విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : పవిత్ర శ్రావణ మాసం ముగింపు శనివారం పురస్కరించుకుని జిల్లాలోని పలు దేవాలయాల వద్ద భక్తుల రద్దీ అనుగుణంగా ఆయా పోలీసులు చర్యలు చేపట్టారు. ముఖ్యంగా … గుంతకల్లు మండలం కసాపురం ,డి.హీరేహాళ్ మండలం మురడి, ఉరవకొండ మండలం పెన్నహోబిళం, తదితర దేవాలయాల వద్ద భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఆయా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పుణ్యక్షేత్రాలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక లైన్లు, పార్కింగ్ వసతులను పర్యవేక్షించారు. ఆలయ ప్రాంగణంలో పోలీస్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకుని శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సిబ్బందిని అప్రమత్తం చేశారు. భక్తులందరూ పోలీసుల సూచనలు పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో దైవదర్శనం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయా పోలీసులు విజ్ఞప్తి చేశారు.


