దేశ రాజధానిలో టెన్షన్ వాతావరణం
న్యూదిల్లీ: దేశ రాజధాని అట్టుడుకుతోంది. విద్యార్థుల దర్నాలతో దిల్లీ దద్దరిల్లుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనల నేపథ్యంలో దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం (ఈ రోజు) ఉదయం 7:30 గంటల నుంచి నగర వ్యాప్తంగా 16 మెట్రో స్టేషన్‌లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ మూసివేత కొనసాగుతుందని వెల్లడించింది. 20వ తేదీ నుంచి మూడుసార్లు మెట్రో స్టేషన్‌లను మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోక్ కల్యాణ్ మార్గ, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమం మార్గ, బారాఖంభా రోడ్, సుప్రీంకోర్టు, సేవా తీర్థ, జనపథ్, మండి హౌస్, కేంద్ర సచివాలయం స్టేషన్‌లను మెట్రో అధికారులు మూసివేశారు. ఐటీఓ, దిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్ బాగ్, శివాజీ స్టేడియం స్టేషన్లనూ నిలిపివేశారు. కాగా, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద ఇంటర్ఛేంజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ మేరకు డీఎంఆర్‌సీ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. బుధవారం కూడా డీఎంఆర్‌సీ 17 స్టేషన్‌లను మూసివేసి సాయంత్రం తెరిచింది. దీంతో వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 20న పార్లమెంట్ మార్చ్‌కు సీజేపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఆ రోజు భారీగా వస్తున్న నిరసనకారులను అడ్డుకునేందుకు పలు మెట్రో స్టేషన్‌లను మూసివేశారు. ఈరోజు మెట్రో స్టేషన్‌లు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులతో చర్చించి సమస్యలను పరిష్కరించడానికి బదులుగా మెట్రో స్టేషన్‌లను మూసివేయడం ఏంటని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.
సీజేపీ నిరసనలు…16 మెట్రో స్టేషన్‌ల మూసివేత
- Advertisement -


