-ఇద్దరు నిందితుల అరెస్ట్, మరొకరి కోసం గాలింపు
-,రాప్తాడు సీఐ వెంకటేసులు వెల్లడి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలోని లింగనపల్లి గ్రామంలో మందలోని గొర్రెల పిల్లలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తుండగా అడ్డుకోబోయిన వారిపై దాడులకు దిగిన ముఠాను రాప్తాడు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేసులు తెలిపారు. శనివారం పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.
లింగనపల్లిలో 10 గొర్రె పిల్లలు దొంగతనానికి గురవ్వగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దొంగతనం సమయంలో అడ్డుకోబోయిన గ్రామస్తులతోపాటు, బాధితుడి బంధువుపై నిందితులు రాళ్లతో దాడి చేసి, కత్తులు, రాడ్లతో బెదిరించారన్నారు. అంతేకాకుండా కారుతో తొక్కించి చంపేందుకు యత్నించారన్నారు. బాధితులు అందించిన వాహనం నంబర్, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
అరెస్ట్ అయిన వారిలో నగర పరిధిలోని చంద్రబాబునాయుడు కొట్టాలకు చెందిన సాయి (26), రుద్రంపేట సమీపంలో నివాసముండే చిన్న అలియాస్ రవికుమార్ రెడ్డి ఉన్నారు. సాయిపై గతంలో ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ దొంగతనాలు సహా 4-5 కేసులు ఉన్నాయన్నారు. జల్సాలు, మద్యానికి అలవాటు పడిన వీరు వాహనాల్లో తిరుగుతూ ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ వివరించారు.
ఈ కేసులో రామగిరి మండలం పేరూరుకు చెందిన ధన అలియాస్ ధనుంజయ పరారీలో ఉన్నాడని, అతడు బైక్‌పై ‘పోలీస్’ అని రాసుకొని బెదిరింపులకు పాల్పడేవాడన్నారు. త్వరలోనే అతడిని కూడా అరెస్ట్ చేస్తామన్నారు. రాత్రిపూట గ్రామాల్లో అపరిచిత వ్యక్తులు కనిపిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండి డయల్ 112, 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాత్రి సమయాల్లో బ్లూకోల్ట్స్, పోలీస్ బీట్ నిరంతరం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో గంజాయి, అక్రమ పదార్థాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచామని, వ్యసనాలకు అలవాటు పడిన వారికి డి-అడిక్షన్ సెంటర్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా దొంగల ముఠాను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు.


