వరుస సినిమాలతో బీజీగా ఉన్న నటి కీర్తి సురేశ్
సినిమా: మలయాళ, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి సాంప్రదాయ అందగత్తెగా పేరు తెచ్చుకున్న నటి కీర్తి సురేశ్. తెలుగులో మహానటి సినిమాలో మహానటి సావిత్రి పాత్ర పోషించి ఎక్కువ పాపులారిటీని సంపాదించుకున్న తార. విజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరిస్తుంటుంది ఈ కథానాయిక. ఈ ఏడాది వరుస చిత్రాలలో నటిస్తూ మంచి జోరుమీదుందీ తార. ఈ నేపథ్యంలో తాజాగా తమిళంలో రానున్న ఆమె కొత్త చిత్రం ‘సత్తియవాన్ సావిత్రి’ని సామాజిక మాధ్యమాలలో ప్రకటించింది. ఈ మేరకు ‘ప్రశాంతతో కూడిన ముఖం… అన్‌స్టాపబుల్ ఫోర్స్…ఇప్ప్పుడిది ఆమె ఆట’ అనే స్లోగన్‌లతో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించింది. కీర్తి సురేశ్, దర్శకుడు మిస్కిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలైన ఈ పోస్టర్‌లో కీర్తి వివాహిత మహిళగా న్యాయవాదుల మధ్య సీరియస్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో బాల శరవణన్, చారుకేశ్, శిల్పా మంజునాథ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఉత్కంఠభరితమైన కోర్టు రూమ్ డ్రామా నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు సమాచారం. కాగా… రాజ్‌కుమార్ రావుతో కలిసి నటిస్తోన్న హిందీ చిత్రం ‘రఫ్తార’ జులై 24న ప్రేక్షకుల ముందుకురానుంది. రాధికా ఆప్టేతో కలిసి నటిస్తోన్న క్రైమ్ థ్రిల్లర్ ‘అక్క’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకానుంది.


