జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : ఆస్తుల రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగినట్లు రుజువైతే చట్టరీత్యా చర్యలు తీసుకొని వాటిని రద్దు చేస్తామని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సెక్షన్ 77 -ఏ కింద ఇదివరకే జరిగిన కొన్ని రిజిస్ట్రేషన్ల కేసుల గురించి జిల్లా జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగినట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. వాటిని ప్రభుత్వ నియమ నిబంధన మేరకు పరిశీలించి రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విధి నిర్వహణలో భాగంగా ఆయా రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలోని అధికారుల వ్యవహరించిన తీరువల్ల క్రయ, విక్రయదారులకు నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాస్ కుమార్ ఆర్డీఓలు రామ్మోహన్, ఆర్బిఎస్కె శ్రీనివాస్, వసంతబాబు, కమిటీ కన్వీనర్ జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి శ్రీనివాసులు, కనేకల్ సబ్ రిజిస్టర్ తదితరులు పాల్గొన్నారు.


