మహిళల స్వేచ్ఛపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. గురువారం నిర్వహించిన ‘ఆస్క్ మీ ఎనీథింగ్ ‘ కార్యక్రమంలో మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగలిగే పరిస్థితి ఉండాలని రాహుల్ అన్నారు. శుక్రవారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అంశంపై మరింత వివరంగా స్పందించారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ ఇప్పుడు బేషరతుగా మద్దతు ఇవ్వాలని కోరారు. మహిళల్లో ఉన్న శక్తి పూర్తిస్థాయిలో బయటకు రావడం లేదని రాహుల్ అన్నారు. మహిళలు తమకు నచ్చిన విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడాలని చెప్పారు. ఇళ్లలో, కుటుంబాల్లో, సమాజంలో తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు అంగీకరించని విషయాలపై కూడా మహిళలు తమ అభిప్రాయం చెప్పగలగాలని అన్నారు. పురుషుల ఆధిపత్యం నుంచి మహిళలకు కొంత స్వేచ్ఛ అవసరమని చెప్పారు. అప్పుడే దేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరిలో మార్పునకు సంకేతంగా కనిపిస్తున్నాయని రిజిజు అన్నారు. ‘‘మహిళల విషయంలో రాహుల్‌గాంధీ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాను‘‘ అని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లో పార్లమెంట్ ఆమోదించింది. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించేలా ఈ చట్టం ఉంది. అయితే దీని అమలుకు నియోజకవర్గాల పునర్విభజన అవసరం. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్లును తిరిగి తీసుకొచ్చేందుకు విపక్షాల మద్దతును ప్రభుత్వం కోరుతోంది. రాహుల్‌గాంధీతో గురువారం రిజిజు ఫోన్‌లో మాట్లాడారు. బిల్లును త్వరగా తీసుకొస్తే మహిళా రిజర్వేషన్ల అమలు వేగంగా జరిగే అవకాశం ఉందని వివరించారు. మహిళా రిజర్వేషన్లు అమలు కాకపోతే వారిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని చెప్పినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2026 రాజ్యాంగ సవరణ బిల్లు ఏప్రిల్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ ఆమోదం పొందలేదు. ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టే అంశంపై ప్రభుత్వం, విపక్షాల మధ్య చర్చ కొనసాగుతోంది.


