Homeపెన్నా - వంశధారను కలుపుతాం

పెన్నా – వంశధారను కలుపుతాం

- Advertisement -
  • పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాకు సిరులు
  • 2015 నుంచి ఇప్పటి వరకు 450 టీఎంసీల తరలింపు
  • వచ్చే మూడేళ్లలో 35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి
  • పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలకు సీఎం జలహారతి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి / ఇబ్రహీంపట్నం : వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులు అనుసంధానం జరగాలన్నదే నా ఆకాంక్ష అని సీఎం చంద్రబాబు అన్నారు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలో నదులు అనుసంధానమైతే భారత్ దేశానికి తిరుగు ఉండదన్నారు. సముద్రంలోకి వెళ్లే నీటిని సాగు, తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తే పెద్ద ఎత్తున సంపద సృష్టి జరుగుతుందన్నారు. అందుకే ప్రాధాన్యతా క్రమంలో 36 ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో పూర్తి చేసేలా కార్యాచరణ చేపట్టామని, పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండించారని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 2015 నుంచి ఇప్పటివరకూ పట్టి సీమ ప్రాజెక్టు నుంచి 450 టీఎంసీల గోదావరి వరద జలాలను తరలించినట్టు వెల్లడించారు. ఎన్‌టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలకు ముఖ్యమంత్రి జల హారతి ఇచ్చారు. సంప్రదాయ పంచె కట్టులో వచ్చిన ముఖ్యమంత్రి కృష్ణా- గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు- కుంకుమలు సమర్పించారు. అనంతరం ప్రముఖ ఇంజనీరు కేఎల్ రావు 124వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. పట్టి సీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి కృష్ణా డెల్టాను స్సయశ్యామలం చేస్తున్నాయి. ఏడాదిలో పట్టి సీమ పూర్తి చేసి కృష్ణాడెల్టాను కాపాడిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. 80 టీఎంసీలతో కృష్ణా డెల్టాలోని 13 లక్షల ఎకరాలను స్థిరీకరించాం. నాకు ఎక్కడ పేరు వస్తుందో అని నాడు పట్టి సీమ నిర్మిస్తుంటే కొందరు విమర్శించారు. పట్టి సీమ, ఒట్టిసీమ అన్నారు. విమర్శలు పట్టించుకుని ప్రాజెక్టు పూర్తి చేయకుండా వదిలేస్తే కృష్ణా డెల్టా ఏమయ్యేదో. విమర్శలు పట్టించుకోకుండా రూ.1300 కోట్లు ఖర్చు చేసి పట్టి సీమ పూర్తి చేశాం. గోదావరి నుంచి కృష్ణా నదికి 450 టీఎంసీల వరద జలాలను తీసుకువచ్చాం. పట్టి సీమకు చేసిన ఖర్చుతో కృష్ణా డెల్టా మొత్తం స్థిరీకరణ జరిగింది. పోలవరం కుడి కాలువ నుంచి నీటి తరలింపు కారణంగానే శ్రీశైలంలో కృష్ణా నీటిని పొదుపు చేసి రాయలసీమకు నీరందింస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి ఎకరాకి సాగునీరు అందించాలన్నదే కూటమి ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత పాలకులు అతి ముఖ్యమైన ప్రాజెక్టులను గాలికి వదిలేసి గత పాలకులు రాష్ట్ర రైతులకు ద్రోహం చేశారని… ఇప్పుడు అమరావతిని కూడా అద్బుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారన్నారు. ప్రతిపక్షంలోని కొందరు రైతుల్ని రెచ్చగొట్టి సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు విరోధంగా పనిచేసే వారి పట్ల మనం అంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం పిలుపునిచ్చారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకుడ్, కోసీ లాంటి ప్రధానమైన డ్యామ్ ల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారన్నారు. శివ రామకృష్ణయ్య, కేఎల్ రావుల తర్వాత ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంపై ఆలోచించిన వ్యక్తి ఎన్‌టీఆర్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ సహా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు