- ఓటర్ల తొలగింపునకే ఈ ప్రహసనం – స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ఆటంకం
- ఓటరు జాబితాల ప్రత్యేక సవరణపై మండిపడ్డ మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ
న్యూదిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం చేపడుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై మాజీ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) ఎస్‌వై ఖురేషీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియ ప్రధానంగా ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు పైనే దృష్టి సారిస్తోందని ఆరోపించారు. ఎస్ఐఆర్ వల్ల స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ఆటంకం కలిగి ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లిందని విమర్శించారు. వీలైనన్ని ఎక్కువ పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలగింపులకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. ఓటరుగా నమోదు చేసుకోవడమనేది ఒక రాజ్యాంగపరమైన హక్కు అని, కానీ ఎన్నికల సంఘం ప్రజలకు ఏదో ఉపకారం చేస్తోందన్నట్లుగా పరిస్థితిని సృష్టిస్తోందని అన్నారు. ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ వీడియోస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు ఖురేషీ వ్యాఖ్యానించారు.
ఎస్ఐఆర్ జరుగుతున్న తీరు అన్యాయం
ఓటర్ల జాబితా సవరణ కోసం చేపట్టిన ఈ ప్రత్యేక ప్రక్రియ (ఎస్ఐఆర్) జరుగుతున్న తీరు అన్యాయంగా ఉందని ఖురేషీ అన్నారు. “ఎస్ఐఆర్ ప్రధానంగా ఓటర్ల పేర్ల తొలగింపుపైనే దృష్టి పెడుతోంది. ఓటర్ జాబితా నుంచి ఎంత మంది పేర్లను తొలగించగలమన్నదే వారి ప్రధాన ధ్యాసగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుత ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటున్న సిబ్బందికి నాదొక సూచన. ఓటరు పేరు స్పెల్లింగ్, వయసు, అడ్రస్‌లో చిన్నపాటి తప్పులు ఉన్నప్పటికీ వారు సరైన వ్యక్తేనని మీకు తెలిస్తే ఆ తప్పులను పట్టించుకోవద్దు. తద్వారా ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా చూడాలి. ఓటర్ జాబితా నుంచి వీలైనన్ని ఎక్కువ పేర్లను తొలగిస్తే మంచి మార్కులు వస్తాయన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కోట్లాది మంది పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించడంతో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలకు ఆటంకం కలిగింది.” అని ఖురేషీ పేర్కొన్నారు. తాను సీఈసీగా ఉన్నప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా స్పష్టంగా ఉండేదని… ఏటా ఓటరు జాబితాను సవరించే ప్రక్రియను చేపట్టేవాళ్లమని తెలిపారు. 2002-2003లో బీహార్‌లో చివరిసారిగా ఎస్ఐఆర్ చేపట్టిన తర్వాత ఓటర్ల జాబితాలు కంప్యూటరైజ్¦ అయ్యాయని… దీంతో ఇకపై ఓటర్ జాబితా సమగ్ర సవరణ అవసరం లేదని నిర్ణయించారన్నారు. ఓటర్ జాబితాలో 99 శాతం మంది పేర్లు ఇప్పటికే నమోదై ఉన్నప్పుడు మళ్లీ ఇంటింటికి వెళ్లి అక్కడ ఎవరు నివసిస్తున్నారో మొదటి నుంచి ఆరా తీయడమనేది తెలివి తక్కువ పనవుతుందన్నారు. అక్రమ వలసదారులను గుర్తించే పేరుతో బీహార్‌లో గతేడాది ఎస్ఐఆర్ చేపట్టారని… దీనివల్ల దాదాపు ఎనిమిది కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఖురేషీ తెలిపారు. కానీ చివరికి ఎంతమంది విదేశీయులు దొరికారు? ఈ రోజు వరకు బీహార్‌లో ఓట్లు కలిగి ఉన్న అక్రమ వలసదారులు ఎంత మందో ఈసీ వెల్లడించలేదన్నారు. ‘ఇదేమైనా పిల్లలాటనా? లేక వారి ఇష్టాయిష్టాలా? 500 మంది విదేశీయులను బీహార్‌లో ఎస్ఐఆర్ చేపట్టి గుర్తించారని మీడియా ద్వారా మాకు తెలిసింది. వారిలో 150 మంది బంగ్లాదేశీయులు కాగా, 350 మంది బిహార్ వ్యక్తులను పెళ్లాడిన నేపాలీ హిందూ మహిళలు. కేవలం 150 మంది బంగ్లాదేశీయులను గుర్తించడానికి మీరు ఎనిమిది కోట్ల మంది ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ పేరిట లక్షలాది మంది పేర్లను ఓటర్ జాబితా నుంచి తొలగించారు. దీనివల్ల ఈసీ సాధించిన ప్రయోజనం ఏంటి? ఇది సమంజసమేనా? అసలు కాదు” అంటూ ఖురేషీ దుయ్యబట్టారు. ఎస్ఐఆర్పై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధుల చేసిన విమర్శలపై ఖురేషీ స్పందిస్తూ… దేశంలో ఎన్నికలు ఎలా నిర్వహించాలో విదేశీయులు మనకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. “ఒక విదేశీ బృందం దేశంలో ఎన్నికల నిర్వహణపై లేఖ రాసే పరిస్థితికి మనం చేరుకోవడం చాలా బాధాకరం. ఇలా జరిగి ఉండకూడదు. కానీ అదే సమయంలో దీనిని కేవలం మన దేశ అంతర్గత వ్యవహారమని కొట్టిపారేయకూడదు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది అంతర్జాతీయ వార్తగా మారినందున భారత్ మౌనంగా ఉంటే అనుమానాలు బలపడే అవకాశం ఉంది” అని ఖురేషీ స్పష్టం చేశారు.
యూపీఏ సర్కార్ నుంచి ఒత్తిడి ఎదుర్కోలేదు
తన సీఈసీ పదవీ కాలంలో యూపీఏ-2 ప్రభుత్వం నుంచి ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కోలేదని ఖురేషీ స్పష్టం చేశారు. అప్పట్లో ఈసీకి ఉన్న ప్రతిష్ట దృష్ట్యా అటువంటి పని చేయడానికి (ఒత్తిడి తెచ్చేందుకు) ఎవరూ సాహసించేవారు కాదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయం ప్రభుత్వానికి ఎప్పుడూ అందరికంటే చివరిగా తెలిసేదని పేర్కొన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ను విలేకరుల సమావేశంలో ప్రకటించేవాళ్లమని, అప్పుడే ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలిసేదన్నారు.


