Homeవిశ్లేషణమానసిక అప్పు

మానసిక అప్పు

- Advertisement -

మనిషి ఈనాడు వింతైన సంక్షోభంలో ఉన్నాడు. అది ఆర్థికమైనది కాదు. మానసికమైనది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బతికేయొచ్చేమో కానీ, మనసు అదుపులో లేకపోతే మనిషికి దిక్కు తోచదు. మనం ఒక వింతైన ‘మానసిక అప్పు’ లో బతికేస్తున్నాం. మన ఆలోచనల మీద మనకే అధికారం లేని అప్ప్పు ఇది. పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా, లోపల ఏదో అస్పష్టమైన భయం. తీరని అసంతృప్తి మనల్ని ఒత్తిడి రూపంలో వెంటాడుతోంది. శరీరం అలసినప్ప్పుడు నిద్రపోతే సరిపోతుంది. అదే మనసు అలసిపోతే ? కావాల్సింది నిద్ర కాదు ఆలోచనల నుంచి విరామం. ఈ రోజుల్లో మంచం ఎక్కినా ప్రతి ఒక్కరూ నిద్రపోవడం లేదు. కళ్లు మూసుకుని ఆలోచనలతో యుద్ధం చేస్తున్నారు. పగలంతా కూడా మనసు ప్రశాంతంగా ఉండడం లేదు. సమాచార దాడిలో అణిగిపోతోంది. స్మార్ట్‌ఫోన్ నోటిఫికేషన్లు, అంతులేని రీల్స్, ఆఫీసు ఒత్తిళ్లు, సోషల్‌మీడియాలో కనిపించే ఇతరుల కృత్రిమ సంతోషాలు ఇవన్నీ గుక్కెడు నీరు కూడా తాగనివ్వకుండా మనల్ని ఉరకలు పెట్టిస్తున్నాయి. మనసు అడిగే అసలు అవసరాన్ని గుర్తించకుండా చిన్నచిన్న తాత్కాలిక ఆనందాలతో మోసం చేస్తున్నాం. శరీరం అలసిపోయినప్ప్పుడు ‘కాసేపు ఆగు’ అని హెచ్చరిస్తుంది. కానీ మనం వినము. స్ట్రాంగ్ కాఫీ తాగి పనిలో పడతాం, రాత్రివేళ శరీరం విశ్రాంతి కోసం పరితపిస్తున్నప్ప్పుడు మనసు అడుగుతుంది. “నాకు కొంచెం విశ్రాంతి ఇవ్వు” అని. కానీ మనం మరో రీల్, మరో స్క్రోల్, మరో లైక్ అంటూ వాయిదా వేస్తాం. చివరికి స్క్రీన్ టైం పెరుగుతుంది, బిజీ అవుతాం, దాంతో కోపతాపాలు పెరిగిపోతాయి. తర్వాత’ ఎస్కేపిజం’ అనే వ్యవస్థలో కూరుకుపోతాం. ఈ మానసిక అప్ప్పు పెరిగినప్ప్పుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. ఏదైనా చేయాలనిపిస్తుంది కానీ చేయలేము. శక్తి ఉన్నా ఉత్సాహం ఉండదు. ప్రాణం ఇచ్చే మనుషులు పక్కనే ఉన్నా మాట్లాడాలనిపించదు. అవకాశాలు వస్తున్నా అందుకునే ధైర్యం ఉండదు. ఇది సోమరితనం కాదు మనసు మీద పేరుకుపోయిన అప్పు. జీవితాన్ని ఉత్సాహంగా జీవించడం మానేసి భారంగా నెట్టుకొస్తున్నప్ప్పుడు కలిగే దుఃఖం. ఏది సంతోషాన్ని ఇస్తుందో మర్చిపోయే స్థితికి మనం చేరుకుంటాం. ఈ రోజుల్లో మనిషి బాధపడుతున్నది సంపాదన తక్కువై కాదు. అంతులేని కోరికలు ఎక్కువై. నిజానికి ఇది కేవలం ఆశ మాత్రమే కాదు. అదుపు లేని అసంతృప్తి. ఒకప్ప్పుడు మనిషి లక్ష్యం ‘తన జీవితం బాగుండాలి ‘ అనుకునేవాడు. కానీ ఇప్ప్పుడు లక్ష్యం మారింది ‘ఇతరుల కంటే బాగుండాలి ‘ అనే పరుగు మొదలైంది అదే ‘పోలిక’ అనే మానసిక వ్యాధి! ఈ పోలిక వల్ల ఆనందం రాదని తెలిసినా, ఆ పరుగు ఆగడం లేదు. ఎందుకంటే మనసు “స్వీయ గుర్తింపు” తో నిలబడటం మర్చిపోయింది. బయట ప్రపంచం ఏం చెబుతోంది ? ఎవరు ఏం కొన్నారు ? ఎవరు ఏ దేశానికి వెళ్లారు? ఎవరి ఫొటోకు ఎన్ని లైకులు వచ్చాయి? ఇవే లెక్కలు మన మనసులో నిరంతరం వెట్టి చాకిరి చేస్తుంటాయి. దురదృష్టం ఏమిటంటే ఈ చాకిరికి జీతం దక్కదు, దానికి బదులు “తీరని ఒత్తిడి” బహుమతిగా వస్తుంది. ఈ క్రమంలో మనఃశాంతిని ఫణంగా పెట్టి, మనం మానసిక అప్ప్పును పెంచేసుకుంటున్నాం. మానసిక అప్ప్పులో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టడం చాలా కష్టం. అతను బయటకు నవ్వుతూనే కనిపిస్తాడు కానీ లోపల అతి చిన్న విషయాలకు ఆందోళన చెందుతుంటారు. ‘నాకు అస్సలు టైమ్ దొరకడం లేదు” అని పదేపదే చెబుతుంటాడు. అది నిజం కాదు. మనసులో ప్రశాంతమైన చోటు లేకపోవడమే అసలు సమస్య. అది పని వల్ల వచ్చిన బిజీ కాదు, మనసులో ఉన్న అలజడి వల్ల ఏర్పడిన బద్ధకం. ఈ మానసిక కల్లోలం మధ్య ఏ నిర్ణయమూ స్పష్టంగా ఉండదు. ‘తప్పించుకునే’ నిర్ణయాలే తీసుకుంటాం. కోపం రాగానే తిట్టేయడం, బాధ కలిగితే మౌనంగా ఉండిపోవడం, ఒత్తిడిని తట్టుకోలేక అతిగా తినేయడం, ఒంటరిగా అనిపించగానే ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేయడం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని ఇవ్వచ్చు కానీ ఆ అప్ప్పు కొండలా పెరిగిపోతూ ఉంటుంది. “అయితే, అప్ప్పు నుంచి బయటపడడానికి కొండలు బద్దలు కొట్టాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా మనతో మనకు ఒక చిన్న మానసిక ఒప్పందం. శరీరానికి తిండి, నిద్ర ఎలా అవసరమో మనసుకు కూడా అవసరమే. దాని పేరు ‘నిశ్శబ్ధం’. నిశ్శబ్ధం అంటే అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడం. రోజులో కనీసం పది నిమిషాలు ఏ గ్యాడ్జెట్ లేకుండా, ఏ పనీ చేయకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ప్రశాంతంగా కూర్చోవాలి. మనసును ఎటువైపూ పరిగెత్తించకూడదు. మొదట్లో ఈ పని బోరింగ్‌గా అనిపిస్తుంది. ఆకలి తీరడానికి డైట్ మార్చినప్ప్పుడు మొదట్లో ఇబ్బందిగా ఉన్నట్టే, ఈ “డిజిటల్ నిశ్శబ్ధం” పాటించేటప్ప్పుడు గందరగోళానికి గురవుతాం. కానీ అదే సరైన మార్గం. ఏ పని చేసినా ‘పూర్తిగా ‘ చేయడం నేర్చుకోవాలి. ఈ కాలంలో కష్టమైన పని ఇదే. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చేసేవన్నీ సగం సగం పనులే. భోజనం చేస్తూ ఫోన్ చూడడం, కుటుంబంతో కబుర్లు చెబుతూ నోటిఫికేషన్లు చెక్ చేయడం, సినిమా చూస్తూ మెసేజులు పంపడం. మనం దేనికీ సమయాన్ని ఇవ్వడం లేదు. మనం గొప్పగా ‘మల్టీ టాస్కింగ” అనుకుంటున్నాం కానీ, ఇది’ ‘బహుళ పరధ్యానం’. దీనివల్ల మనసు ఎప్ప్పుడూ అసంపూర్తిగా, అసంతృప్తిగా మిగిలిపోతుంది. “నేను ఏదీ సరిగ్గా చేయలేకపోతున్నాను” అనే భావన పెరిగిపోతుంది. ఏ క్షణంలోనైతే మనం చేస్తున్న పనిని పూర్తిగా ఏకాగ్రతతో చేస్తామో అప్ప్పుడు మనసు తేలికవుతుంది. అందుకే ఒక సమయంలో ఒక పనే చేయాలి అనే సూత్రాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ పని చేసినా ఆస్వాదిస్తూ చేయాలి. ఇది సన్యాసం కాదు జీవన శాస్త్రం! మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఆలోచనల్లో సృష్టత ఉండాలి. ‘ప్రస్తుతం నేను ఏం చేస్తున్నాను?” అనే ప్రశ్నకు ఒకే సమాధానం ఉండాలి తప్ప, పది పనుల జాబితా కాదు. మానసిక అప్ప్పు భారంతో కుంగిపోయే మనిషి తనను తాను నిందించుకోవడం మొదలుపెడతాడు. దేనికి పనికిరాను, ఓడిపోయాను అనుకుంటాడు. కానీ నిజం అది కాదు ! నువ్వు ఓడిపోయిన వాడివి కాదు, కేవలం అలసిపోయిన మనసువి. నువ్వు చెడ్డవాడివి కాదు, అనవసర సమాచారంతో భారమైన మెదడువి. నువ్వు బలహీనుడివికాదు లోపల యుద్ధం జరుగుతున్నా, బయటకు నవ్వులు చిందిస్తూ జీవిస్తున్న బలమైన వ్యక్తివి” నీకు కావాల్సిందల్లా ఒక్కటే…నీ మనసుకు విశ్రాంతినివ్వడం. అలుపెరగని నీ ఆలోచనలకు శాంతిని ప్రసాదించడం. మనిషి సాధించే అసలైన విజయం ప్రపంచాన్ని గెలవడంలో లేదు, మనసును గెలవడంలోనే ఉంది. ఆ గెలుపు కోసం మనం లక్షలు ఖర్చు చేయాల్సిన పని లేదు. కావాల్సిందల్లా ఒకే ఒక్క చిన్న నిర్ణయం. ‘ఈ రోజు నుంచే నా మనసు పై భారాన్ని పెంచను. రోజూ సమయాన్ని కేటాయిస్తాను” అని అనుకోవడమే మార్పునకు నాంది. ఆ నిర్ణయమే మానసిక అప్ప్పునకు ముగింపు. అదే మనకు దక్కే నిజమైన మానసిక స్వాతంత్య్రం.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు