Homeవిశ్లేషణమోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ నాశనం

మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ నాశనం

- Advertisement -

డి.రాజా

గత పదేళ్లుగా ప్రధాని మోదీ ప్రభుత్వం భారత ఆర్థిక వ్యవస్థను వేగంగా అభివృద్ధి చెందుతున్నదిగా చూపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచిందని, “విశ్వగురు”గా మారుతోందని, ప్రపంచ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యాన్ని చేరుకుంటుందని చెబుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక అసలు నిజం ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. నిరుద్యోగం, ఆదాయ అసమానతలు, వ్యవసాయ రంగంలోని ఇబ్బందులతో పాటు ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఐతే వాటిని పరిష్కరించడంపై దృష్టి పెట్టాల్సిన పాలకులు ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చెగొట్టే దిశగా ప్రసంగాలు చేస్తున్నారు. ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు వాళ్ళ దృష్టిని మతపరమైన అంశాలతో నింపేస్తున్నారు. దేవాలయాలు, మసీదులు వంటి వివాదాస్పద అంశాల చుట్టూ తిరిగేలా పథకాల్ని రూపొందిస్తున్నారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలహీనపడుతున్నాయి. దేశానికి అవసరమైన ముడి చమురులో 90 శాతం, సహజ వాయువులో సుమారు సగం దిగుమతులు చేసుకుంటున్నాం. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా దాని ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంటోంది. పునరుత్పాదక ఇంధనం, ఆత్మనిర్భర భారత్, విశ్వగురు వంటి అంశాలు తెగ ప్రచారం చేస్తున్నారు కానీ ఇంధన అవసరాల విషయంలో భారత్ ఇప్పటికీ విదేశీ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. దీంతో దేశ వాణిజ్య లోటు తీవ్రంగా కనిపిస్తోంది అలాగే రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది. దీని కారణంగా పరిశ్రమలు, రవాణా, వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ఉత్పత్తి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. రూపాయి విలువ మరింత పడిపోకుండా నిలబెట్టేందుకు ఆర్బిఐ 2025-26 ఆర్థిక సంవత్సరంలో విదేశీ మారకద్రవ్య మార్కెట్‌లో 53 బిలియన్ డాలర్లకు పైగా విక్రయించాల్సి వచ్చింది. దేశ విదేశీ మారక నిల్వలు ఒక దశలో 720 బిలియన్ డాలర్లకు పైగా ఉండగా, ప్రస్తుతం సుమారు 681 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఈ పరిస్థితి ఆర్థిక నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది రాజకీయంగా సున్నితమైన అంశమే. ఎందుకంటే మోదీ గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూపాయి విలువను దేశ గౌరవంతో ముడిపెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే డాలర్‌కు రూ.95 వద్ద ఉండటం ఆర్థిక వ్యవస్థ ఒత్తిడి ఎలా ఉందో చూపిస్తోంది. ప్రభుత్వ ప్రచారం ఎంత ఉన్నప్పటికీ, రూపాయి బలహీనత, విదేశీ ఇంధనాలపై ఆధారపడటం వంటి వాస్తవాలు బట్టబయలవుతున్నాయని విమర్శకులు అంటున్నారు. మరో వైపు ఎరువులు, వ్యవసాయ రంగానికి సంబంధించిన అనిశ్చితి రోజురోజుకూ పెరుగుతోంది. ఎరువుల తయారీకి ఎల్ఎన్జీ, పొటాష్ వంటి దిగుమతి ముడిసరుకులపై ఆధారపడాల్సి ఉంటుంది.దీంతో ప్రపంచ మార్కెట్‌లో గ్యాస్ సరఫరా అంతరాయం ఏర్పడినా, ఎల్ఎన్జీ ధరలు పెరిగాని సరఫరా వ్యవస్థల్లో సమస్యలోచ్చినా, ఎరువుల సరిగ్గా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది వ్యవసాయ రంగానికి పెద్ద ముప్పుగా మారింది. ఇక ఈ ఏడాది భారత వాతావరణ శాఖ సాధారణ సగటుతో పోలిస్తే తక్కువ వరüపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. దీర్ఘకాల సగటు వరüపాతం కంటే సుమారు 90 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించింది. ఎందుకంటే రుతుపవనాలు బలహీనంగా మారిపోయాయి. దీని కారణంగా కేవలం వ్యవసాయ ఉత్పత్తే కాదు, మొత్తం ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయే అవకాశం ఉంది.ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపాది పథకాలు, సామాజిక భద్రతా కార్యక్రమాలను బలోపేతం చేయాల్సి ఉంటుంది. అయితే విమర్శకుల అభిప్రాయం ప్రకారం,మోదీ ప్రభుత్వం తీసుకున్న తొలి నిర్ణయాల్లో ఒకటి ప్లానింగ్ కమిషన్‌ను రద్దు చేయడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ఎంఎన్ఆర్ఈజీఏ పథకాన్ని క్రమంగా బలహీనపరచడం.
దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ, ముఖ్యంగా విదేశీ మారకద్రవ్య నిల్వలు,సేవల ఎగుమతులు, రెమిటెన్సులపై ఆధారపడటం ఒక సమస్య. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్‌కు విదేశాల నుంచి రికార్డు స్థాయిలో 135 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు వచ్చాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న లక్షలాది మంది భారతీయులు తమ కుటుంబాలకు పంపుతున్న ఈ డబ్బు దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారింది. భారత్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతున్నందున, విదేశాలకు చెల్లించే డబ్బు ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మించి ఉంటుంది. దీనినే కరెంట్ అకౌంట్ లోటు అంటారు. ఈ లోటును నియంత్రించడంలో సేవల ఎగుమతులు, ఐటీ రంగం ద్వారా వచ్చే ఆదాయం, ప్రవాస భారతీయుల రెమిటెన్సులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అయితే వీటిపైనే ఆధారపడితే భవిష్యత్తులో ఒక సవాలుగా మారే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఓపెన్ ఏఐ వంటి సంస్థల అభివృద్ధితో కృత్రిమ మేధస్సు విస్తరిస్తోంది. సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, డేటా ప్రాసెసింగ్, ప్రొఫెషనల్ సర్వీసులు వంటి రంగాల్లో ఏఐ పెద్ద మార్పులు తీసుకువస్తోంది. అయితే ఏఐ వల్ల కొన్ని పనులు ఉద్యోగాల అవసరత తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. దీంతో విదేశాల్లో భారతీయ నిపుణుల ఉపాధి అవకాశాలు, ఆదాయాలు, తద్వారా భారతదేశానికి వచ్చే రెమిటెన్సులు కూడా భవిష్యత్తులో ప్రభావితమయ్యే ప్రమాదం ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏడాది విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్‌ల నుంచి రూ.2.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో భారత్ ఆరో స్థానం నుంచి ఏడో స్థానానికి పడిపోయింది అంటే, ఒకవైపు రెమిటెన్సుల పెరుగుదల మందగించే అవకాశం, మరోవైపు అధిక ఇంధన దిగుమతులు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి అంశాలు కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై భవిష్యత్తులో మరింత ఒత్తిడిని సృష్టించే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 21వ శతాబ్దాన్ని సెమీకండక్టర్లు, అధునాతన తయారీ, రోబోటిక్స్‌, అత్యాధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు నిర్ణయించనున్నాయి. భవిష్యత్ ఆర్థిక శక్తి, సాంకేతిక ఆధిపత్యం ఈ రంగాలపైనే ఆధారపడనుంది. అయితే ఈ కీలక సాంకేతిక రంగాల్లో భారత్ ఇంకా వెనుకబడి ఉందనే విమర్శలు ఉన్నాయి. భారత్ వద్ద ఇంజినీరింగ్ ప్రతిభ, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నప్పటికీ, సెమీకండక్టర్లు, ఆధునిక సాంకేతికతలు, పరిశ్రమలకు అవసరమైన మూలధన పరికరాల విషయంలో విదేశీ దిగుమతులపైనే ఆధారపడుతోంది. వీ{న్నిటినీ మించి నిరుద్యోగం, ఆదాయ అసమానతలు వంటి సమస్యలు ఉండనే ఉన్నాయి. దేశాన్ని తయారీ రంగంలో ప్రపంచ శక్తిగా మార్చుతామని, భారీ స్థాయిలో పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని చెప్పడమే తప్ప ఆశించిన స్థాయిలో సాకారం కాలేదనే విమర్శలు ఎదుర్కొంటోంది మోదీ ప్రభుత్వం. ఇకపోతే భారత్‌లో యువ జనాభా ఎక్కువ. అయితే వారిని సరిగా ఉపయోగించుకోలేక పోయామని విమర్శకులు అంటున్నారు. దీంతో లక్షలాది మంది యువకులు ఇప్పటికీ స్థిరమైన ఉద్యోగాల కోసం పోరాడుతున్నారు. మొత్తంగా చూస్తే, భారత్‌కు ఉన్న అపారమైన యువశక్తి, ప్రతిభ, జనాభా ప్రయోజనాలను పూర్తిస్థాయిలో ఆర్థికాభివృద్ధి దిశగా మార్చడంలో సవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే విమర్శకుల అభిప్రాయం ప్రకారం ఉపాధి అవకాశాలు తగ్గిపోయి విద్య, ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాగే కొద్దిమంది పెద్ద కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చుతూ, ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందంటూ ఈ విషయాలన్నీ సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ దుష్పరిపాలనతో భారత ఆర్థిక వ్యవస్థ నాశనమైనందుకు నిరసనగా సీపీఐ ఆగస్టు 6 నుండి 15 వరకు దేశవ్యాప్త ప్రచారానికి, సెప్టెంబర్ 1న దిల్లీలో భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది.
సీపీఐ ప్రధాన కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు