మురికి నీటితో అనారోగ్యం బారిన పడుతున్న గడ్డం నాగేపల్లి ప్రజలు ….
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గడ్డం నాగేపల్లి గ్రామంలో పంచాయతీ బోరు ద్వారా మురికి నీరు వస్తుండటంతో గ్రామ ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని సీపీఐ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ నాయకులు ఎంపీడీవోకు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్ మాట్లాడుతూ, గ్రామంలో ఏర్పాటు చేసిన పంచాయతీ బోర్ల నుంచి ఎర్రటి రంగులో మురికి నీరు వస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. మురికి నీటిని తాగడం వల్ల గ్రామ ప్రజలు గొంతు వాపులు, జ్వరాలు, దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కావున సంబంధిత అధికారులు వెంటనే గడ్డం నాగేపల్లి గ్రామంలోని బోరును పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తరఫున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, సహాయ కార్యదర్శి సాకే సుధాకర్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పెద్దపెద్దయ్య, సీపీఐ సీనియర్ నాయకుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


