మన విదేశాంగ విధానాన్ని ఎవరు రూపొందిస్తారు అన్నది పెద్ద అనుమానంగా తయారైంది. మోదీ నడవడిక చూస్తే మన విదేశాంగ విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్దేశిస్తున్నారనిపిస్తోంది. ఒక వైపున ఇరాన్ అమెరికా సైనిక స్థావరాలున్న అనేక దేశాలపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ మీద క్షిపణులతో దాడి చేస్తోంది. టర్కీ గగనతలంలోకి ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు నాటో కూటమి వైమానిక రక్షణ వ్యవస్థను నాశనం చేశాయి. ఒక్క చైనా కోసం తప్ప ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసేసింది. చైనా తమకు మద్దతిస్తున్నందు వల్ల చైనా నౌకలను మాత్రం అనుమతిస్తామని ఇరాన్ చెప్తోంది. ఇది మన దేశానికి అంత సానుకూల పరిణామం ఏమీ కాకపోవచ్చు. దీనివల్ల చమురు ఎగుమతులకు తీవ్ర విఘాతం కలగక తప్పదు. మన దేశంలో చమురు నిలవలు 25 రోజులకు మాత్రమే సరిపోతాయంటున్నారు. అయితే పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింఘ్ పురి షరా మామూలుగా ఈ మాటను ఖండిస్తున్నారు. ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి హర్దీప్ పురి జాడ లేకుండాపోయారు. యుద్ధం మొదలై బుధవారం నాటికి అయిదు రోజులు. ఈ యుద్ధం త్వరగా ముగుస్తుందని ఇరాన్‌ను సునాయాసంగా లొంగ దీయవచ్చునని ట్రంప్ భావించారు. కానీ ఇరాన్ ప్రతిఘటిస్తున్న తీరు చూస్తే యుద్ధం దీర్ఘకాలమే కొనసాగేట్టు ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు ముగిసిన తరవాత ఇరాన్ ప్రభుత్వంలోని ఎవరో ఒకరు అధికారం చేపట్టడం మంచిదని ట్రంప్ అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే ఇరాన్ అధినేత అయతుల్లా ఖామేనీని హతమార్చడంతో ఇజ్రాయెల్, అమెరికా కసి తీరి ఉండాలి. కానీ అదే సమయంలో యుద్ధం కొనసాగిస్తున్న రెండు దేశాలూ ఇరాన్‌లో అధికారం మారాలని ముందు నుంచి చెప్తూనే ఉన్నాయి. అంటే ఇరాన్‌లో అమెరికా చెప్పుచేతుల్లో ఉండే ప్రభుత్వం నెలకొనే దాకా వారిద్దరూ నిద్రపోయేట్టు లేరు. ఈ యుద్ధం వల్ల పశ్చిమాసియాకు నష్టం కలిగించడమే కాక భారత్‌కు కూడా కష్టాలు తప్పవు. ఇండియా, చైనా దేశాల ఎదుగుదలను నిలవరించడానికే అమెరికా యుద్ధానికి మరింత ఆజ్యం పోస్తోందని ఇరాన్ దౌత్యవేత్త మజీద్ హకీం ఇలాహీ అంటున్నారు. ఇరాన్‌లో ఇప్పటికి దాదాపు 800మంది యుద్ధానికి బలయ్యారు. ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధం కేవలం భౌగోళిక రాజకీయ ఘటన మాత్రమే కాదు. చమురు దిగుమతి చేసుకునే దేశాలన్నింటికీ సంకటమే. మన దేశంలో చమురు మార్కెట్లు, రసాయనిక ఎరువుల సరఫరా, నౌకాయానం, శీతోష్ణ స్థితి, పరిరక్షణ లక్ష్యాలు మొదలైన అనేక అంశాల మీద యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. చమురు దిగుమతికి సంబంధించిన ఏ ఆటంకం అయినా మన ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. చమురుకు బదులు విద్యుత్తు, తరగని ఇంధనం మొదలైనవన్నీ శీతోష్ణ స్థితి పరిరక్షణలో మన లక్ష్యాలకు విఘాతం కలిగిస్తాయి. మరీ మాట్లాడితే భద్రతకు కూడా ముప్పు ఉండవచ్చు. మనకు అవసరమయ్యే ముడి చమురులో 85 శాతం దిగుమతి చేసుకుంటాం. ఇందులో చాలా భాగం హోర్ముజ్ జలసంధి ద్వారానే రావాలి. చమురు ధర బ్యారెల్ కు పది డాలర్లు పెరిగినా అది మనకు మోయలేని భారమే. ఇంధనం, రవాణా, పెట్రో రసాయనాల ధరలు అమాంతం పెరిగిపోతాయి. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద అధర్మ యుద్ధం ప్రారంభించినా విశ్వగురువు మౌన ముద్రలోనే ఉంటారు. పైగా అమెరికా సైనిక స్థావరాల మీద ఇరాన్ దాడులు చేస్తే దాన్ని విశ్వగురువు సహించలేదు. పైగా ఆ దేశాలకు సానుభూతి తెలియజేశారు. అంటే ఇరాన్ మీద యుద్ధం సబబైందేనని విశ్వగురువు భావన. 2020లో ఓ ఇరాన్ కమాండర్‌ను మరో దేశంలో డ్రోన్ దాడితో హతమారిస్తే విశ్వగురువు ఇదేమని అడగనే లేదు. అది ఇరాన్ సార్వభౌమాధికారాన్ని కాలరాయడమే. ఇజ్రాయెల్ పలస్తీనా మీద మారణహోమం కొనసాగించినా విశ్వగురువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కాల్పుల విరమణను ఇజ్రాయెల్ అనునిత్యం ఉల్లంఘించినా విశ్వగురువు మాట్లాడరు. పైగా యుద్ధం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు ఇజ్రాయెల్‌కు వెళ్లి వచ్చారు. రెండు దేశాలు కలిసి విడుదల చేసిన సంయుక్త ప్రకటన ఏదీ లేదు. అలాంటప్పుడు విశ్వగురువు ఇజ్రాయిల్ వెళ్లి ఏం సాధించుకొచ్చినట్టు! స్వతంత్ర దేశమైన వెనిజులా అధ్యక్షుడు మదురోను, ఆయన భార్యను అమెరికా అపహరించుకు వెళ్లినా విశ్వగురువు నోరు తెరవలేదు. అమెరికాలో సరైన పత్రాలు లేకుండా ఉన్న భారతీయులను ట్రంప్ కాళ్లు, చేతులు కట్టేసి విమానాల్లో కుక్కి పంపినప్పుడూ విశ్వగురువుకు ఏ మాత్రం అవమానంగా భావించలేదు. ఇదేమిటని ప్రశ్నించలేదు. చిన్నపాటి నిరసనో, ఖండనో లేదు. మన మీద ట్రంప్ అడ్డగోలు సుంకాలు విధించినప్పుడూ విశ్వగురువు నోరు తెరిచే సాహసం చేయలేదు. పైగా సాష్టాంగ పడిపోయారు. పెంచిన సుంకాలను తరవాత కొంత తగ్గించి ఉండొచ్చు. కానీ అంతకు ముందుకన్నా ఎక్కువే. అదీకాక అమెరికా మీద మనం ఒక్క రూపాయి సుంకం కూడా విధించం. భారత్ విశ్వగురువు అవుతుందని, నాగరికతలో మనమే ప్రపంచానికి గురువులమని, వివేకం, శాంతి, సామరస్యాలను అందించే సత్తా మనకు మాత్రమే ఉందని విశ్వగురువు అలసట లేకుండా చెప్తూనే ఉంటారు. నిరంకుశంగా స్వతంత్ర దేశాల మీద అమెరికా విరుచుకుపడితే విశ్వగురువు నోట మాటే పెకలదు. మనమే విశ్వగురువులం అని ఢంకా బజాయించి చెప్పినా కీలక సమయాల్లో మౌనంగా ఉండిపోతాం. మోదీ ఎదుట ఉన్న మైక్రోఫోన్లు పలకవు. ఇది దౌత్యపరమైన మౌనం కాదు. దశాబ్దాల నుంచి మనం ఏ విలువల కోసమైతే పాటు పడ్డామో వాటన్నింటినీ పాతరేయడమే. ఒకప్పుడు భారత అధినేతలు మాట్లాడితే అది సింహ గర్జనలా ప్రతిధ్వనించేది. సామ్రాజ్యవాదానికి లొంగే ప్రసక్తే లేదని దిక్కులు పిక్కటిల్లేలా మన నాయకులు ప్రకటించేవారు. అలీనోద్యమ నిర్మాతగా, ప్రవక్తగా అద్వితీయమైన పాత్ర పోషించిన ఘనత మనది. పలస్తీనా నడిగడ్డలో అక్రమంగా ఇజ్రాయెల్‌ను ఏర్పాటుచేస్తే గట్టిగా వ్యతిరేకించిన దేశం ఇది. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షను తూర్పార పట్టాం. మానవ గౌరవానికి ఎక్కడ ప్రమాదం ఎదురైనా నిటారుగా నిలబడి ఎదిరించిన దేశం ఇది. ఇప్పుడు అన్నింటికీ మౌనమే. లేదా లొంగిపోవడమే. కాకపోతే దురాక్రమణకు పాల్పడే యుద్ధోన్మాదులను సమర్థించడమే. విశ్వగురువు భారత వెన్నెముకను విరిచేశారు. ఈ లొంగుబాటు, ఈ మౌనం హఠాత్పరిణామాలేమీ కాదు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడే వెన్నెముకను తాకట్టు పెట్టేశారు.


