Homeజాలువారని జలం

జాలువారని జలం

- Advertisement -
  • దేశ వ్యాప్తంగా జలాశయాల్లో 63 శాతం తక్కువ నీరు
  • 166 ప్రధాన రిజర్వాయర్లలో 32.38 శాతమే

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవనాలు భారతదేశం మొత్తాన్ని ఆవరించినప్పటికీ, దేశంలోని నీటి నిల్వలు ఆందోళనకరంగా తక్కువగా ఉన్నాయి. వివిధ ప్రాంతాలలో రుతుపవన వర్షాలు తీవ్రంగా కురుస్తున్నప్పటికీ, అవి చాలా వరకు అసమానంగా ఉన్నాయి. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే దేశ వ్యాప్తంగా ఉన్న 166 ప్రధాన జలాశయాలు ప్రస్తుతం వాటి మొత్తం సామర్థ్యంలో కేవలం 32.38 శాతం మాత్రమే నిండి ఉన్నాయి. వారం క్రితం ఉన్న 26 శాతంతో పోలిస్తే ఇది మెరుగుదలే అయినప్పటికీ, వాతావరణ మార్పుల కారణంగా వర్షపాతం మరింత అస్థిరంగా మారుతూ… తాగు నీరు, వ్యవసాయం, పరిశ్రమలు, భూగర్భ జలాలపై ఒత్తిడి తీవ్రమవుతున్నందున ఈ పరిస్థితి ఏమాత్రం భరోసా ఇచ్చేదిగా లేదని నిపుణులు తెలిపారు. పరిస్థితిని అంచనా వేస్తూ, కేవలం ఎక్కువ నీటిని నిల్వ చేయడమే కాకుండా, దానిని తెలివిగా ఉపయోగించడం నేర్చుకోవడమే అసలైన సవాలు అని నిపుణులు హెచ్చరించారు.
ఏపీ, తెలంగాణాల్లో ఆందోళనకర పరిస్థితి
నైరుతి రుతుపవనాలు వచ్చి నెల రోజులు దాటినప్పటికీ, దక్షిణ భారత రాష్ట్రాల్లోని జలాశయాలలో నీటి మట్టాలు సాధారణం కంటే తక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ మట్టాలు తక్కువగా ఉండటం గమనార్హం. ఈ పరిధిలో ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న 47 జలాశయాలను కేంద్ర జల సంఘం పర్యవేక్షిస్తోంది. ఈ జలాశయాల మొత్తం ‘లైవ్ స్టోరేజ్’ (వినియోగానికి అందుబాటులో ఉండే నీటి నిల్వ) సామర్థ్యం 55.288 బిలియన్ క్యూబిక్ మీటర్లు (బీసీఎం). జులై 9 నాటి తాజా నిల్వల నివేదిక ప్రకారం, ప్రస్తుతం ఈ జలాశయాలలో అందుబాటులో ఉన్న మొత్తం నీటి నిల్వ 13.614 బీసీఎంసీ. ఇది వాటి మొత్తం సామర్థ్యంలో 24.62 శాతం మాత్రమే. దీంతో పోలిస్తే, గత ఏడాది ఇదే కాలంలో నీటి నిల్వ 60.36 శాతంగా ఉండగా, సాధారణ నిల్వ స్థాయి 30.18 శాతంగా ఉండేది. తెలంగాణలోని ఎనిమిది ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు దేశంలోనే అత్యల్పంగా నమోదవుతున్నాయి. వీటి పూర్తి స్థాయి నీటి మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) వద్ద ఉండే మొత్తం ‘లైవ్ కెపాసిటీ’లో ప్రస్తుతం కేవలం 12.92 శాతం నీరు మాత్రమే నిల్వ ఉంది. కడెం, నాగార్జున సాగర్, లోయర్ మానేరు, మూసీ ప్రాజెక్టు, నిజాంసాగర్, జూరాల, సింగూర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను పర్యవేక్షించే కేంద్ర జల సంఘం తాజా గణాంకాలు ఆందోళనకరమైన పరిస్థితిని వెల్లడిస్తున్నాయి. ఎఫ్‌ఆర్‌ఎల్ వద్దఈ రిజర్వాయర్ల మొత్తం లైవ్ కెపాసిటీ 344.7 టీఎంసీలు (టీఎంసీఎఫ్‌టీ) కాగా జులై 9 నాటికి వీటిలో కేవలం 44.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది ఇదే సమయంలో ఉన్న 104.5 టీఎంసీలతో పోలిస్తే ఇది భారీ తగ్గుదల. రాష్ట్రంలోనే అతిపెద్ద రిజర్వాయర్ అయిన నాగార్జున సాగర్‌లో అత్యంత భారీ తగ్గుదల నమోదయింది. ఎఫ్‌ఆర్‌ఎల్ వద్ద దీని మొత్తం లైవ్ కెపాసిటీ 180 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో కేవలం 6.53 టీఎంసీల నీరు (అంటే దాని సామర్థ్యంలో 3.26 శాతం) మాత్రమే ఉంది. కేవలం ఒక నెల వ్యవధిలోనే, దీని నీటి నిల్వ జూన్ 4 నాటి 16.95 టీఎంసీల నుండి 6.53 టీఎంసీలకు పడిపోయింది.
సరఫరాను మించిపోతున్న డిమాండ్
జల వనరుల మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి, ప్రస్తుతం టెరి జల విభాగంలో సలహాదారుగా ఉన్న శ్యామల్ సర్కార్, పీటీఐతో మాట్లాడుతూ గృహ, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలలో భారతదేశపు నీటి డిమాండ్ ఇప్పటికే అందుబాటులో ఉన్న సరఫరాను మించిపోయిందని అన్నారు. ‘సరఫరా విషయానికి వస్తే నిల్వ కీలకం. ప్రధాన డ్యామ్లు ప్రస్తుతం సుమారు 250 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని నిల్వ చేస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా ఇది గణనీయంగా పెరగవచ్చు’ అని ఆయన అన్నారు. ‘డిమాండ్ విషయానికి వస్తే సరఫరా తగ్గినప్పుడు అవసరాలను ఎలా తీర్చాలనేది ప్రశ్న. చాలా దేశాల మాదిరిగానే భారతదేశం కూడా చారిత్రకంగా సరఫరా వైపు పరిష్కారాలకే ప్రాధాన్యతనిస్తూ ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేసింది’ అని తెలిపారు. భారతదేశపు తలసరి నీటి లభ్యత 1950 లో సుమారు 5,000 క్యూబిక్ మీటర్ల నుంచి నేడు దాదాపు 1,500 క్యూబిక్ మీటర్లకు పడిపోయిందని సర్కార్ పేర్కొన్నారు. కాగా ఇజ్రాయిల్ దేశం తన వ్యవసాయం కోసం 60 నుంచి 70 శాతం నీటిని పునర్వినియోగించుకుంటుందని చెప్పారు. ‘2050 నాటికి, భారతదేశపు నీటి అవసరం అందుబాటులో ఉన్న సరఫరాకు రెట్టింపు అవుతుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది’ అని సర్కార్ అన్నారు. వాతావరణ మార్పు వల్ల రుతుపవనాలు మరింత అనూహ్యంగా మారాయని, వర్షపాతం సమయం లేదా తీవ్రతలో ఎటువంటి స్థిరమైన సరళి లేకుండా పోయిందని సర్కార్ అన్నారు. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్‌విరాన్మెంట్ (సీఎస్ఈ) కి చెందిన సుష్మిత సేన్గుప్తా పీటీఐతో మాట్లాడుతూ నగరాలు దాదాపు పూర్తిగా సుదూర పైపుల ద్వారా వచ్చే నీటి సరఫరాపై ఆధారపడకుండా, సరస్సులు, చెరువులు, స్థానిక జలాశయాలు, వికేంద్రీకృత నీటి వ్యవస్థలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశం ఎదుర్కొంటున్న పెరుగుతున్న నీటి సవాలుకు ఇప్పుడు రెండు విధాల వ్యూహం అవసరమని నిపుణులు తెలిపారు. ఈ వ్యూహంలో నీటి నిల్వను పెంచడంతో పాటు వర్షపు నీటి సేకరణ, మురుగునీటి పునర్వినియోగం, సమర్థవంతమైన నీటిపారుదల, స్థానిక నీటి వ్యవస్థల పునరుద్ధరణ ద్వారా వృధాను ఏకకాలంలో తగ్గించాలి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు