ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. దరఖాస్తుల స్వీకరణ గడువును మరో రెండు రోజుల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ ప్రక్రియ, ఈ నెల 16వ తేదీతో ముగియాల్సి ఉండగా, తాజాగా దానిని సెప్టెంబర్ 18వ తేదీ వరకు పొడిగించారు.
గడువు పొడిగింపుపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారిక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. సెలవులు లేదా ఇతర కారణాల వల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారు, ఈ రెండు రోజుల అదనపు సమయంలో తమ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అవసరమైన పత్రాలతో ఆన్లైన్ నమోదు, ఈ-కేవైసీ పూర్తి చేసిన తర్వాత దరఖాస్తుదారులకు రసీదులను అందజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులు, వితంతువుల పింఛన్‌ను రూ.4,000లకు, దివ్యాంగుల పింఛన్‌ను రూ.6,000లకు పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 61.92 లక్షల మంది ప్రతినెలా పింఛన్లు అందుకుంటున్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన అనంతరం, క్షేత్రస్థాయి పరిశీలన జరిపి కొత్త లబ్ధిదారులకు పింఛన్లను మంజూరు చేయనున్నారు.


