*కలగా మిగిలిన ‘వాటర్ గ్రిడ్’ పథకం
*నిర్లక్ష్యంగా అధికార యంత్రాంగం
(విశాలాంధ్ర-చిత్తూరు)
చిత్తూరు ప్రజల దాహార్తి తీర్చడానికి అమలు చేస్తామన్న ‘అమరజీవి జలధార’ (వాటర్ గ్రిడ్) పథకం కలగానే మిగిలి పోతోంది. ఈ పథకానికి పునాది రాయి వేసి 12ఏళ్లు దాటినా… ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. రాజకీయ పార్టీల నేతలు మాత్రం ప్రతి ఎన్నికల వేళ… ‘చిత్తూరు దాహార్తి తీర్చుతాం’ అని హామీలు ఇస్తూనే ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు. వేసవి వేళ… సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. నేలలు బీటలు వారుతున్నాయి. గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీటి కోసం చిత్తూరు జిల్లా ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నాలుగేళ్లుగా సమృద్ధిగా వర్షాలు కురిసినా, ఈ ఏడాది మాత్రం పరిస్థితి దారుణంగా మారింది. వేసవి ఆరంభంలోనే జలాశయాలు అడుగంటిపోతున్నాయి. ఎంతో కాలంగా వినిపిస్తున్న ‘అమరజీవి జలధార’ పథకం నేటికీ ఒక కలగానే మిగిలిపోవడం అధికార యంత్రాంగం యొక్క ఘోర వైఫల్యానికి నిదర్శనం.
అంచనాల ‘గ్రిడ్’… ఆచరణలో ‘సున్నా’
చిత్తూరు జిల్లా తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే అడుగులు పడ్డాయి. 2013 అక్టోబరులో పీలేరు వేదికగా ఆయన ఈ బృహత్తర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో నెల్లూరు జిల్లాలోని కండలేరు నుంచి 6.61 టీఎంసీల నీటిని తరలించి జిల్లా దాహం తీర్చాలని రూ. 7,390 కోట్లతో పనులు చేపట్టాలని నిర్ణయించారు. తదనంతర కాలంలో ప్రభుత్వం మారిన తర్వాత, తెలుగుదేశం హయాంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలతో రూ. 4,375 కోట్లతో టెండర్ల ప్రక్రియను కూడా పూర్తి చేశారు. 46 మండలాల్లోని 8,468 ఆవాసాలకు రక్షిత తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం ప్రదర్శించిందనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ పథకం అంచనా వ్యయం ఏకంగా రూ. 8 వేల కోట్లకు చేరింది. అంచనాలు పెరుగుతున్నాయి తప్ప, క్షేత్రస్థాయిలో పనులు మాత్రం ముందుకు కదలడం లేదు.
నిర్లక్ష్యం నీడలో….
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గణాంకాలు పరిశీలిస్తే జిల్లా ప్రజలకు అందాల్సిన ఫలాలు ఎంత భారీగా ఉన్నాయో అర్థమవుతుంది. 2058 సంవత్సరం నాటి జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రణాళికలు సిద్ధం చేశారు. కండలేరు జలాల ద్వారా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని 47 మండలాలకు చెందిన 23.47 లక్షల మంది జనాభాకు తాగునీరు అందించాల్సి ఉంది. దీనికోసం 2.76 టీఎంసీల నీటిని కేటాయించారు. అలాగే గండికోట జలాల ద్వారా మరో 18 మండలాలలోని 12.10 లక్షల మంది జనాభాకు 1.06 టీఎంసీల నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రెండేళ్లలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించి దాదాపు రెండేళ్లు గడుస్తున్నా, యంత్రాంగంలో చలనం లేదు. కండలేరు, గండికోట జలాల ఆధారంగా తిరుపతి, గుర్రంకొండ వద్ద నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ట్యాంకులకు సరఫరా చేయాలన్న లక్ష్యం నేటికీ కాగితం మీద గీసిన రేఖగానే మిగిలిపోయింది.
ఎండమావిగా మారుతున్న జలధార
రూ.కోట్లు అంచనాలు, ఫైళ్ల కదలికల మధ్య సామాన్య ప్రజల కష్టాలు మాత్రం కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పడమటి మండలాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. వేసవి తీవ్రత పెరగడంతో పల్లెల్లో తాగునీటికి అనేక కష్టాలు పడుతున్నారు. ఆడబిడ్డలు నెత్తిన బిందెలు పెట్టుకుని పొలాల వెంట, వాగుల వెంట తిరుగుతుంటే పాలకులు మాత్రం ఏసీ గదుల్లో సమీక్షలకే పరిమితమవుతున్నారు. రక్షిత తాగునీరు అందక ఫ్లోరైడ్ బారిన పడి ఎంతో మంది అనారోగ్య పాలవుతున్నారు. పొరుగున ఉన్న అన్నమయ్య జిల్లాలోనూ టెండర్లు ఖరారై పనులు ప్రారంభం కాకపోవడం గమనార్హం. ఒకవైపు ప్రభుత్వం 2058 నాటి అవసరాల గురించి మాట్లాడుతుంటే, మరోవైపు ప్రస్తుత వేసవిలో గొంతు తడుపుకోవడానికి ప్రజలు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వదిలి, రాజకీయ విమర్శలు పక్కన పెట్టి, యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలి. లేదంటే ఈ ‘వాటర్ గ్రిడ్’ పథకం కేవలం ఎన్నికల నినాదానికే పరిమితమై, చిత్తూరు జిల్లా ప్రజల దాహం శాశ్వత కరువుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ప్రజల దాహం తీర్చడం అంటే కేవలం హామీల మూటలు కాదు. ఆ నీటిని ప్రజల గడప వరకు చేర్చడమని పాలకులు గుర్తించాల్సి ఉంది.


