విశాలాంధ్ర – ఉరవకొండ: జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శుక్రవారం ఉరవకొండ మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత పాత తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న నూతన భవన పనులను పరిశీలించారు అనంతరం రెవెన్యూ రికార్డు రూమ్‌ను తనిఖీ చేసిన కలెక్టర్, అసైన్డ్ భూములకు సంబంధించిన ఫైళ్లు, స్కెచ్‌లు, భూ సర్వే డేటా తదితర కీలక పత్రాలను అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని అధికారులను ఆదేశించారు. మొబైల్ యాప్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించి, సంబంధిత సమాచారాన్ని పూర్తిస్థాయిలో నమోదు చేయాలని సూచించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) పనితీరు, పెండింగ్ ఫిర్యాదులు, రెవెన్యూ అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఆ తర్వాత ఎంపీడీవో కార్యాలయంలో జనగణన (సెన్సెస్) క్షేత్రస్థాయి పనులు, నిర్దేశిత కాలక్రమంపై పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, డిజిటల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు. జనగణన ప్రక్రియను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ తనిఖీల సందర్భంగా తహసీల్దార్ అరుణ, ఎంపీడీవో బి.వి. రవిప్రసాద్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


