విశాఖపట్టణం జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.కొత్తవలసకు చెందిన మల్ల ప్రవీణ్ కుమార్ కొంతకాలంగా జీవనోపాధి కోసం పెందుర్తిలోని ఓ అద్దె ఇంట్లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు.ప్రవీణ్ కుమార్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండగా.. అతని భార్య కాయగూరల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.ఈ దంపతులకు రెండేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు ఉన్నారు.రాఖీ పండుగ సందర్భంగా నిన్న కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపిన ప్రవీణ్ కుమార్.. కుటుంబ సభ్యులకు ‘RIP’ అంటూ సందేశం పంపినట్లు సమాచారం.ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ ఆత్మహత్య చేసుకోగా.. అతని భార్య ఇద్దరు చిన్నారులతో కలిసి విషపదార్థం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ప్రవీణ్ కుమార్ భార్య, ఇద్దరు చిన్నారులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.రాఖీ పండుగ రోజున కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపిన అనంతరం ఈ విషాద ఘటన చోటుచేసుకోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.ఈ ఘటనపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.ఘటనకు దారితీసిన పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


