Homeస్థానికమే శాపం!

స్థానికమే శాపం!

- Advertisement -

సొంతూరు… సొంత స్థలం… అయినా
ఇంటి నిర్మాణానికి సీఆర్‌డీఏ ఆంక్షలు

విశాలాంధ్ర – సచివాలయం: రాజధాని అమరావతి పరిధిలో నివసిస్తున్న సాధారణ, మధ్య తరగతి ప్రజల సొంతింటి కలలను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) తన కఠినమైన, అనాలోచిత, అప్రకటిత ఆంక్షలతో వమ్ము చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు నెలల కాలంగా సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో నివాస గృహాల నిర్మాణాలపై అధికారులు తీవ్రమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. తమ సొంత స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా తప్పనిసరిగా సీఆర్‌డీఏ నుంచి ముందస్తు ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలని అధికారులు హుకుం జారీ చేశారు. నిబంధనకు లోబడి వేలాది మంది సామాన్యులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నప్పటికీ, అధికారులు మాత్రం ఆ ఫైళ్లను పరిశీలించకుండా పూర్తిగా అటకెక్కించేశారు. రాజధాని మలి విడత విస్తరణ ప్రక్రియ, మరికొన్ని ప్రాంతాల్లో చేపట్టాల్సిన రెండో విడత భూ సమీకరణ, వివిధ కీలక ప్రభుత్వ ప్రాజెక్టులకు ఉద్దేశించిన భూసేకరణ ప్రక్రియ పూర్తిగా ముగిసి, తుది మాస్టర్ ప్లాన్ అధికారికంగా విడుదల అయ్యేంత వరకు ఎవరికీ ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇచ్చే ప్రసక్తే లేదని అధికారులు కరాఖండిగా చెబుతున్నారు. అప్పటివరకు స్థానిక ప్రజలు ఒక్క ఇటుక కూడా కదపడానికి వీల్లేదని క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా మౌఖిక హెచ్చరికలు జారీ చేయిస్తుండటంతో రాజధాని ప్రాంత సామాన్య ప్రజల స్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ అనాలోచిత ఆంక్షల కారణంగా క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజలు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతంగా మారింది. మధ్యతరగతి కుటుంబాలు తమ జీవితకాల కష్టార్జితాన్ని, ఉద్యోగ విరమణ ద్వారా వచ్చిన సొమ్ముతో తమ పాత పెంకుటిళ్లను లేదా రేకుల షెడ్లను కూల్చివేసి కొత్త ఇళ్ల నిర్మాణాల కోసం పునాదులు తవ్వారు. తీరా సీఆర్‌డీఏ అధికారులు పనులు నిలిపివేయించడంతో, అటు తలదాచుకోవడానికి సొంత ఇల్లు లేక ఇటు నెలకు వేలాది రూపాయల అద్దెలు చెల్లించలేక ఆయా కుటుంబాలు వీధిన పడ్డాయి. దీనికి తోడు బ్యాంకు రుణాలు ఆశిస్తున్న లబ్ధిదారులకు మరో పెద్ద దెబ్బ తగిలింది. వాణిజ్య బ్యాంకులు, గృహ నిర్మాణ ఫైనాన్స్ సంస్థలు… సీఆర్‌డీఏ జారీ చేసిన ప్లాన్ అప్రూవల్, ఎల్‌పీయూసీ పత్రాలను సమర్పిస్తేనే రుణాలు మంజూరు చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. సీఆర్‌డీఏ అధికారులు మాస్టర్ ప్లాన్ జోనింగ్ మారే అవకాశం ఉందంటూ అనుమతుల ఫైళ్లను తొక్కిపెట్టడం… బ్యాంకులు అనుమతి పత్రాలు లేనిదే పైసా కూడా లోన్ ఇవ్వమని తేల్చి చెప్పడంతో సామాన్యులు రెండు వ్యవస్థల మధ్య నలిగిపోతున్నారు. ఈ గందరగోళ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వడ్డీ వ్యాపారులు రెచ్చిపోతు న్నారు. కొన్ని ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్న పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్ప్పులు తెచ్చి ఆ ఊబిలో కూరుకుపోతున్నారు. రాజధాని ప్రకటన వెలువడక ముందు, అంటే సుమారు 12 ఏళ్ల క్రితం వరకు ఆయా గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలకు స్థానిక పంచాయతీలే అతి తక్కువ రుసుముతో నిబంధనల ప్రకారం సులభంగా అనుమతులు ఇచ్చేవి. కానీ, రాజధాని విస్తరణ పేరుతో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని సుమారు 58 మండలాలు, 12 మున్సిపాల్టీలను సీఆర్‌డీఏ పరిధిలోకి చేర్చిన తర్వాత సామాన్యుడికి కష్టాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాజధాని విస్తరణకు నోటిఫై చేసిన తాడికొండ, అమరావతి, పెదకూరపాడు మండలాలతో పాటు, ఇప్పటికే ప్రధాన రాజధాని కేంద్రంగా ఉన్న తుళ్లూరు మండలంలోనూ ఈ ఆంక్షలు అత్యంత కఠినంగా అమలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వాణిజ్య సముదాయాలు, వందల కోట్లతో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు నిర్మించే కార్పొరేట్ బిల్డర్లకు వర్తింపజేసే నిబంధనలనే, కేవలం రెండు లేదా మూడు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టుకునే నిరుపేద, మధ్యతరగతి సామాన్యులకు కూడా వర్తింపజేయడం ఎంతవరకు న్యాయమని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకతలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు, ఎంపీలపై బాధితులు నిత్యం ఒత్తిడి తెస్తున్నారు. భూసేకరణ, మాస్టర్ ప్లాన్ సవరణలు అనేవి పూర్తిగా ప్రభుత్వ అంతర్గత, పరిపాలనాపరమైన ప్రక్రియలని, వాటి నెపంతో సామాన్యుల ప్రాథమిక అవసరమైన గృహ నిర్మాణాన్ని స్తంభింపజేయడం రాజ్యాంగ విరుద్ధమని నిపుణులు సైతం విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, సామాన్యుల ఇళ్లకు తక్షణ మినహాయింపులు ఇచ్చి, పాత పద్ధతిలోనే పంచాయతీల ద్వారా ప్రత్యేక విండో సిస్టమ్ ద్వారా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు