విశాలాంధ్ర – ధర్మవరం : మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు రిలే నిరాహార దీక్షలు ఆపము అని జయకృష్ణ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ కుల్లాయప్ప యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు తాసిల్దార్ కార్యాలయ ముందు దీక్షా శిబిరాన్ని నిర్వహించారు. ఈ దీక్షా శిబిరం ఆరవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు హిందూ దేవాలయాలలో జరుగుతున్న అన్యాయాలు, పరిష్కరించని సమస్యలపై హిందూ సమ్మేళనా కమిటీ పోరాటం చేస్తుందని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా తాము హిందూ ధర్మం కాపాడడం కోసం అనేక పోరాటాలు సల్పడం జరిగిందని, సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఈ నిరాహార దీక్షల చేస్తున్నామని తెలిపారు. దేవాలయాలను ప్రభుత్వ ఆధీనం నుండి తొలగించాలని, స్వతంత్ర హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని, విద్యా సంస్థలలో హిందూ ధర్మ బోధన అనుమతించాలని, దేవాలయ మాన్యాలు ఆక్రమణలు తొలగించాలని, హిందూ మైనారిటీ విద్యాసంస్థలు ఏర్పాటుకు అనుమతించాలని, పూజారులకు 15వేల రూపాయలు నెలసరి వేతనం ఇవ్వాలని, పల్లెటూరు లలో ప్రజల ప్రాణాలు కాపాడడానికి పల్లెటూరు హాస్పిటల్ లో 24 గంటల పాటు ఎంపీపీ ఎస్ డాక్టర్ అందుబాటులో ఉండాలని, ప్రతి పీహెచ్సీ లో ముగ్గురు ఎంపీపీ ఎస్ డాక్టర్లను ప్రభుత్వం వెంటనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. మా సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు ఈ దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళన కమిటీ సభ్యులు, దీక్షలో అంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి, భరత్, శ్యాం, బండి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.


