ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 13 మంది మృతిచెందారు. దీంతో బస్సుతో పాటు టిప్పర్లోనూ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను వెలికితీశారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్, బస్సు ఢీకొన్న ఘటనలో బస్సులోని ప్రయాణికులు సజీవ దహనం కావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సాయంపై సమాచారం అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం నిర్మల్ నుంచి ఏపీలోని నెల్లూరుకు వెళ్తున్న హరికృష్ణ ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం జరిగినట్లు సీఎంకు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో 20 మందిని తక్షణమే వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని వివరించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు.




