వెలుగూరి రాధాకృష్ణమూర్తి
“మనిషి యొక్క అస్తిత్వమే అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది” అని చారిత్రక భౌతికవాదం బోధి స్తుంది. మామూలుగా ఆలోచిస్తే , వ్యక్తి యొక్క భౌతిక పరిస్థితులే ఆలోచనలను ప్రభావితం చేస్తాయి. నోయిడా, హర్యానా, ఎన్సీఆర్ ప్రాంతాల్లో ఇటీవల చెలరేగిన వేతనాల డిమాండ్ పై నిరసనలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. గత 12 ఏళ్లుగా మోదీ ప్రభుత్వం కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాల ద్వారా ట్రేడ్ యూనియన్ హక్కులు, కార్మిక హక్కులపై నిరంతర దాడులు చేస్తూనే ఉంది. 2015లో “మేక్ ఇన్ ఇండియా” పేరుతో ప్రారంభమైన విధానాలు, 2018లో నిర్ణీత కాల ఉద్యోగాలను ప్రవేశపెట్టడం, కోవిడ్ సమయంలో వేతనాలు, పని గంటల చట్టాల సడలింపులు, చివరకు 4 కార్మిక కోడ్ల రూపకల్పన ఇవన్నీ ఒకే దారిలో సాగాయి. వీటి వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం, భారతదేశంలోని గుత్త పెట్టుబడిదారీవర్గ ప్రయోజనాలను కాపాడటమే.“ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”, కాంపిటేటివ్ ఫెడరలిజం”, “ఇన్స్పెక్టర్ రాజ్‌కి ముగింపు” వంటి ఆకర్షణీయమైన పదాల మాటున ఈ విధానాలను ముందుకు తీసుకువచ్చారు. కానీ వాస్తవం ఏమిటంటే, ఇవన్నీ బడా కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకు రూపొందించిన విధానాలే. ఈ రోజు దేశ చరిత్రలోనే తీవ్ర అసమానతల సమాజంగా భారతదేశం మారింది. ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెట్టి “ఫ్రమ్ ది బ్రిటిష్ రాజ్ టు ది బిలియనీర్ రాజ్ ” అనే తన గ్రంథంలో భారతదేశంలోని నేటి ఆదాయ అసమానతలు బ్రిటిష్ వలస పాలనా కాలం నాటి అసమానతలను మించి ఉన్నాయని పేర్కొన్నాడు. జమీందారీ విధానం రద్దు, కొన్ని పరిమితులతోనైనా అమలు జరిగిన భూసంస్కరణలు, రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయకరణ, భారీ ప్రభుత్వ రంగ పరిశ్రమల నిర్మాణం తదితర ఆర్థిక విధానాల ద్వారా స్వాతంత్య్రానంతరం సాధించిన ఆర్థిక, సామాజిక ప్రయోజనాలు యావత్తు మూడు దశాబ్దాలుగా అమలు జరుగుతున్న అడ్డు అదుపు లేని ఆశ్రిత పెట్టుబడిదారీ, నయా ఉదారవాద విధానాల ఫలితంగా తిరోగమనం పాలయ్యాయి. ఈనాటి పరిస్థితి ఏంటంటే, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థించే మహాయోధులు ఇటీవలి వరకు దేశం అనుసరించిన పంధానే ప్రశ్నిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డిప్యూటీ గవర్నర్ అయిన విరాల్ ఆచార్య ఒక పరిశోధనా పత్రాన్ని రాశారు. ఆర్థిక వ్యవస్థలో దేశీయ కార్పొరేట్ దిగ్గజాలను తయారుచేసే విధానంపై విమర్శ చేశారు. ఆర్థిక రంగంలో రిలయన్స్ గ్రూప్, టాటా గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్, భారతి టెలికాం వంటి సంస్థలు అధిక ఆధిపత్యం సాధించడం వల్ల పోటీ తగ్గి, ధరల పెరుగుదలకు దారితీసిందని ఆయన రాశారు. ఇన్పుట్ ఖర్చులు తగ్గినా కూడా ఈ గుత్త సంస్థలు ధరలను నియంత్రిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నాయి. అందువల్లే పెద్ద కార్పొరేట్ గుత్తాధిపత్యాలను బద్దలుకొట్టి, చిన్న సంస్థలకు పోటీ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా వినిమయదారుల ప్రయోజనాలను కాపాడాలన్నారు. మరో మాటలో చెప్పాలంటే, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం ద్వారా, గుత్త పెట్టుబడిదారీ విధానాన్ని నిర్మించే పెట్టుబడిదారీ ఆర్థిక నమూనా భారతదేశంలో అమలు జరుగుతున్నట్లు అర్థం చేసుకోవాల్సి ఉంది. ప్రధానంగా ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థల నుండి రాజకీయ ఒత్తిడితో బలవంతంగా అప్పులు పొందటం, వాటిని రద్దు చేయడంపై ఈ కార్పొరేట్ ప్రయోజనాల అభివృద్ధి ఆధారపడి ఉంది. అందుకే దీన్ని ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అని అంటున్నాం. ఈ పోటీలో చిన్నచిన్న పెట్టు బడిదారులు కనిపించకపోవడం ప్రత్యేకత. మోదీ ప్రభుత్వం అసలు రూపంలో చూస్తే, అది గుత్త పెట్టుబడిదారీ ప్రయోజనాల సాధనకు ఒక ముసుగు మాత్రమే. గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు కోవిడ్ సమయంలో కార్మిక చట్టాలకు “సెలవు” ప్రకటించడం దీనికి ఉదాహరణ. బడా పారిశ్రామికవేత్తలను సంతోషపెట్టడమే పాలకవర్గాల లక్ష్యమని దీని ద్వారా స్పష్టమైంది. ఈ దిక్కుమాలిన పరిస్థితి ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీని కూడా ఆందోళనకు గురిచేసింది. కార్మిక చట్టాలను నీరుగార్చటంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఎకనామిక్ టైమ్స్‌లో ఒక వ్యాసం రాస్తూ, కార్మిక చట్టాలను బలహీనపరచటం వల్ల ఆర్థిక వ్యవస్థ బలపడదనీ, నామమాత్రపు వేతనాలపై పని చేసే కార్మికుల పరిస్థితులను మరింత దుర్భరం చేస్తుందని, అది దేశానికి ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. భారతదేశంలో పాలన పనేమిటంటే, పెరిగే ధరలు, అత్యల్ప వేతనాలు, ఉపాధి లాంటి తక్షణ భౌతిక అవసరాల నుంచి ప్రజల్ని ఇస్లామోఫ్ఙోయాకు సంబంధించిన భావోద్వేగపూరిత తప్పుడు కథనాల వైపు పక్కదారి పట్టించడం! మానవజాతి చరిత్రలో, ప్రతి ఫాసిస్ట్ పాలకులు అనుసరించిన సాధారణ వ్యూహం ఇదే. తద్వారా, కార్మికవర్గాన్ని అణచి ఉంచగలమన్నది వారి ఆశ! కానీ, చరిత్ర మనకు బోధించినట్లుగా, అటువంటి క్రూరమైన అణచివేతలను కార్మికవర్గం ఎదిరించి తీరుతుంది. రోజురోజుకీ భౌతిక జీవన పరిస్థితులు దుర్భరం అవుతున్న వాస్తవాన్ని, ఇస్లామోఫ్ఙోయా మూసప్రచారాలను పదేపదే పునరావృతం చేయడం ద్వారా ఎప్పటికీ కప్పిపుచ్చలేరు. “సత్యం” ఖచ్చితంగా బహిర్గతం అవుతుంది. అది జరిగేట్టు చూడాల్సిన బాధ్యత కార్మికవర్గం మీద ఉంటుంది. ఈ దేశంలో, ద్రవ్యోల్బణం కార్పొరేట్ నియంత్రణలో ఉంది. అందువల్ల వేతనాలను కృత్రిమంగా తగ్గించడం జరుగుతోంది. కనీస వేతనాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో మన రాజకీయ వ్యవస్థ గానీ, మీడియా గానీ విఫలం కావడం దురదృష్టకరం. వాస్తవ వేతనాలు (ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆదాయం) కనీసం ద్రవ్యోల్బణంతో సమానంగా పెరగాలి లేదంటే కార్మికుల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. మన సమాజంలో వేతనాలపై జీవించే ప్రజలే మెజారిటీగా ఉన్నారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గితే వినియోగం తగ్గి, ఆర్థిక వ్యవస్థలో మొత్తం డిమాండ్ పడిపోతుంది. జీడీపీకి సుమారు 60శాతం ప్రైవేట్ గృహ వినియోగం నుంచే వస్తోంది. మన అంచనాల ప్రకారం, కర్ణాటకలో కనీస వేతనాల కేటగిరీలో ఉన్న కార్మికులు సుమారు 1.77 కోట్లు. వీరిలో సగం మందికే రూ.4000ల వేతన పెంపు వర్తించినా, వార్షికంగా 43,000 కోట్ల మేర కార్మికుల చేతికి వెళ్తుంది. ఇది కర్ణాటక ప్రభుత్వ 5 గ్యారెంటీ పథకాల బడ్జెట్‌తో సమానంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ అంశం పై అసెంబ్లీల్లోనూ, టీవీ స్టూడియోలలోనూ డిబేట్లు జరగడం లేదు. అత్యధిక భాగం కార్మికులు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నందువల్ల, కనీస వేతనాల పెంపుదల ప్రభుత్వాల ఖజానాకు ఏమాత్రం భారం కాదు. కనీస వేతనాల పట్ల నిర్లక్ష్యం యాదృచ్ఛికం కాదు. వ్యవస్థాగతంగా, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నదే! హర్యానాలో త్రైపాక్షిక కనీస వేతనాల సలహా బోర్డు యజమానులు, ఉద్యోగులు, ప్రభుత్వం ప్రతినిధులతో కూడిన బోర్డు 2026 ఫిబ్రవరిలో నైపుణ్యం లేని కార్మికులకు రూ. 23,400 కనీస వేతనం సిఫారసు చేసింది. కానీ ప్రభుత్వం ఆ ఏకగ్రీవ నిర్ణయాన్ని పట్టించు కోకుండా ఏకపక్షంగా రూ.15,300 మాత్రమే ప్రకటించింది. నోయిడాలో నిరసనలు చెలరేగిన తర్వాత మాత్రమే మీడియా ఈఅంశాన్ని కొద్దిగా ప్రస్తావించింది. అయితే అక్కడ కూడా కార్మికుల జీవన పోరాటంకన్నా ట్రాఫిక్ జామ్‌లపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇంకా దారుణంగా, యూపీ ప్రభుత్వం నిరసనల వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపించింది.
మార్క్స్ దృక్పథం : కార్ల మార్క్స్ ప్రకారం, కనీస వేతనం అనేది కేవలం జీవించేందుకు సరిపడే స్థాయి కాదు… కార్మికుడు పని చేయగలిగే స్థితిలో ఉండటానికి, తన కుటుంబాన్ని పోషించడానికి, తదుపరి తరాన్ని కొనసాగించడానికి అవసరమైన “సామాజికంగా నిర్ణయించిన జీవన అవసరాల” విలువ. అయితే, నేటి పెట్టుబడిదారీ వ్యవస్థ తక్షణ లాభాల కోసం కార్మిక వర్గాన్ని అమానుషంగా దోపిడీ చేస్తోంది.1948 కనీస వేతనాల చట్టం ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి వేతనాలను పునఃసమీక్షించాలి. కానీ హర్యానా, యూపీ, ఆంధ్రప్రదేశ్‌లతో పాటు, అనేక రాష్ట్రాలు వరుసగా 14 సంవత్సరాలుగా వేతనాలను సవరించలేదు. 1982లో సుప్రీంకోర్టు “పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్” కేసులో “కనీస వేతనాల కంటే తక్కువ చెల్లించడం బలవంతపు శ్రమతో సమానం” అని తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌తో సహా అనేక రాష్ట్రాలు దశాబ్దాల తరబడి కనీస వేతనాలను సవరించకపోవడం తీవ్ర నిర్లక్షాయూన్ని సూచిస్తోంది.


