Homeఆంధ్రప్రదేశ్ఖరీఫ్ పై ఎల్ నినో కాటు

ఖరీఫ్ పై ఎల్ నినో కాటు

- Advertisement -

*దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు
*పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు
*ఎండిపోతున్న జలాశయాలు
*తీవ్ర వర్షపాత లోటుతో సాగు విస్తీర్ణంపై పెను దెబ్బ

                             (విశాలాంధ్ర-చిత్తూరు)

వ్యవసాయ రంగానికి ఈ ఏడాది వాతావరణం ఏమాత్రం అనుకూలించడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆకాశంలో కారుమబ్బులు కమ్ముకుంటున్నా, ఈదురుగాలులు, మేఘాల గర్జనలతోనే వరుణుడు సరిపెడుతున్నాడు తప్ప నేలను తడపడానికి మాత్రం మనసు చేసుకోవడం లేదు. ఆరుద్ర, మృగశిర కార్తెలలో వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ సాగు తీవ్రంగా మందగించింది. ఎల్ నినో మరింత ప్రమాదకరంగా మారి శీతాకాలం నాటికి ‘సూపర్ ఎల్ నినో’గా రూపాంతరం చెందే అవకాశం ఉందని, దీనివల్ల తీవ్రమైన కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ, వ్యవసాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పడిపోతున్న సాగు విస్తీర్ణం

సాధారణంగా జూలై నెల వచ్చిందంటే చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోవాలి. కానీ, ఈసారి తీవ్రమైన వర్షభావ పరిస్థితుల వల్ల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోతోంది. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 44,267 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు కేవలం 7,374 హెక్టార్లలో మాత్రమే సాగు ప్రారంభమైంది. ముఖ్యంగా వేరుశనగ 21 వేల హెక్టార్లకు పైగా సాగు కావాల్సి ఉంది. ఇందుకోసం త్వరగా 27 వేల క్వింటాళ్ల విత్తనాలు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు కేవలం 6 వేల క్వింటాళ్లు మాత్రమే పంపిణీ చేశారు. తిరుపతి జిల్లాలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3,456 హెక్టార్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 1,106 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగింది. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చివోలుతో పాటు పలు ప్రాంతాల్లో సాగు చేసిన వరి పంటలు నీరు అందక నిలువునా ఎండిపోతున్నాయి. ఒక్క ముచ్చివోలు గ్రామంలోనే దాదాపు 500 ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోవడంతో, రైతులు ప్లాస్టిక్ పైపుల ద్వారా బావుల్లోని కొద్దిపాటి నీటిని తోడుకోవడానికి అగచాట్లు పడుతున్నారు.

జూలైలో సగానికి పైగా లోటు

గడిచిన ఐదేళ్ల జూలై నెల వర్షపాత గణాంకాలను పరిశీలిస్తే, ఈ ఏడాది వర్షాల గ్రాఫ్ ఎంత ఘోరంగా పడిపోయిందో స్పష్టమవుతోంది. ఏటా జూలైలో సాధారణ వర్షపాతం 103 మి.మీ. నమోదు కావాల్సి ఉండగా, ఈ ఏడాది కేవలం 52.70 మి.మీ. మాత్రమే నమోదై తీవ్ర లోటును చూపిస్తోంది.
సంవత్సరం (జూలై) సాధారణ వర్షపాతం నమోదైన వర్షపాతం
2021 103 మి.మీ. 223.10 మి.మీ.
2022 103 మి.మీ. 77.90 మి.మీ.
2023 103 మి.మీ. 62.70 మి.మీ.
2024 103 మి.మీ. 90.10 మి.మీ.
2025 103 మి.మీ. 93.40 మి.మీ.
2026 (ప్రస్తుతం) 103 మి.మీ. 52.70 మి.మీ. (తీవ్ర లోటు)

పాతాళానికి గంగ

వర్షాలు ముఖం చాటేయడంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూగర్భ జలాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి. కళ్యాణి, తెలుగుగంగ, కండలేరు, స్వర్ణముఖి, నీవా నది పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం భారీగా పడిపోయింది. గత ఏడాది డిసెంబర్‌లో భూగర్భ జలమట్టం 6.87 మీటర్ల లోతులో ఉండగా, అది క్రమంగా పడిపోతూ వస్తోంది. జనవరిలో 8.42 మీటర్లు, ఫిబ్రవరిలో 9.84 మీటర్లు, మార్చిలో 10.96 మీటర్లు, ఏప్రిల్‌లో 13.82 మీటర్లకు పడిపోగా.. జూన్ ముగిసే సరికి ఏకంగా 14.24 మీటర్ల లోతుకు గంగమ్మ కుంగిపోయింది. రానున్న రోజుల్లో వర్షాలు పడకపోతే బావులు, బోర్లు పూర్తిగా ఎండిపోయి తాగునీటి ఎద్దడి కూడా తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రైతాంగాన్ని ఆదుకోవాలి
ఒకవైపు ప్రకృతి కరుణించక, మరోవైపు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో విత్తనాల పంపిణీ జరగక అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎల్ నినో సృష్టిస్తున్న ఈ సంక్షోభ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసి తమను ఆదుకోవాలని రైతాంగం వేడుకుంటోంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు