విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా ‘ ఆపరేషన్ నైట్ సేఫ్టీ*కార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి వేళ నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు విస్తృత నిఘా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా, అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా రహదారులపై ప్రమాదాల నివారణే లక్ష్యంగా వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న వారిపై కఠిన వైఖరిని అవలంబించారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై మోటార్ వాహనాల చట్టం కింద కేసులు నమోదు చేశారు. అదే సమయంలో, అర్ధరాత్రి వేళల్లో అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న పలువురు యువకులను, అనుమానితులను పోలీసులు విచారించి పంపారు. రాత్రి సమయాల్లో పని లేకుండా బయట తిరగడం వల్ల జరిగే ప్రమాదాలపై తెలియజేశారు.
నివాస ప్రాంతాల్లో దొంగతనాలు, దోపిడీలను అరికట్టడమే లక్ష్యంగా కాలనీలు, వ్యాపార సముదాయాల పరిధిలో పోలీసులు బీట్ గస్తీని తీవ్రం చేశారు. అర్ధరాత్రి వేళల్లో ఒంటరిగా ఉన్న ఇళ్లు, తాళాలు వేసి ఉన్న గృహాల వద్ద నిరంతరం పెట్రోలింగ్ వాహనాలతో పహారా కాశారు. ఆర్థిక లావాదేవీలు జరిగే బ్యాంకులు, ఏటిఎం కేంద్రాలు, ప్రధాన వాణిజ్య సంస్థల వద్ద భద్రతా లోపాలు లేకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నా, లేదా అపరిచిత వస్తువులు కనిపిస్తే తక్షణం డయల్ 100 లేదా 112 ద్వారా పోలీసులకు సమాచారం అందించి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయా పోలీసులు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని ఆయా సబ్ డివిజన్ల డీఎస్పీల ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఐలు, ఎస్సైలు మరియు భారీ సంఖ్యలో పోలీస్ సిబ్బంది ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కొనసాగుతోన్న ఆపరేషన్ ” నైట్ సేఫ్టీ “
- Advertisement -


