– పాయకరావుపేట, తుని తాపీ పనివారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు
విశాలాంధ్ర – పాయకరావుపేట : భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల పాయకరావుపేట, తుని తాపీ పనివారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జూరి నారాయణరావు హర్షం వ్యక్తం చేశారు. సంఘం కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ. 40 వేలు, మరణానికి రూ. 60 వేలు, అంత్యక్రియలకు రూ. 20 వేలు భవన, ఇతర నిర్మాణ కార్మికుల కుటుంబాలకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సంఘంలోని భవన నిర్మాణ కార్మికులు సభ్యత్వ నమోదు రెన్యువల్ చేయించుకుని, పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందా శ్రీనివాసరావు, మేడిశెట్టి కృష్ణ, పంపరబోయిన చంటి, పులి రమణ, ఓలేటి రాజు, పిల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.


