మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఇంధనాన్ని పక్కదోవ పట్టించే వారిపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. ఇంధన సమస్యపై మంత్రి నాదెండ్ల మనోహర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు ఉన్నా సరే… లేదని వాహనదారులకు చెబుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వినియోగదారుల సేవా కేంద్రం టోల్ ఫ్రీ నంబర్ 1967 కు వచ్చిన ఫిర్యాదులలో అధిక భాగం పెట్రోల్ బంకులు ఇంధనం ఇవ్వడం లేదని వస్తున్నాయన్నారు. ఈ ఫిర్యాదులపై జిల్లావారీగా రిపోర్టులు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పెట్రోల్ బంకుల మూసివేతలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపారు. ఆయిల్ కంపెనీల నుంచి డిస్పాచ్లు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. వస్తున్న లోడ్లు వాహనదారులకు పూర్తిస్థాయిలో అందేలా చొరవ తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. ఆక్వా రైతులు ప్రస్తుతం కీలక సమయంలో ఉన్నారని, వారికి ఏ పరిస్థితుల్లోనూ ఇంధన కొరత రాకుండా చూడాలని తెలిపారు. రబీ పంట కోతల సమయంలో కూడా రైతులకు ఆయిల్ సకాలంలో అందేలా వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయం చేసుకొని పని చేయాలని ఆదేశించారు. ఎక్కడయినా ఇబ్బంది ఏర్పడితే ఉన్నతాధికారులు వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేయాలని, సోషల్ మీడియాలో అనవసరమైన వదంతులు వ్యాప్తి చేసే వారిపై నిఘా ఉంచాలని సూచనలు చేశారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. పరిస్థితి పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చే వరకు నిరంతర సమీక్ష, సమన్వయం అవసరమని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
ఆక్వా రంగాన్ని ఆదుకుంటాం: మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆక్వాకల్చర్ రంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మంగళవారం అమరావతిలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, ముఖ్యంగా ఆక్వా సాగులో ఎదురయ్యే విద్యుత్, ఇంధన సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2,34,617 హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతోందని మంత్రి వివరించారు. ఇందులో 1,21,829 హెక్టార్లలో మంచినీటి చేపల పెంపకం ఉండగా, మిగిలిన 1,12,788 హెక్టార్లలో ఎగుమతి ప్రాధాన్యత కలిగిన ఉప్పునీటి రొయ్యల సాగు జరుగుతోంది. వీటికోసం 24 గంటల పాటు ఆక్సిజన్ అందించే ఎరేటర్లు పనిచేయాలి. విద్యుత్ సరఫరాలో స్వల్ప అంతరాయాలు ఏర్పడినా పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. అందుకే, విద్యుత్ కోతలు ఉన్న సమయంలో రైతులకు డీజిల్ జనరేటర్లే ప్రధాన ఆధారం. ఈ విషయాన్ని గమనించిన ప్రభుత్వం, డీజిల్ కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టిందని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం, ఒక హెక్టారుకు రోజుకు సగటున 2 గంటల పాటు విద్యుత్ అంతరాయం కలుగుతోందని, దీనికోసం రోజుకు 5 లీటర్ల డీజిల్ అవసరమవుతుందని ప్రభుత్వం గుర్తించిందన్నారు.
అంతరాయం లేకుండా డీజిల్ సరఫరా
1.2 లక్షల హెక్టార్ల వాణిజ్య సాగుకు గాను వారానికి సుమారు 5వేల కిలోలీటర్ల డీజిల్ అవసరమని లెక్కగట్టారు. ఈ పరిమాణంలో ఇంధనాన్ని ఎప్పటికప్పుడు ఆయిల్ కంపెనీల ద్వారా బంకులకు చేరవేసి, ఆక్వా రైతులకు ప్రాధాన్యత క్రమంలో అందించేలా యంత్రాంగాన్ని సిద్ధం చేశామని మంత్రి వివరించారు. డీజిల్ సరఫరాలో ఎక్కడా నల్లబజారు దందా జరగకుండా, రైతులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. జిల్లా మత్స్యశాఖ అధికారులు గ్రామ, మండల స్థాయిలో పర్యటించి, రైతుల అవసరాలను గుర్తించి పెట్రోల్ బంకులతో సమన్వయం చేసుకోవాలి. ఎక్కడైనా డీజిల్ కొరత లేదా కృత్రిమ కొరత సృష్టించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి హెచ్చరించారు. “ఆక్వా రైతులు గత ప్రభుత్వ హయాంలో అనేక ఇబ్బందులు పడ్డారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. విద్యుత్ కోతలు లేకుండా ప్రయత్నిస్తూనే, ప్రత్యామ్నాయంగా డీజిల్ సరఫరాను సులభతరం చేశాం. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా, పంటలు సురక్షితంగా మార్కెట్కు చేరేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది” అని మంత్రి భరోసా ఇచ్చారు.


