వృద్ధుల ఆవేదన – పెన్షన్ హక్కా? లేక పన్నులు వసూలు చేసే సాధనమా?…….
విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెన్షన్ కోసం వచ్చిన వృద్ధులు, వితంతువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి లేదా సంబంధిత వివరాల కోసం కార్యాలయానికి వెళ్లిన వారికి ఇంటి పన్ను బకాయిలు చెల్లించాలని చెబుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువుల జీవన భద్రత కోసం సామాజిక భద్రతా పెన్షన్లు అందిస్తుండగా, పెన్షన్‌ను ఇంటి పన్నుతో ముడిపెట్టడం ఏ చట్టంలో ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ పథకం అర్హతల్లో బీపీఎల్ కుటుంబం, వయస్సు, ఆదాయం వంటి ప్రమాణాలు మాత్రమే ఉండగా, ఇంటి పన్ను చెల్లింపు అర్హతగా ఎక్కడా పేర్కొనలేదని గ్రామస్తులు అంటున్నారు.పెన్షన్ కోసం అడిగితే పన్ను కట్టమంటున్నారు.పన్ను కట్టే స్థోమత ఉంటే పెన్షన్ కోసం కార్యాలయాల చుట్టూ ఎందుకు తిరుగుతాం?” అంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన ధరలతో జీవనం భారంగా మారగా, సంక్షేమ పథకాల కోసం వచ్చిన పేదలపై అదనపు ఒత్తిడి తేవడం దారుణమని మండిపడుతున్నారు.పేదలకు ఆసరాగా ఉండాల్సిన పెన్షన్‌ను పన్నుల వసూళ్లకు అడ్డాగా మార్చవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి షరతులు లేకుండా పెన్షన్ మంజూరు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి స్పష్టత ఇవ్వాలని, పేదలకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.


