ఇరాన్ సుప్రీం అలీ ఖామేనీ నివాసంపై జరిగిన దాడిపై ‘ది టెలిగ్రాఫ’ కథనం
తెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభింలోనే సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖామేనీ మరణించిన సంగతి తెలిసిందే. కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా త్రుటిలో బయటపడినట్లు తెలుస్తోంది. వీరి భవనాన్ని క్షిపణులు తాకడానికి కొన్ని క్షణాల ముందే మొజ్తాబా అక్కడినుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇరాన్ అధికారుల సమావేశానికి సంబంధించి లీకైన ఓ ఆడియోను ఉటంకిస్తూ ‘ది టెలిగ్రాఫ’ ఈ కథనం ప్రచురించింది. “భగవంతుడి దయ వల్ల మొజ్తాబా ఏదో పని మీద భవనం నుంచి బయటకు వచ్చి గార్డెన్‌లోకి వెళ్లారు. తిరిగి లోపలికి వెళ్దామని అనుకుంటుండగా భవనాన్ని క్షిపణి తాకింది” అని ఖామేనీ కార్యాలయ ప్రొటోకాల్ హెడ్ మజహర్ హొస్సేనీ చెప్పినట్లు ఆ లీకైన ఆడియోలో ఉంది. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కనీసం మూడు క్షిపణులు ఈ భవనాన్ని తాకినట్లు ఈ ఆడియోతో తెలిసింది. ఇందులో ఒకటి అలీ ఖామేనీ సమావేశం జరుగుతున్న ప్రాంతాన్ని తాకగా.. మరొకటి పైన అంతస్తులో ఉన్న మొజ్తాబా నివాసంపై పడినట్లు సమాచారం. ఈ దాడిలో మొజ్తాబా కాలికి స్వల్ప గాయమైందని హొస్సేనీ చెప్పినట్లు ఆడియోలో ఉందట. ఇక, మూడో క్షిపణి ఇదే ప్రాంగణంలో ఉన్న ఖామేనీ అల్లుడు మిస్బా అల్ హుడా బఘేరీ నివాసంపై పడింది. దాని తీవ్రతకు మిస్బా శరీరం ఛిద్రమైందని హొస్సేనీ చెప్పినట్లు మీడియా కథనం వెల్లడించింది. ఈ దాడిలో అలీ ఖామేనీతో పాటు ఆయన భార్య, కుమార్తె, అల్లుడు, కోడలు, ఇతర కుటుంబసభ్యులు మరణించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, అనేకమంది ఇరాన్ సీనియర్ అధికారులు కూడా మృతి చెందారు. వారి శరీరాలు గుర్తుపట్టలేనివిధంగా ముక్కలయ్యాయని సమాచారం. ఇదిలాఉండగా… మొజ్తాబా ఖామేనీ ఆరోగ్య పరిస్థితి పైనా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ప్రాణాలతో ఉండటం అనుమానమే అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అయితే, మొజ్తాబా ఖామేనీ ఆరోగ్యంగానే ఉన్నారని ఇరాన్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.


