. ‘గాంధీ సరోవర’ శంకుస్థాపనకు రండి
. రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ వినతి
విశాలాంధ్ర – హైదరాబాద్: ఈసా… మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచస్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, పర్యావరణ కేంద్రంగా నిర్మించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు రావాల్సిందిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సౌత్ బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో గురువారం కేంద్ర మంత్రితో సీఎం భేటీ అయ్యారు. సుస్థిర పట్టణాభివృద్ధి లక్ష్యాలతో పర్యావరణ హితంగా, స్వచ్ఛమైన నీటితో నది ప్రవహించేలా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపడుతున్నట్లు రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన రక్షణ శాఖకు చెందిన 100 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. 1948లో జాతిపిత మహత్మా గాంధీ చితభస్మాన్ని నిమజ్జనం చేసిన బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు. గాంధీజీ ఆశయాలైన శాంతి, ఐక్యత, సుస్థిరాభివృద్ధి, నిరాడంబర జీవనశైలికి అద్దం పట్టేలా గాంధీ సరోవర్ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు రక్షణ మంత్రికి చెప్పారు. ఈ ప్రాజెక్టును ప్రపంచస్థాయి విద్యా, సాంస్కృతిక, ఆధ్యాత్మక, పర్యావరణ కేంద్రంగా నిలుపుతామని పేర్కొన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు ఈ నెలాఖరులో శంకుస్థాపన చేస్తామని, తప్పక హాజరుకావాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. ఎంపీలు డాక్టర్ మల్లు రవి, సురేశ్ షెట్కార్, డాక్టర్ కడియం కావ్య, గడ్డం వంశీ కృష్ణ, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ కేఎస్ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయకర్త డాక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆయన వెంట ఉన్నారు.
కేంద్ర నిధులతో కృష్ణా-వికారాబాద్
రైలు మార్గం నిర్మించండి
కృష్ణా-వికారాబాద్ రైలు మార్గాన్ని పూర్తిగా కేంద్ర నిధులతో చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన భూ సేకరణ వ్యయాన్ని తామే భరిస్తామని ఇప్పటికే తెలియజేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్లో ముఖ్యమంత్రి ఆయనతో భేటీ అయ్యారు. ఈ మార్గంలోని టేకల్‌కోడ్ లో లైమ్ స్టోన్ నిక్షేపాలను గుర్తించామని… సిమెంట్, జౌళి పరిశ్రమల కేంద్రంగా దానిని అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు కేంద్ర మంత్రికి వివరించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంతో పాటు కర్నాటకలోని పలు సిమెంట్ పరిశ్రమలకు సమీపంలో కృష్ణా ప్రాంతం ఉందని తెలిపారు. కొడంగల్, టేకల్‌కోడ్, దౌల్తాబాద్‌లను పారిశ్రామిక జోన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు సీఎం వివరించారు. హైదరాబాద్-చెన్నై (778 కి.మీ.), హైదరాబాద్-బెంగళూర్ (586 కి.మీ.), హైదరాబాద్-పుణే (556 కి.మీ.) హైస్పీడ్ రైలు కారిడార్లకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో 500 ఎకరాల స్థలం కేటాయిస్తామని ముఖ్యమంత్రి…అశ్వినీ వైష్ణవ్‌కు తెలియజేశారు. హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్ అమరావతి మీదుగా వెళుతుందని, అక్కడి నుంచి బందరు పోర్టుకు రైలు మార్గం మంజూరు చేయాలని కోరారు. దాంతో డ్రైపోర్ట్ నుంచి బందరు పోర్టుకు సరకు రవాణా వేగవంతం అవుతుందని వివరించారు. హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణే హైస్పీడ్ కారిడార్లు శంషాబాద్ నుంచే మొదలు పెడితే అది ట్రై జంక్షన్ అవుతుందని రైల్వే మంత్రికి తెలిపారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులకు కేంద్ర మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు. పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో మామూనూరు ఎయిర్పోర్ట్…
వరంగల్‌కు సమీపంలో ఏర్పాటు చేయనున్న మామూనూరు ఎయిర్‌పోర్ట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాలని పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌లోని ఆయన ఛాంబర్లో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ పూర్తయినందున వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. కార్గో సేవలతో పాటు మెయింటెనెన్స్… ఓవర్ హాల్ రిపేర్ (ఎంఓఆర్) సదుపాయాలు ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగరం పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోందని, దగ్గరలో రెండేళ్లకోకసారి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ జాతర మేడారంలో జరుగుతుందని ఆయనకు చెప్పారు. వరంగల్ ఎయిర్పోర్ట్ … ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలకు కేంద్రంగా ఉంటుందని తెలిపారు.
ఆదిలాబాద్ విమానాశ్రయానికి అనుమతులు వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఆ విమానాశ్రయానికి అవసరమైన 249.82 ఎకరాలు అదనంగా అందజేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ మామూనూరు ఎయిర్పోర్ట్ పనుల ప్రారంభానికి తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను అక్కడకు పంపిస్తానని రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు.


