అమెరికా ఇంటెలిజెన్స్
వాషింగ్టన్: పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారినప్పటికీ ఇరాన్ పాలనకు ప్రస్తుతానికి ఎలాంటి ఢోకా లేదని అమెరికా ఇంటెలిజెన్స్ తేల్చింది. ఇరాన్లో పాలన మార్పు కోసమే తాము యుద్ధం చేస్తున్నట్లు అమెరికా, ఇజ్రాయిల్ ప్రకటించాయి. ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఇరాన్ ప్రజలకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక సంచలనంగా మారింది. ఇరాన్ నాయకత్వం పదిలమని తేల్చిచెప్పింది. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితిలేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ నివేదిక ఇచ్చింది. ఇరాన్ ప్రజలపై ప్రభుత్వానికి పట్టు ఉన్నట్లు పేర్కొంది. చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభ భయాలతో ఒత్తిడి పెరుగుతున్నందున 2003 తర్వాత అమెరికా అతిపెద్ద సైనిక ఆపరేషన్ చేపట్టింది. ఇరాన్ పనైపోయిందని, త్వరలోనే యుద్ధం ముగిస్తామని అమెరికా వెల్లడించింది. తాను ఎప్ప్పుడంటే అప్ప్పుడే యుద్ధానికి తెర పడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ఇరాన్ నాయకత్వం కఠిన వైఖరి కొనసాగితే యుద్ధానికి ముగింపు అంత సులువు కాదని విశ్లేషకులు అన్నారు. తమ అధినేత ఖామేనీ హత్య అనంతరం ఇరాన్లో మతాధికారుల నాయకత్వ వ్యవస్థ ఐక్యంగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఇజ్రాయిల్ అంతర్గత చర్చల్లోనూ ఇరాన్లో ఇస్లామిక్ ప్రభుత్వం పతనంపై దీమా వ్యక్తం కాలేదని ఆ దేశ సీనియర్ అధికారి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ నివేదించింది. కాగా, అంతర్గత రాజకీయ సమీకరణలు మారే అవకాశం లేకపోలేదని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి.
ఇరాన్ ప్రభుత్వానికి ఢోకా లేదు
- Advertisement -
RELATED ARTICLES


