పిల్లల భద్రతకు సంబంధించిన మరో కీలక కేసులో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ఈ వారం విచారణను ఎదుర్కోనుంది. అమెరికాలోని దాదాపు 30రాష్ట్రాల అటార్నీ జనరళ్లు ఈ కేసును దాఖలు చేశారు.పిల్లలకు హాని కలిగించేలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిర్వహిస్తున్నారని వారు మెటాపై ఆరోపణలు చేశారు.శాన్‌ఫ్రాన్సిస్కో సమీపంలోని ఓక్లాండ్‌లోని ఫెడరల్ కోర్టులో బుధవారం జ్యూరీ ఎంపికతో ఈ విచారణ ప్రారంభం కానుంది.
కాలిఫోర్నియా,కొలరాడో,కెంటకీ,న్యూజెర్సీ రాష్ట్రాల అటార్నీ జనరళ్లు మెటాపై ప్రధాన ఆరోపణలు చేశారు.పిల్లలు, టీనేజర్లను ఎక్కువసేపు ప్లాట్‌ఫామ్‌లలో ఉండేలా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లను ఉద్దేశపూర్వకంగా ఆకర్షణీయంగా,వ్యసనపరంగా డిజైన్ చేశారని పేర్కొన్నారు.మైనర్ల విషయంలో ఈ ప్లాట్‌ఫామ్‌లు ఎలా పనిచేయాలనే దానిపై పలు ఆంక్షలు విధించాలని రాష్ట్రాలు కోర్టును కోరుతున్నాయి.
1.4 ట్రిలియన్ డాలర్ల వరకు జరిమానా
మెటాపై భారీగా జరిమానా విధించాలని కూడా రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.గరిష్ఠంగా 1.4 ట్రిలియన్ డాలర్ల వరకు జరిమానా విధించాలని కోరినట్లు సమాచారం.ఈ మొత్తం మెటా మార్కెట్ విలువలో దాదాపు అంతే. శుక్రవారం నాటికి మెటా మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.5 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంది.ఈ కేసులో మెటా సీఈఓ, సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ కీలక సాక్షుల్లో ఒకరిగా ఉండే అవకాశం ఉంది.ఆరు నెలల క్రితం లాస్ ఏంజెల్స్‌లో జరిగిన మరో కేసులోనూ ఆయన సాక్ష్యం ఇచ్చారు.ప్రస్తుతం హవాయిలోని తన నివాసంలో ఎక్కువ సమయం గడుపుతున్నప్పటికీ.. మెటా ప్రధాన కార్యాలయం ఉన్న మెన్లో పార్క్ నుంచి ఓక్లాండ్ కోర్టు సుమారు గంట దూరంలోనే ఉంది.
2021లో వెలుగులోకి వచ్చిన ఫేస్‌బుక్ ఫైల్స్ వ్యవహారంతో ఈ కేసుకు సంబంధం
ఈ కేసుకు 2021లో వెలుగులోకి వచ్చిన ఫేస్‌బుక్ ఫైల్స్ వ్యవహారంతో సంబంధం ఉంది.మెటా మాజీ ఉద్యోగి ఫ్రాన్సెస్ హాగెన్ సంస్థకు చెందిన వేలాది అంతర్గత పరిశోధనా పత్రాలను బయటపెట్టారు.ఆ పత్రాల్లో ఇన్‌స్టాగ్రామ్ కొంతమంది టీనేజీ బాలికలపై చూపుతున్న ప్రభావం, సంభావ్య నష్టాలపై మెటా అంతర్గతంగా అధ్యయనం చేసినట్లు వెల్లడైంది.అయితే సంస్థ బయట మాత్రం ఈ ప్రభావాన్ని తక్కువగా చూపించిందని ఆరోపణలు వచ్చాయి.ఈ పత్రాలు బయటకు వచ్చిన తర్వాత అమెరికాలోని పలు రాష్ట్రాలు కలిసి దర్యాప్తు చేపట్టాయి.దాదాపు 30 రాష్ట్రాల అటార్నీ జనరళ్లు రెండేళ్ల తర్వాత మెటాపై ఫిర్యాదు దాఖలు చేశారు.పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం,ప్లాట్‌ఫామ్‌ల డిజైన్,భద్రతా చర్యలపై ఈ కేసులో ప్రధానంగా వాదనలు జరగనున్నాయి.
బాధిత టీనేజర్‌కు 60 లక్షల డాలర్లు చెల్లించాలని ఆదేశం
ఇలాంటి కేసుల్లో మెటాకు ఇప్పటికే ఎదురుదెబ్బలు తగిలాయి.రెండు కేసుల్లో సంస్థపై బాధ్యత నిర్ధారించడంతో దాదాపు 100 కోట్ల డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది.మార్చిలో లాస్ ఏంజెల్స్‌లో ముగిసిన ఓ కీలక విచారణలో మెటా, యూట్యూబ్ రెండూ ఓ టీనేజర్ సోషల్ మీడియా వ్యసనానికి బాధ్యత వహించాల్సిందేనని జ్యూరీ తీర్పు ఇచ్చింది.ఆ కేసులో బాధిత టీనేజర్‌కు 60 లక్షల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.ఇక న్యూ మెక్సికోలో జరిగిన మరో కేసులో పిల్లలను ఆన్‌లైన్ వేటగాళ్లకు గురిచేసే పరిస్థితులు కల్పించడంతో పాటు ఇతర హానికర పరిస్థితులకు కారణమైందని పేర్కొంటూ మెటాపై జ్యూరీ తీర్పు ఇచ్చింది.దీంతో 37.5 కోట్ల డాలర్లు చెల్లించాలని ఆదేశించింది.
ఆరోపణలను ఖండించిన మెటా
అయితే తమపై వచ్చిన ఆరోపణలను మెటా ఖండించింది. టీనేజర్లను ఆన్‌లైన్‌లో రక్షించేందుకు తమ సంస్థ తీసుకున్న చర్యలపై పూర్తి నమ్మకం ఉందని తెలిపింది.వాస్తవాలను తప్పుగా చూపించే ఆరోపణలను తాము కోర్టులో సమర్థంగా ఎదుర్కొంటామని పేర్కొంది.మానసిక ఆరోగ్య సమస్య అనేది ఒక్క సోషల్ మీడియా సంస్థకు మాత్రమే సంబంధించినది కాదని, ఇది మొత్తం పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్య అని మెటా వాదించనుంది.కొన్ని రాష్ట్రాలు చేస్తున్న ఆరోపణలకు అమెరికా రాజ్యాంగంలోని భావ ప్రకటనా స్వేచ్ఛ నిబంధనలు వర్తిస్తాయని కూడా సంస్థ వాదించనున్నట్లు తెలుస్తోంది.
నాలుగు రాష్ట్రాలు మెటా వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లఘించాయి.ఈ విచారణలోని నాలుగు రాష్ట్రాలు మెటా వినియోగదారుల రక్షణ చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపించాయి.అంతేకాకుండా పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే ఫెడరల్ చట్టమైన ్పుOPPAను కూడా ఉల్లంఘించిందని పేర్కొన్నాయి.దీంతో ఓక్లాండ్‌లో ప్రారంభం కానున్న ఈ విచారణ మెటా భవిష్యత్ విధానాలపై, ముఖ్యంగా మైనర్ల విషయంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నిర్వహణపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.


