ఎట్టకేలకు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
న్యూదిల్లీ/తిరువనంతపురం: కేరళం ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. గడచిన పది రోజులుగా సాగుతున్న మల్లగుల్లాలు, చర్చల అనంతరం కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు కేరళ ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును అధికారికంగా ప్రకటించింది. సీఎం పీఠం కోసం కేసీ వేణుగోపాల్, సతీశన్ పోటీపడగా… చివరకు సతీశన్ వైపే అధిష్టానం మొగ్గుచూపింది. కాంగ్రెస్ పరిశీలకులైన అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్, దీపా దాస్‌మున్షీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్‌రమేశ్ ఈ మేరకు ప్రకటన చేశారు. వాస్తవానికి మెజారిటీ ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గు చూపినప్పటికీ… పార్టీ కార్యకర్తలు, కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్) సతీశన్‌కు మద్దతు తెలపడంతో ఆయనకే సీఎం పీఠం దక్కింది. ఈ ఎంపిక ప్రక్రియలో తెరవెనుక జరిగిన పరిణామాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేతల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ తన అత్యంత సన్నిహితుడైన కేసీ వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని బలంగా కోరుకున్నారు. అయితే, పార్టీ యంత్రాంగం, మిత్రపక్షాల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి వల్ల సతీశన్ వైపు మొగ్గు చూపక తప్పలేదు. ఈ వారం ప్రారంభంలో దిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి చర్చల్లో మొత్తం తొమ్మిది మంది సభ్యులలో ఆరుగురు వేణుగోపాల్‌కే మద్దతు పలికారు. కేవలం కే. మురళీధరన్, వీఎం సుధీరన్ మాత్రమే ప్రారం భంలో సతీశన్ పేరును ప్రతిపాదించగా, మరొక నేత తటస్థంగా ఉండిపోయారు. సంఖ్యాబలం పరంగా వేణుగోపాల్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ, పార్టీ శ్రేణుల్లో సంతృప్తిని నింపడానికి మరియు కూటమిలో ఐక్యతను కాపాడటానికి అధిష్ఠానం చివరకు సతీశన్‌ను ఎంచుకోవాల్సి వచ్చింది. కాగా, బుధవారం ఖడ్గే, రాహుల్ భేటీ అయ్యి సీఎం ఎంపికపై తుది నిర్ణయం తీసుకున్నారు. దాస్ మున్షీ మాట్లాడుతూ… రాష్ట్రంలో సీఎల్పీకి కొత్త నాయకుడిని నియమించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖడ్గేకు పూర్తి అధికారం ఇవ్వాలన్న కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం తీర్మానానికి అనుగుణంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలతో సహా అనేక ఇతర నాయకులతో సమావేశమైన ఏఐసీసీ పరిశీలకులతో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖడ్గే, సోనియా గాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విస్తృత చర్చలు జరిపారని పేర్కొన్నారు. ఈ చర్చలన్నింటి ఆధారంగా వీడీ సతీశన్‌ను సీఎల్పీ నాయకుడిగా నియమించాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అయితే ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది తాను కేరళ ం వెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.
ఎవరీ సతీశన్?
వృత్తిరీత్యా న్యాయవాది అయిన వీడీ సతీశన్, కేరళం రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నేత. 2001 నుంచి ఎర్నాకులం జిల్లాలోని పరవూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన, గత ఎన్నికల్లోనూ ఆరోసారి అదే స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. విద్యార్థి దశలోనే ఎనఎస్ యూఐ ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆయన, 2021 నుండి 2026 వరకు కేరళం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా తన వాగ్ధాటిని వినిపించారు. రాజకీయాల్లోకి రాకముందు కేరళ ం హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి 102 స్థానాల్లో విజయం సాధించడంలో సతీశన్ పాత్ర కీలకం. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 63 స్థానాలను గెలుచుకుంది.
నాకు అసంతృప్తి లేదు: కేసీ వేణుగోపాల్
కేరళ సీఎంగా వీడీ సతీశన్ ఎంపికను స్వాగతిస్తున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. సతీశన్ ఎంపికపై ఎలాంటి అసంతృప్తి లేదని వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని స్పష్టం చేశారు. సతీశన్ నాయకత్వంలో కేరళం ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తామని కేసీ వేణుగోపాల్ వెల్లడించారు.
యూడీఎఫ్ విజయం సమష్టి కృషి ఫలితం: సతీశన్
కేరళ 13వ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసిన వీడీ సతీశన్ తన తొలి స్పందనలో రాజకీయ పరిణతిని, ఐక్యతా రాగాన్ని వినిపించారు. యూడీఎఫ్ సాధించిన భారీ విజయం ఏ ఒక్క వ్యక్తిదో కాదని, ఇది ‘టీమ్ యూడీఎఫ’, లక్షలాది మంది పార్టీ కార్యకర్తల విజయమని ఆయన స్పష్టం చేశారు. సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం తనపేరును ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ… “కాంగ్రెస్ నాకు భారీ బాధ్యతను అప్పగించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, రాహుల్ గాంధీకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని ఆయన తెలిపారు. పార్టీలో ఐక్యతను చాటేలా యూడీఎఫ్ గెలుపునకు ప్రధాన కారకులు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల అని పేర్కొన్నారు. చెన్నితలను ‘నా నాయకుడు’ అని అభివర్ణిస్తూ, ఆయనతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు సన్నీ జోసెఫ్‌తో కలిసి పనిచేస్తానని చెప్పారు. “మనం భారీ సవాళ్లను ఎదుర్కొంటున్నాం.
నూతన కేరళం నిర్మాణానికి ప్రజల సహాయ సహకారాలు కావాలి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం” అని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవిని ‘దేవుడిచ్చిన బాధ్యత’గా అభివర్ణిస్తూ, ప్రజా జీవితంలో కొత్త అధ్యాయాన్ని తిరగరాస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి ఎంపికలో జరిగిన జాప్యంపై స్పందిస్తూ, ప్రతి ఎమ్మెల్యే, సీనియర్ నేతతో చర్చించి నిర్ణయం తీసుకున్నామని, ఈ ప్రక్రియలో సిగ్గుపడాల్సినదేమీ లేదని అన్నారు. మంత్రివర్గ కూర్పు, ప్రమాణస్వీకార తేదీపై మిత్రపక్షాలతో చర్చించాక పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని, గవర్నర్‌తో సంప్రదించి ప్రమాణస్వీకార తేదీని ఖరారు చేస్తామని సతీశన్ వివరించారు.


