పెరిగిన రాజధాని విస్తీర్ణం
భారీగా భూ కేటాయింపులు
విద్య, వైద్య, ఆర్థిక, సాంకేతిక హబ్‌లు
రోడ్లు, రైల్వే అనుసంధానంతో మారన్‌ను రూపురేఖలు
విశాలాంధ్ర – సచివాలయం: రాజధాని అమరావతి సరికొత్త శోభతో విశ్వనగరంగా రూపుదిద్దుకుం టోంది. కేవలం పరిపాలనా నగరంగానే కాకుండా విద్య, వైద్య, ఆర్థిక, సాంకేతిక, ఆతిథ్య కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దే బృహత్తర ప్రణాళిక శీఘ్రగతిన ఆచరణరూపం దాలుస్తోంది. రాజధాని మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వివిధ రంగాలకు చెందిన 115 దిగ్గజ సంస్థలకు ఏకంగా 1,274.71 ఎకరాల భూకేటాయింపులు పూర్తయ్యాయి. రాయపూడి, ఉద్దండరాయునిపాలెం, శాఖమూరు, ఐనవోలు, తుళ్లూరు, నేలపాడు, మందడం తదితర గ్రామాల పరిధిలో చేపట్టిన ఈ భూకేటాయింపులతో రాజధాని ప్రాంత రూపురేఖలు వేగంగా మారిపోతున్నాయి. వికేంద్రీకృత ప్రణాళికతో అమరావతిలోని ప్రతీ గ్రామానికి ఒక్కో రకమైన విశిష్టతను సంతరింపజేస్తూ ప్రభుత్వం ఈ క్లస్టర్లను అత్యంత ఆకర్షణీయంగా డిజైన్ చేసింది. రాజధాని విస్తరణ ప్రణాళికల్లో భాగంగా అమరావతి పరిధి గణనీయంగా పెరిగింది. మొదటి దశలో 54,374 ఎకరాలు, రెండో దశలో 20,494 ఎకరాలు, మూడో దశలో మోతడకలో 2,344 ఎకరాలు, తాడికొండ, కంతేరు పరిధిలో 6,212 ఎకరాలు కలిపి మొత్తంగా రాజధాని విస్తీర్ణం సుమారు 83,424 ఎకరాలకు చేరుకుంది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగురోడ్డు, ఎర్రుపాలెం-నంబూరు బ్రాడ్ గేజ్ రైల్వేలైను నిర్మాణం కోసం ప్రభుత్వం 6,212 ఎకరాల భూమి సమీకరించనుంది. గుంటూరు జిల్లా కంతేరులో 974 ఎకరాలు, తాడికొండ గ్రామంలో 5,238.50 ఎకరాలు సమీకరణ పద్ధతిలో తీసుకోనున్నారు. ఆయా గ్రామాల్లో సమీకరణకు ఇవ్వని వారి నుంచి భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకునేందుకు, అలాగే ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం పూర్తి అధికారాలు కట్టబెట్టింది. పట్టా, వక్ఫ్, దేవాదాయ భూములు కలిపి కంతేరు రెవెన్యూ పరిధిలో 3,299.26 ఎకరాలు, తాడికొండ పరిధిలో 11,216.12 ఎకరాలు కలిపి మొత్తం 14,515.38 ఎకరాలు ఉన్నాయి. వీటితో పాటు కంతేరులో ప్రభుత్వ భూమి 304 ఎకరాలు, తాడికొండలో 1,445 ఎకరాలు కలిపి మొత్తం 1,750 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. కంతేరు గ్రామంలో రైల్వేలైన్ కోసం 148.30 ఎకరాలు, ఇన్నర్ రింగురోడ్డు కోసం 58 ఎకరాలు, గ్రిడ్ రోడ్ల కోసం 35.65 ఎకరాలు కలిపి మొత్తం 241.98 ఎకరాలు మౌలిక వసతుల కోసం వినియోగించనున్నారు. అదేవిధంగా ఎల్పీఎస్ కింద 947 ఎకరాలు సమీకరించనున్నారు. తాడికొండ పరిధిలో రైల్వేలైను కోసం 701.26 ఎకరాలు, ఐఆర్ఆర్ కోసం 167.79 ఎకరాలు, గ్రిడ్ రోడ్ల కోసం 470.31 ఎకరాలు కలిపి మొత్తం 1,338.34 ఎకరాలు వినియోగించనున్నారు. మొత్తంగా 5,238.50 ఎకరాలు సమీకరణ పద్ధతిలో సేకరించనున్నారు. కంతేరు, తాడికొండ గ్రామాల్లో సమీకరణ కింద భూములివ్వని వారితో పాటు పెదకాకాని మండల పరిధిలోని కొప్పరావూరు, పెదకాకాని గ్రామాల్లో రైల్వేలైన్ అలైన్మెంట్ పరిధిలో రెండువైపులా 50 మీటర్ల వెడల్పుతో మొత్తం 100 మీటర్ల బఫర్ భూసేకరణను ప్రారంభించేందుకు సీఆర్డీఏ కమిషనర్‌కు సర్కార్ పూర్తి అధికారాలు ఇచ్చింది.
విద్యాకేంద్రగా శాఖమూరు, కురగల్లు
అమరావతికి కేటాయించిన మొత్తం భూమిలో సింహభాగం (66.74శాతం – 850.70 ఎకరాలు) విద్యా రంగానికే దక్కింది. రాజధానిని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా మార్చేలా ఎస్ఆర్ఎం (ఎస్ఆర్ఏం-200 ఎకరాలు), వీఐటీ (విట్-200 ఎకరాలు), అమృత విశ్వవిద్యాలయం (150 ఎకరాలు) వంటి ప్రపంచస్థాయి వర్సిటీలకు స్థలాలు కేటాయించారు. వీటితో పాటు బిట్స్ పిలాని (70.01 ఎకరాలు), ఎక్స్ఏల్ఆర్ఐ (61.79 ఎకరాలు), లా యూనివర్సిటీ (55 ఎకరాలు), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్-ఎన్ఐడీ (50 ఎకరాలు) వంటి ప్రతిష్టాత్మక సంస్థలతో పాటు కేంద్రీయ విద్యాలయ, డీఏవీ, పొదార్, సేంకాట్ మరియా, ర్యాన్ వంటి అంతర్జాతీయ పాఠశాలలు కొలువుదీరను న్నాయి. ఆర్థిక లావాదేవీలకు, బ్యాంకింగ్ రంగానికి ప్రధాన కేంద్రంగా ఉద్దండరా యునిపాలెం రూపుదిద్దుకుంటోంది. ఇక్కడ ఆర్బీఐ, ఎస్బీఐ, పీఎన్బీ, కెనరా, ఐడీబీఐ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, నాబార్డ్, ఎల్ఐసీ సహా 13 ఆర్థిక సంస్థల కార్పొరేట్ ఆఫీసులకు స్థలాలు ఖరారయ్యాయి. బ్యాంకింగ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస కాంప్లెక్స్‌ల కోసం ఇనవోలు పరిధిలో భూకేటాయింపులు పూర్తి చేశారు.
రాజధాని కేంద్రంగా పనిచేసే పాలనా విభాగాల కోసం రాయపూడి వద్ద భూముల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఇక్కడ విదేశీ భవన్(ఏంఈఏ-2 ఎకరాలు), సీబీఐకి 2 ఎకరాలు, ఇన్కమ్ టాక్స్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ డిపార్ట్మెంట్ 5.53 ఎకరాలు, పోస్టల్, కాగ్, సీబీఎస్ఈ రీజినల్ ఆఫీసులకు స్థలాలు ఖరారయ్యాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ ఒకే ప్రాంగణం వద్ద కొలువుదీరేలా రాయపూడి నిలవనుంది.
50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ
భవిష్యత్ సాంకేతికతకు, ఐటీ పరిశోధనలకు మహరÝశ తెచ్చేలా అమరావతిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పట్టాలెక్కింది.ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం సరిహద్దుల్లో ఐటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్‌టెక్ పరిశోధనల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 50 ఎకరాల్లో ‘క్వాంటమ్ వ్యాలీ’ ని కేటాయించింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక ఆవిష్కరణలకు వేదికగా మారనుంది.
రాజధాని ప్రజలతో పాటు ఉద్యోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేలా మెడికల్ విలేజ్‌ను డిజైన్ చేశారు. నెక్కల్లు వద్ద 25 ఎకరాల భారీ విస్తీర్ణంలో ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించనున్నారు. తుళ్లూరులో బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ (21 ఎకరాలు), నిడమర్రులో బైజర్ మెడికల్ కాలేజ్ (23 ఎకరాలు), అబ్బరాజుపాలెంలో డాక్టర్ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ (12 ఎకరాలు) కొలువుదీరనున్నాయి. యువతలో క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు రాజధానిలో ప్రముఖ స్పోర్ట్స్ అకాడమీలు అడుగుపెడుతున్నాయి. అబ్బరాజుపాలెంలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (12 ఎకరాలు), పిచ్చికలపాలెంలో ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ (12 ఎకరాలు) నిర్మించేందుకు భూముల కేటాయింపులు పూర్తయ్యాయి.
పర్యాటక, ఆధ్యాత్మిక రంగాలకు పెద్దపీట వేశారు. హయాత్ 6.5 ఎకరాలు, కోర్ట్‌యార్డ్ బై మ్యారియట్, వరుణ్ హాస్పిటాలిటీ, దస్పల్లా, గ్రీన్ పార్క్ స్టార్ హోటళ్లకు స్థలాలు దక్కాయి. వెంకటపాలెంలో తిరుమల తిరుపతి దేవస్థానం కోసం 25 ఎకరాలు, తుళ్లూరులో బ్రహ్మకుమారీస్ (10 ఎకరాలు), అనంతవరంలో ఈషా ఫౌండేషన్ (3.75 ఎకరాలు), ఆర్ట్ ఆఫ్ లివింగ్, రామకృష్ణ మిషన్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ భూకేటాయింపుల ద్వారా అమరావతి ప్రాంతంలోకి భారీగా ప్రైవేట్, ప్రభుత్వ పెట్టుబడులు రానున్నాయి. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, కార్పొరేట్ ఆఫీసుల నిర్మాణాలు ప్రారంభమై అందుబాటులోకి వస్తే స్థానిక యువతకు పెద్దఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా రాజధాని రీజియన్‌లో రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగాలు మునుపెన్నడూ లేని స్థాయిలో వేగంగా పుంజుకుంటాయని ఆర్థిక రంగ విశ్లేషకులు భావిస్తున్నారు.


