ఉత్తర్‌ప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్న వేళ.. కీలక రాజకీయ నేతల భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది.
రాష్ట్రంలోని 52 మంది రాజకీయ నాయకులకు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు అందించినట్లు సమాచారం. ఈ జాబితాలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు ఉన్నారు.
ఒక్కో బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్ విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. మొత్తం 52 మందిలో 11 మంది రాష్ట్ర మంత్రులు ఉన్నట్లు సమాచారం.ఈ జాకెట్లు ప్రస్తుత భద్రతా వ్యవస్థకు అదనపు రక్షణగా అందిస్తున్నట్లు తెలుస్తోంది. నేతల భద్రతా
అవసరాలు, ముప్పు అంచనాల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.భాజపా, దాని మిత్రపక్షాల నేతలతో పాటు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ నేతలకూ ఈ రక్షణ కల్పించడం గమనార్హం.ఎన్నికల సమయంలో ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు పెరగనున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను ముందుగానే సమీక్షించినట్లు సమాచారం.ఈ నిర్ణయం కేంద్ర హోంశాఖ సూచనల అనంతరం తీసుకున్నట్లు అధికార వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి.ఇదిలా ఉండగా.. 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ కూడా కసరత్తు ముమ్మరం చేసింది.వివిధ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల అవకాశాలను అంచనా వేసేందుకు సర్వేలు నిర్వహిస్తోంది.


