Homeజిల్లాలుకర్నూలుఅంగన్‌వాడీ కార్యకర్త వేధింపుల కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

అంగన్‌వాడీ కార్యకర్త వేధింపుల కేసులో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

–అధికార పార్టీ సేవలో తరిస్తున్న పోలీసు వ్యవస్థ..
–న్యాయం కోసం జిల్లా ఎస్పీని కలుస్తాం
–బాధితురాలికి అండగా నిలుస్తాం
–సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య

విశాలాంధ్ర ఆలూరు (కర్నూలు జిల్లా) : పెద్దహోతూరు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త లేపాక్షమ్మ పై వేధింపులకు పాల్పడిన అధికార పార్టీకి గ్రామ నాయకుడు వీరేశ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య డిమాండ్ చేశారు. గురువారం సీపీఐ నాయకులతో కలిసి పెద్దహోతురు గ్రామంలో బాధితురాలి నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించిన ఆయన, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పూర్తి న్యాయం జరిగే వరకు సీపీఐ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం గిడ్డయ్య మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా స్థానిక టిడిపి నాయకుడు వీరేష్ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లి ఆమెను తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు.ఆ వేధింపులను తట్టుకోలేక ఆమె విషగుళికలు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని పేర్కొన్నారు. ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తైనా సరే, మహిళలపై ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు, వేధింపులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని అధికారులు ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందన్నారు. పోలీసులు తమ పౌరుషాన్ని, పవర్‌ ను ఇలాంటి అరాచక శక్తులపై చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గిడ్డయ్య స్పష్టం చేశారు. కానీ ఇక్కడ కొందరి వైఖరి చూస్తుంటే పోలీస్ వ్యవస్థే నిందితులకు చుట్టంగా మారిపోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దీనివల్ల బాధితులకు, ముఖ్యంగా అనగారిన వర్గాల ప్రజలకు న్యాయం అనేది ‘అందని ద్రాక్ష’లా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో నేరాలకు పాల్పడుతున్న అధికార పార్టీ వాళ్లపై చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ఈ సంఘటన ద్వారా స్పష్టంగా కనిపిస్తుందని, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు నిద్రావస్థలోకి పోవడం బాధాకరమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే జిల్లా ఎస్పీ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని నిందితుడిపై ఉక్కుపాదం మోపాలని కోరారు. బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ త్వరలోనే జిల్లా ఎస్పీని కలుస్తామని ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నాగరాజు, వన్నూరప్ప ,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు