*జనగణమన జాతీయ గీతం సమాధికి కుట్ర
*మామూలీకరణ నిషేధించాలి
*‘సర్’ కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలి
*భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అందరిదీ
-ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్
(విశాలాంధ్ర - తిరుపతి)
‘‘వచ్చే ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురుతుందనే నమ్మకం లేదు. నేడు జాతీయ గీతం కంటే ముందు వందేమాతరం పాడాలని చెబుతున్నారు. సమయం తక్కువగా ఉందనే నెపంతో జాతీయ గీతాన్ని పక్కన పెట్టే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుత సమాజంలో ప్రతి తప్పు, అన్యాయం ‘మామూలు’ అయిపోయింది. అందుకే ఈ ‘మామూలీకరణ’ను నిషేధించాలి. ‘సర్’ (Sir – సర్వాధికారాలు చెలాయించే పాలకుల ధోరణి) కు వ్యతిరేకంగా పౌరులు ఉద్యమించాలి. భారత రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అందరిదీ.’’అని ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ అన్నారు. తిరుపతి నగరం బైరాగపట్టెడలోని గంధమనేని శివయ్య, కృష్ణారెడ్డి భవన్ లో ఆదివారం ‘భారత రాజ్యాంగం – సవాళ్లు’ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ శాసనమండలి సభ్యులు జల్లి విల్సన్ అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పరకాల ప్రభాకర్ మాట్లాడారు. ఆయన మాటల్లోనే… ‘‘ప్రస్తుత పాలకులు దేశంలో భావప్రకటన స్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారు. గతంలో సమావేశాలు పెట్టుకోవడం, స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణం ఉండేది. కానీ భవిష్యత్తులో స్వేచ్ఛగా మాట్లాడుకోవడం అసంభవంగా మారే ప్రమాదం ఉంది. మన రాజ్యాంగ మౌలిక స్వరూపం, విలువలు ఇతర దేశాల కంటే ఎంతో విశిష్టమైనవి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు ఎక్కడో ఒకచోటుకు వెళ్లి రాజ్యాంగాలు రాయించుకుని తెచ్చుకున్నాయి. కానీ మన దేశంలో మూడు సంవత్సరాల పాటు సుదీర్ఘంగా చర్చించి ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఐరోపా, ఆసియాలోని కొన్ని దేశాల్లో ‘ఈ దేశం ఫలానా జాతి పౌరులకే చెందుతుంది’ అనే చర్చలు జరిగాయి. కానీ మన దేశంలో అలాంటి చర్చ జరగలేదు. మన దగ్గర జరిగిన మూడు సంవత్సరాల చర్చలన్నీ ‘దేశంలో ఉన్న అసమానతలను ఎలా రూపుమాపాలి? రాచరిక పాలన నుండి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి దేశాన్ని ఎలా తీసుకురావాలి?’ అనే అంశాలపైనే సాగాయి. భారత రాజ్యాంగం సామాజిక, ఆర్థిక న్యాయం జరిగే విధంగా రూపొందించబడింది. ఇది ప్రభుత్వాలు ప్రజలపై స్వారీ చేసేలా కాకుండా, ప్రజలు చెప్పినట్లు ప్రభుత్వం నడుచుకునేలా చేస్తుంది. కానీ నేడు రాజ్యాంగంపై దాడి జరుగుతోంది. నెమ్మదిగా అందులోని ముఖ్యాంశాలను తొలగిస్తున్నారు. గతంలో సరళీకరణ, ప్రపంచీకరణపై వామపక్షాలు పోరాడాయి. అయితే నేడు సమాజంలో జరుగుతున్న ‘మామూలీకరణ’ను ప్రతిఘటించి పోరాడాల్సిన అవసరం ఉంది. మణిపూర్‌లో అల్లర్లు జరిగినప్పుడు రక్షణ దళాలను పంపని పాలకులు, పశ్చిమ బెంగాల్లో మాత్రం ఎన్నికల సమయంలో 2.50లక్షల మంది పోలీసు బలగాలను దించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిపై చెప్పు విసిరిన ఘటన కూడా నేడు ‘మామూలు’ అయిపోయింది. పార్లమెంటులో పది గంటల పాటు చర్చ జరిగితే, అది కేవలం వందేమాతరం పైనే జరగడం గమనార్హం. ప్రపంచంలో ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు కూడా తమ పౌరులకు ఓటు హక్కును చాలా ఆలస్యంగా ఇచ్చాయి. అమెరికా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నా, అక్కడ ఓటు హక్కు ఆలస్యంగానే వచ్చింది. కానీ స్వతంత్రం వచ్చిన వెంటనే అందరికీ సమానంగా ఓటు హక్కు ఇచ్చిన ఏకైక దేశం భారతదేశం. అయితే నేడు దేశంలో 6.5 కోట్ల ఓటు హక్కులను తీసేశారు. భవిష్యత్తులో మరో 16.50 కోట్ల ఓట్లను తొలగించబోతున్నారు. ఎస్ఐఆర్ తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు తీసివేస్తే సమాజంలో ఓటు ఉన్నవాడు, లేనివాడు అనే రెండు రకాల మనుషులే మిగులుతారు. ఓటు లేనివాడికి ఎలాంటి మౌలిక వసతులు, ప్రభుత్వ లబ్ధి ఉండదు. ఓటు ఉన్నవారికి అనుకూలంగానే విధానాలు రూపొందుతాయి. ఫలితంగా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ లాగే తయారవుతాయి. ప్రస్తుతం దేశం ఇజ్రాయేలీకరణ వైపు వెళ్తోంది. వీటిని మనం అడ్డుకోవాలి. సీఏఆర్, ఎన్ఆర్ఐలలో ‘సి’ ఉంది, కానీ ఎస్ఐఆర్ లో ‘సి’ లేదు. పౌర సమాజం వాచ్‌డాగ్‌లా అప్రమత్తంగా ఉంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలం. ఏ మతం వారికి ఆ మతం గొప్పదని రాజ్యాంగం చెప్పింది కానీ, ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ అని చెప్పలేదు. అందరూ సమానమే అని స్పష్టం చేసింది. కాబట్టి రాజ్యాంగం మనకిచ్చిన ఈ వరాన్ని కాపాడుకోవాలి.’’ అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ…
‘‘భారతదేశంలో భిన్న భాషలు, కులాలు, మతాలు ఉన్నాయి. అయితే నేడు ఆ భిన్నత్వాన్ని కాపాడుకునే పరిస్థితి ఉందా అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలింది. భారత రాజ్యాంగ పుస్తకంలోని మొదటి పేజీలోనే లౌకికత్వం, సర్వసత్తాక, ప్రజాస్వామ్య విలువల గురించి స్పష్టంగా రాశారు. ఈ 75 సంవత్సరాలలో సుప్రీంకోర్టు వేలాది తీర్పులు ఇచ్చింది. 1973లో కేరళకు చెందిన ప్రసిద్ధ ‘కేశవానంద భారతి’ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ప్రధానమైన ఐదు మౌలిక లక్ష్యాలను వివరించింది. సమాఖ్య విధానం, లౌకిక విధానం, పార్లమెంటరీ విధానం, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉండాలని కోర్టు పేర్కొంది. నరేంద్ర మోదీ మూడుసార్లు అధికారంలోకి వచ్చారు. బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలను కలిగి ఉండి, వాటిని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోంది. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన న్యాయవ్యవస్థ నేడు బీజేపీ కనుసన్నలలో నడుస్తోంది. లౌకికత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని కాపాడే వాచ్‌డాగ్‌లా ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు నేడు సుప్రీంకోర్టు కూడా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదు. బీజేపీకి అనుకూలంగా తీర్పులిచ్చిన విశ్రాంత న్యాయమూర్తులకు ఉన్నత పదవులు కట్టబెడుతున్నారు. ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి లౌకిక రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.’’
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ…
‘‘సమీప భవిష్యత్తులో రాజ్యాంగానికి పెద్ద ప్రమాదం పొంచి ఉంది. 2029 ఎన్నికల అనంతరం రాజ్యాంగం ఇలాగే మనుగడలో ఉంటుందనే నమ్మకం లేదు. దేశంలో లౌకికత్వానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. వలసలు వచ్చిన వారిని కూడా అక్కున చేర్చుకున్న గొప్ప దేశం భారతదేశం అని స్వామి వివేకానంద ఎప్పుడో చెప్పారు. గతంలో కుల వివక్షతకు గురైన వారిని కేరళలో క్రైస్తవులు ఆదరించి అన్ని సౌకర్యాలూ కల్పించారు. కానీ నేడు ప్రపంచవ్యాప్తంగా మత ఘర్షణలు జరుగుతున్నాయి. మన దేశంలో ప్రజలపై చొరబాటుదారులనే ముద్ర వేసి తరిమివేయాలని చూస్తున్నారు. మతాల పేరుతో ప్రజలను విడగొడుతున్నారు. హిందువులదే పెద్ద మతం అంటూ ఘర్షణలు సృష్టించి, అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. అభివృద్ధి పేరుతో దళితులు, మైనారిటీల ఇళ్లను కూల్చివేశారు, ఫలితంగా 7.30 లక్షల మంది నిర్వాసితులయ్యారు. గోసంరక్షణ పేరుతో దాడులు చేస్తూ 44 మంది మృతికి, 250 మంది గాయపడటానికి కారణమయ్యారు. ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కేంద్రం మూడు నల్ల వ్యవసాయ చట్టాలు తెచ్చి రాష్ట్రాల హక్కులను కాలరాస్తోంది. రాజ్యసభలో మెజారిటీ లేనప్పటికీ బిల్లులను ఆమోదించుకుంటున్నారు. దీనికి వ్యతిరేకంగా 13 నెలల పాటు రైతులు ఆందోళన చేస్తే 720 మంది మరణించారు. కేంద్రం ప్రకటిస్తున్న పంట మద్దతు ధరలు దారుణంగా ఉన్నాయి. దీనివల్ల రైతులకు సంవత్సరానికి 5 లక్షల కోట్ల నష్టం జరుగుతోంది. ప్రజలు వద్దంటున్నా రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు పెట్టిస్తున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అమలు చేస్తేనే కేంద్ర నిధులు ఇస్తామంటున్నారు. దేశంలోని 12 పోర్టులను, 6 విమానాశ్రయాలను అంబానీ, అదానీలకు అప్పగించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర నిధులు ఇస్తున్నారు. సహజ వనరులు అందరికీ దక్కాలని రాజ్యాంగంలో ఉంటే, క్రోనీ క్యాపిటలిజం పేరుతో కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారు. కార్పొరేట్ల రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు.’’
మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ…
‘‘నేడు భావ ప్రకకటన స్వేచ్ఛకకు భంగం వాటిల్లుతోంది. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ‘అర్బన్ నక్సలైట్లు’ అని ముద్ర వేసి అక్రమ కేసులు పెడుతున్నారు. గత 19 సంవత్సరాల నుండి లౌకిక వ్యవస్థపై దాడులు జరుగుతున్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఊడిగం చేయడం దారుణం. రాష్ట్రాలను బానిసలుగా మారుస్తున్నారు. లౌకిక వ్యవస్థ ఉన్న దేశంలో ఒకే మతం, ఒకే భాష, ఒకే ఆహారం సాధ్యమా? దేశాన్ని క్రోనీ క్యాపిటలిస్టులు పరిపాలిస్తున్నారు. భాష మీద దాడి చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి లేదు. హిందీ రాని వారు దేశద్రోహులని, వారిని దేశం నుండి తరిమివేయాలని కేంద్ర మంత్రులు మాట్లాడటం దారుణం. మనువాద సిద్ధాంతంతో దేశాన్ని పాలించాలని చూడటం శోచనీయం. రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టు పట్టించారు, న్యాయవ్యవస్థ సక్రమంగా నడవడం లేదు. ‘ముఖ్యమంత్రులనే జైల్లో పెడుతున్నాం, మీరెంత?’ అంటూ విపక్షాలకు సవాల్ విసురుతున్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. రాజ్యాంగం గురించి పిల్లల్లో చైతన్యం తీసుకురావాలి. హక్కులను మంటకలుపుతుంటే రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు పాలకులకు ఊడిగం చేస్తున్నాయి. మనువాద పార్టీ చుట్టూ ముఖ్యమంత్రి తిరగడం తగదు. బీజేపీ పాలిత రాష్ట్రాలలో వేల కోట్లతో అభివృద్ధి చేస్తూ, బీజేపీయేతర రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తున్నారు. హక్కులను రక్షించుకోకపోతే రాబోయే తరాల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది.’’
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ…
‘‘కేరళ ఎన్నికల అనంతరం వామపక్షాలు పతనమైపోయాయి, కనుమరుగయ్యాయని కొందరు దుష్ప్రచారం చేసుకుంటున్నారు. రాజకీయాల్లో ఓడిపోవడం వేరు, పతనం కావడం వేరు. పాలకులు పేదల గుడిసెలు కూల్చివేసి, అదే చోట బడా బాబులు ఆక్రమించుకుంటున్నా పట్టించుకోవడం లేదు. బీజేపీ వ్యతిరేకులను చొరబాటుదారులు అని ముద్ర వేస్తున్నారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగితే కేంద్రానికి పట్టదు. హక్కులపై ఉద్యమించే హక్కు లేదు, సంఘాలు పెట్టుకోకూడదు అని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఓటు హక్కు కావాలంటే తాత ముత్తాతల సర్టిఫికెట్లు తీసుకురావాలని చెప్పడం దారుణం. ఓటు హక్కు అనేది పాలకుల భిక్ష కాదు, అది మన హక్కు. ఆయుధాలు అమ్ముడుపోవాలి, యుద్ధాలు జరగాలనే నెపంతో అమెరికా ఆయుధాల తయారీ చేస్తోంది. చంద్రబాబు అనంతపురంలో ఏర్పాటు చేయబోయే డిఫెన్స్/ఆయుధ హబ్‌ను అందరూ వ్యతిరేకించాలి. దేశ సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని శక్తులను కూడగట్టుకుని పోరాటం చేయాలి. ఆగస్టు నాటికి అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజలే ముందుకు వచ్చి ఈ ఉద్యమాన్ని నడిపించాలి.’’
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ…
‘‘సమాజంలో జరుగుతున్న మామూలీకరణపై పెద్ద ఎత్తున బయట పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పౌర సమాజం చైతన్యవంతం కావాలి. ప్రజల ఆలోచనలను తుంచివేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఎవరూ ప్రశ్నించకుండా చేసేందుకు శ్రీకారం చుట్టారు. తాము అనుకున్నదే శాసనం, చేసిందే చట్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి సంకెళ్లు వేసే పరిస్థితి కొనసాగుతోంది. రాజ్యాంగ విలువలపై ప్రతి పాఠశాలలోనూ అవగాహన కల్పించాలి. జాతీయ జెండాను ఎగురవేస్తున్న వారే నేడు ప్రజల హక్కులను హరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టిందో, దాని మూలాలను నేడు ఆ పార్టీ నాయకులు మరిచిపోతున్నారు. వారు సనాతన ధర్మాన్ని నెత్తిన మోస్తున్నారు. తిరుపతి లడ్డు వివాదం చుట్టూ సంవత్సర కాలం తిరిగారు. ఆరెస్సెస్, భజరంగ్ దళ్ వంటి వారి మాటల్లో నడుస్తున్నారు తప్ప, రాష్ట్ర అభివృద్ధిపై వారికి పట్టింపు లేదు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మేధావులను కలుపుకోవాలి. బీజేపీ అకౌంట్లోకి రూ.12,000 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలి. ఆరెస్సెస్ మూల సిద్ధాంతంపై మనం పోరాడాలి. ఆదివాసుల ప్రాంతాల్లోకి చొరబడి వారిని బయటకు వెళ్లగొట్టారు. ‘ఆపరేషన్ గ్రీన్ హంట్’ (కగార్) పేరుతో వారిని చంపివేశారు. నేడు అక్షరం (మీడియా) కూడా అమ్ముడుపోతోంది. విద్యా, స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాలి. ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తారా లేదా అని మేధావి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ బానిసత్వానికి వ్యతిరేకంగా జెండాలు వేరైనా, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే ఏకైక అజెండాగా పోరాడాలి.’’
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అంజయ్య మాట్లాడుతూ…
‘‘గతంలో నేను ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సమయంలో, ఎన్నికల రోజు సాయంత్రం 3 గంటలకు నా ఓటు ఉన్న పోలింగ్ బూత్ వద్దకు వెళ్తే… ‘నీ ఓటు ఎవరో వేసేశారు’ అని చెప్పారు. దానిపై పోరాడి వెనుతిరిగాను. దేశంలో ఎన్నికల వ్యవస్థ ఎలా ఉందో దీనిని బట్టే అర్థమవుతోంది. భారత రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అత్యున్నతమైన రాష్ట్రపతిపై ఉంది. కానీ భర్త చనిపోయాడనే నెపంతో రాష్ట్రపతిని శుభ కార్యాలకు వెళ్లడానికి వీల్లేదని దూరం పెట్టారు. అలాగే టీటీడీలో దళితులను అధికారులుగా నియమించకూడదని ఆరెస్సెస్ ఆదేశాలు ఉన్నాయని తెలుస్తోంది. రాజ్యాంగాన్ని కాపాడుకుంటేనే దళితులకు, మైనారిటీలకు న్యాయం జరుగుతుంది. రాజ్యాంగాన్ని కాపాడుకొనే ఈ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలు పెద్దన్న పాత్ర పోషించాలి.’’
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ…
‘‘కేంద్ర ప్రభుత్వం దేశానికి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, వ్యవస్థలను ధ్వంసం చేస్తుంటే… మన రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు వాటిని సమర్థించడం దారుణం. సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్‌కు సపోర్ట్ చేయవద్దని ఇక్కడి పాలకులు చెప్పడం శోచనీయం. మీడియాను, సోషల్ మీడియాను వారి చేతుల్లో పెట్టుకుని వారు చెప్పిందే నిజమని ప్రజలపై రుద్దుతున్నారు. ఆరెస్సెస్ నాయకులు చిన్న పిల్లలను కవాతులకు తీసుకెళ్లి, వారి లేత మనస్సుల్లో సనాతన ధర్మం పేరిట విభజన ఆలోచనలను నూరిపోస్తున్నారు. దీనిపై మేధావి వర్గం ఆలోచించాలి. అన్ని వర్గాల ప్రజలు ఈ పోరాటంలో ముందుకు రావాలి.’’ కాగా ఈ సదస్సు మధ్యలో సభకు హాజరైన వారందరూ ఏకగ్రీవంగా ‘భారత రాజ్యాంగ ప్రతిజ్ఞ’ చేశారు. అంతకుముందు అతిథులను వేదికపైకి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి ఆహ్వానించగా, మహిళా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మునెమ్మ వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


