జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అనంత పాలదాణాను ప్రారంభించి, రైతులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు, నార్పల, అనంతపురం, కూడేరు, కుందుర్పి మండలాల్లోని పిఎసిఎస్ గోడౌన్లలో అనంత పాలదాణాను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఒక ప్యాకెట్ పాలదాణా 1,125 రూపాయలు ఉంటుందని, అవసరమైన రైతులు పాలదాణాను తీసుకోవచ్చన్నారు. జిల్లా పశుసంవర్ధక శాఖ జెడి ప్రేమ్ చంద్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి ప్రత్యేక ఆసక్తితో రైతుకు ప్రయోజనం చేకూర్చాలని అనంత పాలదాణాను జిల్లాలో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. వేసవిలో పచ్చ పశుగ్రాసాల కొరత ఉందని, అనంత పాలదాణాను రైతులు ఉపయోగించుకోవాలన్నారు. సహకార శాఖ సహకారంతో అనంత పాలదాణాను తీసుకురావడం జరిగిందని, దీని ద్వారా సహకార శాఖకు రెవెన్యూ జనరేట్ అవుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో కొన్ని మండలాల్లో అనంత పాలదాణా అందుబాటులో ఉందని, నెల తర్వాత సాధకబాధకాలు తెలుసుకొని జిల్లాలో అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిసిఓ అరుణకుమారి, పశుసంవర్ధక శాఖ బుక్కరాయసముద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డా. రత్నకుమార్, అయా శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలి
- Advertisement -


