కర్ణాటకలో వందేమాతరం విషయంలో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదం ముదురుతోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో వందేమాతరంలోని తొలి రెండు చరణాలనే పాడాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హోంమంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే సమర్థించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు బీవై విజయేంద్ర, ఆర్. అశోక్‌కు ఆయన సవాల్ విసిరారు.విజయేంద్ర, అశోక్ టెలీప్రాంప్టర్ చూడకుండా, కాగితం సాయం లేకుండా వందేమాతరంలోని అన్ని చరణాలను పాడాలని ఖర్గే సవాల్ చేశారు. అలా పాడితే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు.
ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీపైనా ఆయన విమర్శలు చేశారు. వందేమాతరంలోని రెండు చరణాలనే పాడాలని తమ పూర్వీకులు నిర్ణయించారని చెప్పారు. ఇప్పుడు అన్ని చరణాలు పాడాలని బీజేపీ, ప్రధాని మోదీ చెబుతున్నారని వ్యాఖ్యానించారు. జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ కంటే వారు గొప్పవారా? అని ప్రశ్నించారు.
వందేమాతరం 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా జనవరిలో కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయగీతం ‘జనగణమన్ణతో పాటు వందేమాతరం ఆలపించే సందర్భాల్లో ముందుగా మొత్తం ఆరు చరణాలను పాడాలని సూచించింది. దీనికి విరుద్ధంగా ఆగస్టు 19న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1937లో తీసుకున్న నిర్ణయాన్నే అనుసరించాలని నిర్ణయించింది. పార్టీ కార్యక్రమాల్లో రెండు చరణాలనే పాడాలని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంగళవారం కర్ణాటక హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. న్యాయవాది గిరీశ్ భరద్వాజ్ ఈ పిటిషన్ వేశారు. కేంద్ర హోంశాఖ 2026 జులై 9న అన్ని రాష్ట్రాలకు వందేమాతరంపై ఆదేశాలు పంపిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పూర్తి ఆరు చరణాలతో ఉన్న అధికారిక రూపాన్నే సామూహిక గానంలో ఉపయోగించాలని కేంద్రం సూచించిందని తెలిపారు.కేంద్ర ఆదేశాలకు కర్ణాటక ప్రభుత్వ ఉత్తర్వులు విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టును కోరారు.


