లో రాష్ట్రానికి చేస్తున్నది ఘరానా మోసమేనని విమర్శించారు. రూ 50 లక్షల కోట్ల బడ్జెట్ లో ఈ సారి సైతం రాష్ట్రానికి మొండి చెయ్య చూపారని విమర్శించారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర ప్రయోజనాలకు బడ్జెట్ లో అనాపైస మందం విలువ లేదన్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ను దగా చేసిన బడ్జెట్ అన్నారు. 5 కోట్ల మంది ప్రజలను ఊరించి ఉసూరు మనిపించిన బడ్జెట్ గా అభివర్ణించారు. అమరావతికి అప్పులే తప్ప ఆపన్నహస్తం అందించలేదన్నారు. వెనకబడిన ఉత్తరాంధ్రకు ఊతమివ్వలేదనీ దుయ్యబట్టారు. రాయలసీమకు మోసమే తప్ప చిల్లిగవ్వ దక్కలేదనీ పేర్కొన్నారు. జీవనాడి పోలవరానికి జీవం పోయలేదనీ విమర్శించారు. విభజన హామీల్లో ఒక్క దానికి పట్టింపులేదన్నారు. ప్రత్యేక హోదాపై ఊసేలేదని విశాఖ స్టీల్ ప్లాంట్ పై కనికరం చూపలేదని, కడప స్టీల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు. మెట్రో రైలు ప్రస్తావన లేదని,ఇండస్ట్రియల్ కారిడార్ల సంగతి తేల్చలేదనీ విమర్శించారు. పట్టుమని 10 పైసల మందం కూడా బడ్జెట్ తో ప్రయోజనం లేదన్నారు. ఢిల్లీ ని తలదన్నే రాజధాని కడతామని అప్పులు అంటగట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
లక్ష కోట్లు ఖర్చయ్యే అమరావతికి ఏ డి బి, జపాన్ బ్యాంకుల నుంచి రూ 15 వందల కోట్లు అప్పులిప్పిస్తే రాజధాని పూర్తవుతుందా అని ప్రశ్నించారు. గతేడాది అప్పుల కింద ఇస్తామని చెప్పిన రూ 15 వేల కోట్లలో ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అంటూ నిలదీశారు. గ్యారెంటీ కింద అప్పులు అంటే ఎవరికి గ్యారెంటీ అని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం అమరావతి నిర్మాణం కేంద్రానిదే బాధ్యత అని తెలియదా అంటూ ప్రశ్నించారు. అప్పులు ఇస్తామని చెప్తే ఆంధ్రుల ఆత్మగౌరవం ఎప్పడు పూర్తవుతుందన్నారు. ఇదేనా బీజేపీ కి రాష్ట్రంపై ఉన్న చిత్తశుద్ధి అని నిలదీశారు. పోలవరం ప్రాజెక్ట్ కి తిరిగి తీరని అన్యాయం చేశారనీ ద్వజమెత్తారు. ఎత్తు 45.72 మీటర్లకు పెంచాలని కోరినా బడ్జెట్ లో తిరిగి పెడచెవిన పెట్టారన్నారు. కేవలం రూ 3 వేల కోట్లు మాత్రమే ఇచ్చి ఇక ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్లకే అని చెప్పకనే చెప్పారన్నారు. గత బడ్జెట్ లో ప్రాజెక్ట్ పూర్తికి ఇస్తామని చెప్పిన రూ 12 వేల కోట్లలో ఇచ్చింది 5 వేల కోట్లే అన్నారు. ఈ ఏడాది 3 వేల కోట్లు మాత్రమే ఇస్తే 2027 నాటికి ప్రాజెక్టు ఎలా పూర్తి అవుతుందనీ ప్రశ్నించారు. మిగిలిన నిధుల సంగతి ఏంటన్నారు. రూ 20 వేల కోట్ల ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ మిగులు కోసం పోలవరానికి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుంటే కూటమి ప్రభుత్వం మౌనంగా ఉండటం సిగ్గుచేటన్నారు. కూటమిలో పెద్దన్నగా చెప్పుకొనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు నోర్లు మెదపక పోవడం వారి పాలనాతీరుకి నిదర్శనమని విమర్శలు చేశారు. ఇప్పటికైన చంద్రబాబు పవన్ కల్యాణ్ లు కేంద్ర ప్రభుత్వం పై తమ పార్లమెంట్ సభ్యులతో వత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులకై బడ్జెట్ ను సవరించే విధంగా చర్యలు తీసుకోవాలని కామన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు