విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మహిళా ఎస్ఐని అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ డిమాండ్ చేశారు. శుక్రవారం పెద్దకడబూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల వైకాపా నాయకులు, కార్యకర్తలు ప్రవర్తించిన ఘనను ఆమె తీవ్రంగా ఖండించారు. విధి నిర్వహణలో ఉన్న మహిళా పోలీసు అధికారిని అవమానించడం చట్టాన్ని, మహిళా గౌరవాన్ని కించపరచడమే నన్నారు. మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించడం వైకాపా నాయకులకు సంస్కృతిగా మారిందని విమర్శించారు. మహిళల భద్రతకు, ఆత్మగౌరవానికి భంగం కలిగించే వారిని కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షిందన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ఘటనలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొని మహిళా పోలీసు అధికారులకు రక్షణ, గౌరవం కలిగించాలని కోరారు.


