పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణ అగ్నిగుండంలా మారుతోంది. రాష్ట్రంలో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. గురువారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగి 47 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మంగళవారం వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో నలుగురు మృతి చెందడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
మంగళవారం రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏకంగా 19 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఎండ తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్‌లో అత్యధికంగా 45.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అనేకచోట్ల 45 డిగ్రీల మార్కును దాటింది. హన్మకొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో 44-45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్ నగరంలోనూ ఎండ తీవ్రత 43 డిగ్రీలకు చేరింది.
రెడ్ అలర్ట్, వడగాల్పుల హెచ్చరిక
రానున్న రెండు రోజులు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45-47 డిగ్రీల మధ్య నమోదవుతాయని, ప్రజలు మధ్యాహ్నం వేళ ఇళ్లకే పరిమితం కావాలని సూచించింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాలోని అన్ని మండలాల్లో మంగళవారం 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో అక్కడ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఎండవేడికి ప్రమాదాలు.. అకాల వర్షాలు
ఎండల తీవ్రతకు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం ఓ కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు, గాలివాన బీభత్సం సృష్టించాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో గాలివానకు భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో గాలి దుమారానికి ఇళ్లపై రేకులు ఎగిరిపడ్డాయి. మెదక్, సిద్దిపేట జిల్లాల్లోనూ అకాల వర్షం కురిసింది.
వడదెబ్బతో నలుగురి మృతి
రాష్ట్రంలో మంగళవారం వడదెబ్బకు నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన రైతు రాచర్ల రాజు (50), వికారాబాద్ జిల్లాకు చెందిన కార్మికుడు సామెల్ (35), ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కనక లచ్చు (52), శాంతినగర్‌కు చెందిన బిరుదుల కిరణ్‌కుమార్ (45) వడదెబ్బ తగిలి మృతి చెందారు.


