జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి, రైతు సాధికారిక సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబూరావు నాయుడు
విశాలాంధ్ర,పార్వతీపురం: ఎల్ నిన్యో ప్రభావం వల్ల ఏర్పడే వాతావరణ మార్పులను తట్టుకునేలా రైతులు ముందస్తు ప్రణాళికలతో అడుగులు వేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబు రావునాయుడులు తెలిపారు. గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో “ఎల్ నిన్యో నేపథ్యంలో… ఆలోచించి అడుగులు వేయండి” అనే అంశంపై రూపొందించిన అవగాహన కరపత్రాలను జిల్లా కలెక్టర్ తో కలిసి విడుదల చేశారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నిన్యో ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి, నేలలో తేమ శాతం వేగంగా తగ్గుతుందని, దీనివల్ల సాగు మరియు తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వరి, మొక్కజొన్న, పత్తి, పప్పుధాన్యాల పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని, అలాగే పశుగ్రాసం కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు.రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబురావునాయుడు మాట్లాడుతూ ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు రైతులకు ఎంతగానో మేలు చేస్తాయని తెలిపారు. కరపత్రంలో సూచించిన విధంగా రైతులు క్రింది జాగ్రత్తలు పాటించాలని కోరారు.విత్తన గుళికల ద్వారా పీఎండీఎస్ విధానంలో పశుగ్రాసం పెంచి పశువుల మేత కొరతను అధిగమించాలని, తక్కువ నీటితో ఎక్కువ లాభం పొందేలా ఏ.టీ.ఎం పద్ధతిలో కూరగాయల సాగు చేపట్టాలి.వర్షాభావాన్ని తట్టుకునే దేశీ విత్తనాలతో బహుళ పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. 5 నుండి 10 మంది రైతులు కలిసి కాంపాక్ట్ బ్లాక్లుగా ఏర్పడి సాగు పనులు చేపట్టాలన్నారు.పక్షిస్థావరాలు, జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలతో కూడిన ‘525 పద్ధతులను’ అనుసరించి రసాయనాలు లేని పద్ధతిలో తెగుళ్లను అరికట్టాలన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ మరియు ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ విభాగం సంయుక్తంగా ఈఅవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని రైతులందరూ
ఈసూచనలను పాటించి నష్టాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అధికారులు, వ్యవసాయ అధికారులు, ప్రకృతి వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే ఎల్ నినోకు చెక్
- Advertisement -
RELATED ARTICLES


